‘ప్రతిభా’ధిపతి ... బలరామయ్య
కుటుంబంలో తల్లిదండ్రులు ఎంతటి ముఖ్యులో సినీ నిర్మాణంలో దర్శక నిర్మాతలు అంటే ముఖ్యులు. దర్శకుడు తండ్రిగా నిర్మాణానికి సారధ్యం వహిస్తే, తల్లిగా నిర్మాత వనరులు సమకూరుస్తాడు. టాకీ చిత్రాలు వచ్చిన కొత్తల్లో రంగస్థల నాటకాలనే సినిమాలుగా నిర్మించారు. నాటకాల్లో పాత్రలు పోషించిన నటీనటులే సినిమాల్లో వారివారి పాత్రలు పోషించారు. వేమూరి గగ్గయ్య, రామనాథ శాస్త్రి, చిలకలపూడి సీతారామాంజనేయులు, బళ్ళారి రాఘవ, పులిపాటి, తుంగల చలపతి, రామతిలకం, కన్నాంబ, శ్రీరంజని (సీనియర్‌), శాంతకుమారి వంటి నటరత్నాలు ఆరోజుల్లో తెలుగు వెండితెరను అలరించారు. తొలి నాలుగేళ్లలో కేవలం పౌరాణిక చిత్రాలే రాగా, 1936లో తొలిసారి ‘ప్రేమవిజయం’ అనే సాంఘిక సినిమా విడుదలైంది. దానిని నిర్మించినవారు కృత్తివెంటి నాగేశ్వరరావు. అయితే ఆ చిత్రం వైపు ప్రేక్షకులు మొగ్గు చూపలేదు. తరువాత గూడవల్లి రామబ్రహ్మం సాంఘిక దురాచారాలను దుయ్యబడుతూ నిర్మించిన ‘మాలపిల్ల’ (1938) సినిమా విజయవంతమైంది. వాహినీ సంస్థ ‘వందేమాతరం’ (1939) చిత్రాన్ని, వై.వి.రావు ‘మళ్లీపెళ్లి’ (1939) చిత్రాన్ని నిర్మించి సాంఘిక చిత్రాల విలువలను పెంచారు. అయితే దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య 1948లో నిర్మించిన ‘బాలరాజు’ చిత్రం వసూలు చేసినట్టు మరే ఇతర చిత్రం కూడా వసూలు చేయలేదని, ఆ సినిమా ఆడినట్టు మరే ఇతర చిత్రమూ ఆడలేదని గణాంకాలు రుజువు చేస్తున్నాయి. చిన్న చిన్న కేంద్రాల్లో కూడా ‘బాలరాజు’ 30 వారాలు సునాయాసంగా నడిచింది. ఆ సినిమా అదేపనిగా ఆడుతున్నందు వలన కొన్ని ఊళ్లలో కొత్త సినిమా హాళ్లు వెలిశాయి. జెమినీ వారి ‘చంద్రలేఖ’ సినిమా కూడా ఆ పోటీకి తట్టుకోలేనంతగా ఇబ్బంది పడింది. అంతటి రికార్డు నెలకొల్పిన ఆ చిత్ర దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య అనుభవజ్ఞుడు, సరసుడు, సహృదయుడు, స్నేహపాత్రుడు, నిరాడంబరుడు, దాత. ఆయన తన సహచరులతో శాశ్వత సంబంధాలను నెరపుతూ వారి అభిమానానికి, ఆదరణకు పాత్రుడైన వాడు. జులై 5న ఘంటసాల బలరామయ్య 113వ జయంతి. ఆ సందర్భంగా ఆ చలనచిత్ర పితామహుని గుర్తుచేసుకుంతూ కొన్ని విశేషాలు తెలుసుకుందాం .....


* బాల్యం నుండే నాటకాల ధ్యాస...
ఘంటసాల బలరామయ్య నెల్లూరు జిల్లా పొట్టేపాలెం గ్రామంలో జూలై 5, 1906న జన్మించారు. నలుగురు అన్నదమ్ముల మధ్య బలరామయ్య మూడవ వారు. వారి సోదరుల్లో సూర్యరామయ్య గూడూరు వద్ద సైదాపురంలో మైకా గనుల్లో పనిచేసేవారు. రెండవ సోదరుడు రాధాకృష్ణయ్య రంగస్థల నటులు. కబీరు పాత్రను పోషించడంలో నిష్ణాతుడు. తమ్ముడు శేషాచలం కూడా నాటకాలలో అడపాదడపా పాత్రలు పోషించేవారు. బలరామయ్య తండ్రి చిన్నతనంలోనే మరణించారు. దాంతో బలరామయ్య తన పెద్దన్నయ్య సూర్యరామయ్య వద్దే నెల్లూరులోనే పెరిగారు. అక్కడే స్కూలు ఫైనలు పూర్తిచేశారు. తరువాత కోఆపరేటివ్‌ ఇనస్పెక్టర్‌ ఉద్యోగం కోసం శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే బలరామయ్యకు జీవనోపాధి లభించలేదు. దాంతో తను కూడా రెండవ అన్నయ్య రాధాకృష్ణయ్య అడుగుజాడల్లో నాటకాలను నమ్ముకొని నటించడం ఆరంభించారు. బలరామయ్య గొంతు శ్రావ్యంగా వుండేది. పాటలు చక్కగా పాడేవారు. నాటకాల్లో రామదాసు, కబీరు పాత్రలు ధరించి పాడుతున్నప్పుడు వన్స్‌మోర్ల అరుపులతో చప్పట్లు మారుమ్రోగేవి. అలా రెండేళ్లపాటు నాటకాలు ప్రధానోపాధిగా, వృత్తిగా భావించి గడిపిన బలరామయ్యకు ఆ సమయంలోనే వివాహమైంది. టాకీలు వచ్చిన కొత్తల్లో... అంటే 1932 ప్రాంతంలో బెంగాల్‌ మార్వాడి వ్యాపారి ఆర్‌.ఎం.ఖేమ్కా కలకత్తాలో ఈస్ట్‌ ఇండియా ఫిలిం కంపెనీ నెలకొల్పి బెంగాలి, ఉర్దూ, హిందీ, తెలుగు, తమిళం వంటి వివిధ ప్రాంతీయ భాషల్లో సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. ఆరోజుల్లోనే ఈ కంపెనీలో మిచ్చెల్‌ కెమెరాలు, లొకేషన్లకు మోసుకెళ్లి అక్కడే రికార్డింగ్‌ చేయు సదుపాయంగల ఆర్‌.సి.ఎ ఫోటోఫోన్లు వంటి ఆధునిక చిత్రనిర్మాణ సామాగ్రి వుండేది. అందుకే ఎక్కువ సినిమాలు ఇక్కడే నిర్మితమయ్యేయ్యేవి. 1933లో ఈస్ట్‌ ఇండియా ఫిలిం కంపెనీ వారు అఖ్తర్‌ నవాజ్‌ దర్శకత్వంలో ‘రామదాసు’ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. అప్పట్లో బళ్ళారి రాఘవ, ధర్మవరం గోపాలాచార్యులు ‘రామదాసు’ నాటకాన్ని ప్రదర్శిస్తూ వుండేవారు. అదే నాటక స్క్రిప్టుని సినిమాగా తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు అందులో కబీరుగా నటించేందుకు బలరామయ్య అన్న రాధాకృష్ణయ్యకు, రాముడుగా నటించేందుకు మరో అన్న శేషాచలంకు ఆహ్వానాలు అందాయి. అన్నలతోబాటు తను కూడా కలకత్తా ప్రయాణమయ్యారు. ఆ చిత్రంలో బలరామయ్యకు నటించే అవకాశం రాలేదు. అయితే అక్కడే వుండి చిత్రనిర్మాణ మెలకువలను ఆకళింపు చేసుకున్నారు. ఆ తరువాత నెల్లూరు తిరిగి వచ్చి స్నేహితుల ఆర్ధిక సహకారంతో ‘శ్రీరామా ఫిలిమ్స్‌’ అనే చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పారు. తొలి ప్రయత్నంగా ‘సతీ తులసి’ (1936) సినిమాను నిర్మించారు. దానికి బలరామయ్య ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరించారు. సినిమాలో ఘంటసాల రాధాకృష్ణయ్య నారదుడిగా, వేమూరి గగ్గయ్య జలంధరుడుగా, మాధవపెద్ది వెంకట్రామయ్య శివుడుగా, దొమ్మేటి సత్యనారాయణ విష్ణుమూర్తిగా, రామతిలకం బృందగా, శ్రీరంజని (సీనియర్‌) పార్వతిగా నటించారు. ఘంటసాల శేషాచలం కూడా ఋషి పాత్రను పోషించారు. ఈ చిత్రానికి కవికోకిల దువ్వూరి రామిరెడ్డి సంభాషణలు, భీమవరపు నరసింహారావు సంగీతం సమకూర్చగా చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించారు. సినిమా విజయవంతంగా ఆడినా కారణాంతరాల వల్ల బలరామయ్య శ్రీరామా ఫిలిమ్స్‌ సంస్థ నుండి బయటకు వచ్చి వెంకురెడ్డిని భాగస్వామిగా చేర్చుకుని ‘కుబేరా పిక్చర్స్‌’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. మద్రాసులో కుబేరా పేరుతో స్టూడియో కూడా నిర్మించారు. ఆ స్టూడియోలో బొమ్మన్‌ ఇరానీ కెమెరామాన్‌గా పనిచేసేవారు. 1938లో కుబేరా ఫిలిమ్స్‌ బ్యానర్‌ మీద ‘భక్త మార్కండేయ’ చిత్రాన్ని నిర్మించారు. చిత్రపు నారాయణమూర్తి ఈ సినిమాకు దర్శకుడు. మార్కండేయుడుగా జి.ఎం.స్వామి నటించగా యమధర్మరాజు పాత్రను వేమూరు గగ్గయ్య పోషించారు. ఘంటసాల రాదాకృష్ణయ్య, రాయప్రోలు, శ్రీరంజని, శాంతకుమారి ఇతరపాత్రలు పోషించారు. తరువాత చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలోనే 1940లో ‘మైరావణ’ సినిమాను నిర్మించారు. అందులో కాంచనమాల నాయికగా నటించింది. వేమూరు గగ్గయ్య, నెల్లూరు రామిరెడ్డి, రాయప్రోలు సుబ్రహ్మణ్యం, ఘంటసాల శేషాచలం, సుబ్రహ్మణ్యకుమారి, జయగౌరి ఇతర పాత్రలు పోషించగా, గాలి పెంచలనరసింహారావు సంగీత సహకారం అందించారు. ఈ రెండు సినిమాల నిర్మాణ అనంతరం భాగస్వామి వెంకురెడ్డితో అభిప్రాయ భేదాలొచ్చి కుబేరా సంస్థతోబాటు, స్టూడియోను కూడా వదలి బయటకు వచ్చేశారు. తన ముక్కుసూటి తనమే విభేదాలకు కారణం. బలరామయ్య నిష్క్రమణతో శ్రీరామా ఫిలిమ్స్‌ లాగే కుబేరా సంస్థ కూడా కొంతకాలానికి అంతరించిపోయింది.* ‘ప్రతిభా పిక్చర్స్‌’ ఆవిర్భావం...
1941లో దర్శక నిర్మాత పి.పుల్లయ్య సహకారంతో బలరామయ్య స్వంతంగా ‘ప్రతిభా పిక్చర్స్‌’ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘పార్వతి పరిణయం’ లేక ‘పార్వతి కళ్యాణము’(1941) చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రానికి నిర్మాతే కాకుండా బలరామయ్య దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. కవికోకిల దువ్వూరు రామిరెడ్డి సంభాషణలు సమకూర్చగా, దైతా గోపాలం పాటలు రాశారు. హెచ్‌.యమ్‌.వి.కంపెనీ ఆర్కెస్ట్రా సహకారంతో ఈ సినిమాకు ఓగిరాల రామచంద్రరావు సంగీతం సమకూర్చారు. మద్రాసులోని వేల్‌ పిక్చర్స్‌ స్టూడియోలో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రంలో బలరామయ్య అన్న రాధాకృష్ణయ్య శివుడుగా, ప్రభల సత్యనారాయణ నారదుడుగా, బలరామయ్య మరో సోదరుడు శేషాచలం మన్మధుడుగా, కె.శ్రీనివాసరావు ఇంద్రుడుగా, శాంతకుమారి పార్వతిగా, లక్ష్మీదేవి మేనకగా, వేంకటగిరి రతీదేవిగా నటించారు. ఈ సినిమా నుంచే బలరామయ్య దర్శక నిర్మాతగా కొనసాగారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌ దేశం కోస్తా పట్టణాల మీద బాంబులు వేయడంతో, మద్రాసు నగరం మీద కూడా బాంబులు వేస్తారని ప్రచారం జరగడంతో జనం మద్రాసు విడిచిపెట్టి వెళ్లిపోసాగారు. దాంతో పెద్దపెద్ద స్టూడియోలు మూతపడ్డాయి. చిత్రనిర్మాణం కుంటుపడింది. పరిస్థితులు సర్దుకున్నాక 1943లో బలరామయ్య తన రెండవచిత్రం ‘గరుడ గర్వభంగం’ సినిమా నిర్మించారు. ఇందులో బలరాముడుగా వేమూరు గగ్గయ్య, నారదుడుగా రామకృష్ణశాస్త్రి, గరుడుడుగా వేదాంతం రాఘవయ్య, కృష్ణుడుగా భరతశాస్త్రి, సత్యభామగా భానుమతి, రుక్మిణిగా హేమలత నటించారు. బలిజేపల్లి లక్ష్మీకాంతకవి రచనకు ఓగిరాల రామచంద్రరావు సంగీతం అందించారు. సినిమారంగం నుంచి తప్పుకున్న వేదాంతం రాఘవయ్య ఈ చిత్రం ద్వారా పునఃప్రవేశం చేశారు. సినిమాల పంపిణీదారు పూర్ణా పిక్చర్స్‌ మంగరాజుతో బలరామయ్యకు పొత్తు కుదిరింది. వీరి పొత్తు అలా ‘శ్రీలక్షమ్మ కథ’ (1950) దాకా కొనసాగింది. 1944లో బలరామయ్య నిర్మాణ దర్శకత్వంలో ‘శ్రీ సీతారామ జననం’ చిత్రనిర్మాణం ప్రారంభించి అక్కినేని నాగేశ్వరరావును వెండితెరకు పరిచయం చేశారు. చిత్రం 1944 నవంబరు 22న ఆంధ్రదేశమంతటా విడుదలైంది. ఈ సినిమాలో శాంతకుమారి అక్కినేనికి హీరోయిన్‌గా నటించడం విశేషం. వేమూరు గగ్గయ్య రావణుడుగా, పరశురాముడిగా రెండు పాత్రలు పోషించగా, బలిజేపల్లి విశ్వామిత్రుడుగా, తీగల వెంకటేశ్వర్లు దశరథుడుగా, పారుపల్లి సుబ్బారావు జనకుడుగా నటించారు. కమలా కొట్నీస్‌ కైకేయి పాత్రలో జీవించింది. ఋష్యేంద్రమణి కౌసల్య పాత్ర పోషించింది. దువ్వూరు రామిరెడ్డి సంభాషణలు, ప్రభల సత్యనారాయణ, ఓగిరాల రామచంద్రరావు సంయుక్తంగా సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా తరువాత బలరామయ్య పౌరాణిక సినిమాల నిర్మాణానికి స్వస్తి చెప్పి జానపదచిత్ర నిర్మాణంపై మొగ్గు చూపారు.* జానపద చిత్రాల నిర్మాణంలో...
ఘంటసాల బలరామయ్య జానపద చిత్రాల నిర్మాణానికి ఆసక్తి చూపడానికి ఒక కారణముంది. నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం ‘మాయాలోకం’ (1945) సినిమా నిర్మించి మంచి హిట్‌ నమోదుచేయడం అతనికి జానపద చిత్ర నిర్మాణం మీద మోజు పెంచింది. ఆయన నిర్మించిన తొలి జానపదచిత్రం ‘ముగ్గురు మరాఠీలు’ (1946). న్యూటోన్‌ స్టూడియోలో నిర్మించిన ఈ చిత్రానికి దర్శకనిర్మాత బలరామయ్యే. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, గోవిందరాజుల సుబ్బారావు, సిహెచ్‌.నారాయణరావు, కస్తూరి శివరావు, కన్నాంబ, రాజకుమారి, టి.జి.కమలాదేవి, బెజవాడ రాజరత్నం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో శివరావు ఒక్కసారిగా తారాపథాన్ని అందుకున్నాడు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సంభాషణలు సమకూర్చగా, ఓగిరాల రామచంద్రరావు సంగీతం అందించారు. గేయరచయిత వెన్నెలకంటి తండ్రి కోటేశ్వరరావు బలరామయ్య వద్ద ప్రొడక్షన్‌ చీఫ్‌గా పనిచేశారు. సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా అక్కినేనిని హీరోగా నిలబెట్టింది. ఇందులో అక్కినేని ‘చల్‌ చలో వయ్యారి’ అనే పాటను సొంతంగా పాడుకున్నారు. అక్కినేనికి ఇది మూడవ సినిమా. బెజవాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి కేంద్రాల్లో ‘ముగ్గురు మరాఠీలు’ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. మరాఠీ కళాకారులు చెప్పే బుర్రకథనే సినిమాగా మలిచారు కనుకనే ఈ సినిమాకు ‘ముగ్గురు మరాఠీలు’ అని పేరు పెట్టారు.


* బలరామయ్యకు బెజవాడలో చిక్కిన అక్కినేని...
అది 1944వ సంవత్సరం మండువేసవి కాలం. ముదినేపల్లి ఎక్సెల్సియర్‌ డ్రమాటిక్‌ అసోసియేషన్‌ బృందం తెనాలి పట్టణంలో నాటకం ప్రదర్శించి గుడివాడ వెళ్లేందుకు ఉదయాన్నే మద్రాస్‌-పూరి ప్యాసింజర్‌ ఎక్కి బెజవాడ (విజయవాడ) రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ బృందానికి నాయకుడు దుక్కిపాటి మధుసూదనరావు, నాటక నిర్వాహకుడు కోడూరు అచ్చయ్య చౌదరి. బెజవాడ రైల్వే స్టేషన్‌లో మద్రాసు వెళ్లేందుకు గ్రాండ్‌ ట్రంక్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య ప్లాట్‌ ఫారం మీద వెయిట్‌ చేస్తున్నారు. ఇంతలో పూరి ప్యాసింజర్‌లో ఒక అబ్బాయి కిటికీలోంచి చూస్తూ ఆయన కంటపడ్డారు. అతడే దుక్కిపాటి వారి నాటక సమాజంలో ఆడవేషాలు వేసే అక్కినేని నాగేశ్వరరావు. అప్పుడు బలరామయ్య ‘సీతారామ జననం’ సినిమా కోసం నటీనటుల ఎంపిక పనిలో వున్నారు. రాముడి వేషానికి ‘అక్కినేని’ అయితే బాగుంటుందనిపించి ‘సినిమాలలో నటిస్తావా’ అని అడిగారు. అంతకు ముందే బాలనటుడిగా ‘ధర్మపత్ని’ (1939)లో చిన్న వేషం కట్టిన అక్కినేనికి ‘రైతుబిడ్డ’, ‘తల్లిప్రేమ’ వంటి సినిమాల్లో నటించేందుకు అవకాశం ఇస్తానని చెప్పి తప్పించుకున్న నిర్మాతల వ్యవహారశైలి నచ్చని అక్కినేని అన్నయ్య రామబ్రహ్మం మొదట ‘నో’ అని చెప్పినా, బలరామయ్య ఇచ్చిన భరోసాతో ‘సరే’ అన్నారు. మేకప్‌ మ్యాన్‌ మంగయ్యది కూడా గుడివాడే కావడంతో అక్కినేనికి చక్కగా మేకప్‌ చేసి బాల్యంలో రాముడు ఇలాగే ఉండేవాడు కాబోలు అనేలా తీర్చి దిద్దారు. అలా అక్కినేని 8మే నెల 1944న మైలాపూరులోని ప్రతిభా పిక్చర్స్‌ ఆఫీసులో అడుగిడి 68 ఏళ్ళపాటు తిరుగులేని నాయకుడిగా తెలుగు చలనచిత్రసీమను ఏలారు. అందుకే దేవుడంటే నమ్మని అక్కినేని ఘంటసాల బలరామయ్యనే దేవుడిగా రోజూ మనసులో నమస్కరించి ఏ కార్యక్రమానికైనా వెళ్లడం అలవాటు చేసుకున్నారు.


* బాక్సాఫీస్‌ హిట్‌గా బాలరాజు...
ఈ చిత్ర విజయంతో బలరామయ్య 1948లో ‘బాలరాజు’ సినిమా నిర్మించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈ సినిమా ఒక కొత్త శకానికి నాంది పలికింది. తెలుగులో సిల్వర్‌ జూబిలీ చేసుకున్న తొలిచిత్రం ‘బాలరాజు’. విజయవాడ జైహింద్‌ టాకీసులో జూన్‌ 4న రజతోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. విజయవాడలో సంవత్సరంపాటు ఈ చిత్రం బ్రేక్‌ లేకుండా ఆడి రికార్డు సృష్టించింది. అలాగే 11 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని 30 వారాలకు పైగా ఆడింది. వసూళ్లపరంగా ‘బాలరాజు’ అనేక పాత రికార్డులను తుడిచిపెట్టి నూతన రికార్డులను సృష్టించింది. ఈ సినిమా విజయంతో అనేక పట్టణాలలో, పల్లెల్లో కొత్త సినిమా హాళ్లు వెలిశాయి. జెమినీ వారు నిర్మించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘చంద్రలేఖ’ ‘బాలరాజు’ ముందు పోటీకి నిలవలేకపోయింది. అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, ఎస్‌.వరలక్ష్మి, శివరావు, బెజవాడ రాజరత్నం ఈ చిత్రంలో ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి గాలి పెంచల నరసింహారావు సంగీతం సమకూర్చగా ఘంటసాల వెంకటేశ్వరరావు ఆయనకు సహాయకుడుగా పనిచేశారు.


* ‘స్వప్నసుందరి’ని నిలువరించిన లక్ష్మమ్మ...
‘బాలరాజు’ చిత్రం తరువాత బలరామయ్య అక్కినేని, అంజలీదేవితో ’స్వప్నసుందరి’ సినిమా ప్రారంభించారు. ఈమధ్యలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. 1947లో నిర్మాత పెందుర్తి సుబ్బారావు మహతి పిక్చర్స్‌ బ్యానర్‌ మీద ‘లక్ష్మమ్మ’ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. త్రిపురనేని గోపీచంద్‌ కథ, సంభాషణలు సమకూర్చి దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నారు. సి.హెచ్‌.నారాయణరావు హీరోగా, మాలతి హీరోయిన్‌గా, నిర్మాత సుబ్బారావు భార్య సులోచన వ్యాంప్‌గా నటించే ఒప్పందం కుదిరింది. బాలాంత్రపు రజనీకాంతరావు ‘తారానాధ్‌’ అనే కలం పేరుతో నాలుగు పాటలు స్వరపరచి రికార్డు కూడా చేశారు. కొన్నిరోజులు మాత్రమే షూటింగు జరిగి, ఎందుకో ఆగిపోయింది. అలా మూడేళ్లుగా మూలపడిన ‘లక్ష్మమ్మ’ సినిమా హక్కులను శోభనాచల స్టూడియో నిర్మాత మీర్జాపురం రాజా భార్య కృష్ణవేణి కొని గోపీచంద్‌నే దర్శకుడిగా కొనసాగించి సంగీత దర్శకత్వ పగ్గాలను ఘంటసాలకు అప్పగించింది. ఈ వార్త ఘంటసాల బలరామయ్య వద్దకు చేరింది. అయితే అంతకుముందే లక్ష్మమ్మ కథను బలరామయ్య సినిమాగా తీయాలనే యోచనలో వున్నారు. మీర్జాపురం రాజా ‘లక్ష్మమ్మ’ సినిమా తీస్తున్నారని తెలిశాక ‘స్వప్నసుందరి’ సినిమా నిర్మాణానికి విరామం ప్రకటించి, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి చేత స్క్రిప్టు రాయించి పోటీగా ‘శ్రీలక్ష్మమ్మ కథ’ పేరుతో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. బలరామయ్య ప్రొడక్షన్‌ మేనేజర్‌ టి.వి.ఎస్‌.శాస్త్రి ‘స్వప్నసుందరి’ చిత్రాన్ని ముందు పూర్తిచేయమని సలహాచ్చారు. బలరామయ్య వినలేదు. ‘స్వప్నసుందరి’ సినిమా కోసం బుక్‌ చేసిన అక్కినేని, అంజలీదేవి, జి.వరలక్ష్మి, కస్తూరి శివరావుల కాల్షీట్లు ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ సినిమా కోసం వాడుకుంటూ, చాలా ఖర్చుపెట్టి పోటీ సినిమా నిర్మించారు. ఆ రోజుల్లో అంజలీదేవి ‘వ్యాంప్‌’ పాత్రలకే పరిమితమై వుండేది. అటువంటి అంజలీదేవిని హీరోయిన్‌గా ప్రవేశపెట్టి అగ్రతారగా ఎదిగేందుకు దోహదపడిన వ్యక్తి బలరామయ్య. దర్శకుడు గోపీచంద్‌ ముఖ్య తారాగణంతో వున్న సన్నివేశాలను చిత్రీకరించగా, ఇంటూరి వెంకటేశ్వరరావు మిగిలిన చిత్రీకరణ పూర్తిచేశారు. చిత్రపు నారాయణమూర్తి కూడా ఈ చిత్ర నిర్మాణానికి గోపీచంద్‌తో కలిసి పనిచేశారు. శోభనాచల స్టూడియో చేతిలో ఉండడంతో రెండు ఫ్లోర్లలో చిత్రీకరణ జరిపి ఖర్చులు తగ్గించుకున్నారు. కానీ ఘంటసాల బలరామయ్య మాత్రం పంతానికి, పోటీకి వెళ్లి భారీగా ఖర్చు చేసి పోటీగానే విడుదల చేశారు. శోభనాచలవారి ‘లక్ష్మమ్మ’, ప్రతిభా వారి ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ సినిమాలు ఒకే రోజున ... అంటే 26 ఫిబ్రవరి 1950న విడుదలయ్యాయి. ‘లక్ష్మమ్మ’ సినిమా విజయవంతమై బాగా ఆడగా, బలరామయ్య సినిమాకు చాలా ఆలస్యంగా పెట్టుబడులు వచ్చాయి. తరువాత ‘స్వప్నసుందరి’ సినిమాను పూర్తిచేసి విడుదల చేశారు. 1952లో బలరామయ్య ‘చిన్నకోడలు’ అనే ఒకే ఒక సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. అది పెద్దగా ఆడలేదు. ఆ తరువాత ఎన్‌.టి.రామారావు, అంజలీదేవి, ముక్కామల, సదాశివరావు, జోగారావు, నాగభూషణం, కాకినాడ రాజరత్నం, ఘంటసాల అమ్మలు ముఖ్య తారాగణంగా ‘రేచుక్క’ చిత్రాన్ని మొదలుపెట్టారు. రేచుక్క కథను బలరామయ్యే రాశారు. మాటలు మల్లాది రామకృష్ణ శాస్త్రి రాయగా, అశ్వత్థామ సంగీతం సమకూర్చారు. రెండు పాటలు రికార్డు చేసి, వాటిలో ఒక పాట చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. మూడు రీళ్ల చిత్రం పూర్తయింది. చిత్రం ప్రారంభించిన మూడు వారాలకు గుండెపోటు రావడంతో అక్టోబరు 29, 1953 అర్ధరాత్రి ఘంటసాల బలరామయ్య ఆకస్మికంగా మరణించారు. తరువాత ‘రేచుక్క’ చిత్రాన్ని పి.పుల్లయ్య పూర్తిచేసి 25 మార్చి 1955న విడుదల చేశారు. నిర్మాతగా బలరామయ్య పెద్దకుమారుడు ఘంటసాల కృష్ణమూర్తి వ్యవహరించారు. ఈ చిత్రం కూడా బాగా విజయవంతమైంది. బలరామయ్య నిగర్వి. దర్పం చూపేవారు కాదు. వారు ఎన్నో గుప్తదానాలు చేశారు. తను నిర్మించిన చిత్రాలు విజయవంతం కావడానికి తనతో పనిచేసిన తారలు, సాంకేతిక శాఖల వ్యక్తులు ముఖ్యకారణమని చెప్పడం బలరామయ్య గొప్పమనసుకు నిదర్శనమని చెప్పవచ్చు. బలరామయ్యకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్దబ్బాయి కృష్ణమూర్తి బలరామయ్యకు చిత్రనిర్మాణంలో తోడుగా వుండేవారు.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.