సినీ సాహిత్య కులపతి... సముద్రాల
1940 దశకంలో పౌరాణిక చిత్ర గీతాలకు, భక్తిగీతాలకు అద్భుతమైన పదబంధాలతో పాటలు, వ్యావహారిక భాషలో మాటలు రాసి నూతన వరవడికి శ్రీకారం చుట్టిన మహనీయుడు సముద్రాల రాఘవాచార్యులు. మూడు దశాబ్దాల సుదీర్ఘ సాహితీ సమరంలో ఒకేరోజు ఉదయం, మాద్యాహ్నం, సాయంత్రం మూడు వేరువేరు చిత్రాలకు నిర్విరామ సాహిత్య రచన చేసిన సవ్యసాచి సముద్రాల. నిర్మాతలు, దర్శకులు ఆ సముద్ర లేఖిని కోసం ఎంతగా వేచి వుండేవారో నాటి సినీపండితులకు తెలిసిన విషయమే. ఆయన జీవితం సినీ సాహితికే అంకితమై పోయింది. ఆయన అకుంఠిత దీక్షతో పాటలు రతనాల రాసులుగా వెలువడేవి. భావి సినీ రచయితలకు సముద్రాల ఆదర్శప్రాయులు. సముద్రాల రచనా విధానం భావసంస్కారం, సృజనాత్మకతల కలబోత. ‘భక్త పోతన’ చిత్రంలో ‘వేదాంత వధూ హృదయ విహారా, వేదమయా, పరమానందరూపా, పావనగుణరామా’ అంటూ పోతన స్థాయిలో రాస్తే ‘యోగి వేమన’లో ‘అందాలు చిందేటి నాజ్యోతి’ అంటూ అలతి పదాలతో సులభ శైలిలో పాటలు రాసి అలరించిన జ్ఞానయోగి సముద్రాల. ముళ్ళపూడి రమణ సరదాగా సముద్రాలను ‘గురూజీ... వైన్‌ అండ్‌ వుమన్‌కి తెలుగు ఏమిటండీ’ అని అడిగితే ‘మదిర మధువతి’ అని ఠక్కున జవాబిచ్చిన చతురుడు కూడా. ‘బాటసారి’ సినిమాకు చిన్నచిన్న మాటలతో సంభాషణలు రాయడం సముద్రాలకే చెల్లింది. జూలై 19న సముద్రాల 117వ జయంతి జరుగనున్న సందర్భంలో వారి గురించిన కొన్ని విశేషాలు...


బాల్యం సాహిత్యంతో ముడిపడి...
సముద్రాల వేంకట రాఘవాచార్యులు 1902 జూలై 19న కృష్ణ జిల్లా పెదపులివర్రు గ్రామంలో పండిత వంశంలో జన్మించారు. వేంకట శేషాచార్యులు, లక్ష్మీ తాయారు సముద్రాల తల్లిదండ్రులు. సముద్రాల బాల్యం రేపల్లెలో గడిచింది. అక్కడి హైస్కూలులో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే కవిత్వానికి శ్రీకారం చుట్టారు. పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేవి. విద్యార్థి నాయకుడిగా కూడా సముద్రాల వ్యవహరించారు. తను చదువుకున్న పాఠశాలలో సాహితీవాతావరణం మెండుగా వుండేది. విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేదుల సత్యనారాయణ, పింగళి లక్ష్మీకాంతం వంటి సాహితీమూర్తులు సముద్రాలకు సమకాలికులు కావడం అదృష్టం. 1917లో స్కూలు ఫైనల్‌ పూర్తి చేశాక సముద్రాల ఎక్కువగా సాహిత్య అధ్యయనం, కవితా వ్యాసంగం మీద దృష్టి పెట్టడంతో కాలేజీ చదువులజోలికి వెళ్ళలేదు. మిత్రులను కూడగట్టుకొని పంటకాలవ గట్లపైన నడుస్తూ అవధాన ప్రక్రియలో తన ధారణా శక్తిని పరీక్షించుకునేవారు. మెల్లగా అవధాన ప్రక్రియ ప్రారంభించి ఆశువుగా కవితలు చెప్పడం ప్రారంభించారు. సాహిత్య విషయాలపై పత్రికలకు వ్యాసాలు రాసేవారు. తెలుగు భాషాప్రవీణ పరీక్ష కూడా ఉత్తీర్ణుడయ్యారు. సముద్రాలకు 1918లోనే... అంటే తన పదహారవ యేటనే రత్నమ్మతో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. 1925 నుంచి స్వాతంత్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని, కవితలు రాసి సభలో చదివేవారు. అప్పుడే సముద్రాల కొంతకాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. పూర్వీకుల ఆస్తులను దేశం కోసం త్యాగం చేశారు. చల్లపల్లి రాజా సోదరుడు, సారథి స్టూడియోస్‌ అధినేత రామకృష్ణ ప్రసాద్‌ సముఖంలో 1930 ప్రాంతంలో శతావధానాన్ని దిగ్విజయంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సహకారంతో రేపల్లెలో తెలుగు భాషా ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. కుప్పుస్వామి చౌదరి 1928లో గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులుగా వుండగా సముద్రాల అవధాన ప్రతిభను గుర్తించి, తన కుమారుడు చంద్రమౌళి చౌదరికి తెలుగు నేర్పమని అందుకు తగిన జీతభత్యాలు ఏర్పరచారు. దాంతో సముద్రాల మకాం గుంటూరుకు మారింది. ఆ రోజుల్లో కొసరాజు రాఘవయ్య చౌదరి కూడా కుప్పుస్వామి చౌదరి వద్ద వుంటూ త్రిపురనేని రామస్వామి చౌదరి నడిపే ‘రైతు పత్రిక’లో పనిచేస్తుండేవారు. సముద్రాల ఆ రోజుల్లో గుంటూరు - బెజవాడ (విజయవాడ)ల మధ్య సాహితీ యాత్రలు చేస్తూ, నాటికలు రాసి బెజవాడలో ప్రదర్శనలు ఇస్తూ వుండేవారు. బెజవాడలో గూడవల్లి రామబ్రహ్మం ‘ఫ్రెండ్స్‌ అండ్‌ కో’ పేరుతో ఒక ఫ్యాన్సీ దుకాణం నడుపుతూ, రంగస్థల కళాకారులకు, సాహితీ మిత్రులకు అండగా ఉంటూ వుండేవారు. సముద్రాల కూడా బెజవాడ వెళ్లినప్పుడు రామబ్రహ్మం దుకాణంలోనే కలిసి సాహిత్య చర్చలు నిర్వహించేవారు. అలా వారిద్దరిమధ్య స్నేహబంధం బలపడింది.


కమ్మవంశ పరిశోధనకు మద్రాసు పయనం...
ఒకసారి కుప్పుస్వామి చౌదరిని త్రిపురనేని రామస్వామి చౌదరి, ఉన్నవ లక్ష్మీనారాయణ కలిశారు. అప్పుడు కట్టమంచి రామలింగారెడ్డి రెడ్ల చరిత్రపై పరిశోధన చేయడం గురించిన అంశం చర్చకు వచ్చింది. వారు ముగ్గురూ కమ్మవారి చరిత్రపై పరిశోధన జరిపితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. అప్పుడు సముద్రాల, గూడవల్లి రామబ్రహ్మం, కొసరాజులను పిలిచి మద్రాసు వెళ్లి కమ్మవారి చరిత్రపై పరిశోధన చేయవలసిందిగా కోరారు. దాంతో ముగ్గురూ 1930లో మద్రాసు వెళ్లి ట్రిప్లికేన్‌ బెల్స్‌ రోడ్డులో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని పరిశోధనకు ఉపక్రమించారు. అయితే గూడవల్లి రామబ్రహ్మం పత్రికా వ్యాసంగం మీద, కొసరాజు బీమా వ్యాపారం మీద శ్రద్ధ చూపడంతో పరిశోధనా బాధ్యతలు మొత్తం సముద్రాల మీద పడ్డాయి. గూడవల్లి ‘సమదర్శని’ అనే పక్షపత్రికలో సహాయ సంపాదకుడుగా చేరిపోయారు. సముద్రాల రోజూ మద్రాసు విశ్వవిద్యాలయ ప్రాచీన లిఖిత పుస్తక భాండాగారానికి (ఆర్ఖైవ్స్‌), ఇతర గ్రంధాలయాలకు వెళ్లి అక్కడ దొరికిన తాళపత్ర గ్రంధాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. కొసరాజు, గూడవల్లి ఇద్దరూ రైతు ఉద్యమాలలో చురుగా పాల్గొంటూ వుండేవారు. సముద్రాలను కూడా ‘సమదర్శని’లో చేర్పించారు. సంవత్సరం తరువాత పరిశోధనకు విరామం ప్రకటించి గూడవల్లితోబాటు బెజవాడ వచ్చి జాతీయోద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1932లో బెజవాడ నుంచి ప్రచురించే ‘ప్రజామిత్ర’ వారపత్రికను మద్రాసులోని రాయపేటకు మార్చగా, ఆ పత్రిక సంపాదకత్వ బాధ్యత గూడవల్లికి అప్పగించారు. సముద్రాల కూడా మరలా కుటుంబంతో సహా మద్రాసు వెళ్లి ఆ పత్రికలో సహాయ సంపాదకుడిగా చేరారు. ఆ పత్రికలో త్రిపురనేని గోపీచంద్, తాపీ ధర్మారావు నాయుడు, వేలూరి శివరామశాస్త్రి వ్యాసాలు రాసేవారు. ఆ పత్రిక ప్రాచుర్యంలోకి రావడానికి సముద్రాల చాలా శ్రమించారు. 1931-36 మధ్యకాలంలో ‘ప్రజామిత్ర’కు సముద్రాల పనిచేశారు. అప్పుడప్పుడే తెలుగు చలనచిత్ర రంగంలో పెనుమార్పులు సంభవించాయి. టాకీ చిత్రాలు ప్రారంభమయ్యాయి. గూడవల్లికి మాత్రం సినిమాలమీద ఆసక్తి పెరిగి’ ‘సీతాకల్యాణం’, ‘కృష్ణలీలలు’ వంటి చిత్రాలకు ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తూ చిత్ర నిర్మాణం మీద పట్టు సాధించారు. సముద్రాల మాత్రం ‘ప్రజామిత్ర’ పత్రిక సంపాదకత్వ బాధ్యతలు మోస్తూ గూడవల్లికి సహాయకారిగా వుండేవారు. ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్‌.రెడ్డి ఆడిటర్‌ వృత్తిలో ఉంటూ ‘ప్రజామిత్ర’ కార్యాలయానికి తరచూ వస్తుండేవారు. అక్కడ గోపీచంద్, ధర్మారావు నాయుడు వంటి సాహితీవేత్తలతో చర్చలలో పాల్గొనేవారు. తరువాత బి.ఎన్‌. ప్రెస్‌ ప్రారంభించి ‘ప్రజామిత్ర’ పత్రికను కూడా అందులోనే అచ్చువేయించేవారు. దాంతో సముద్రాలకి బి.ఎన్‌. రెడ్డికి మధ్య సఖ్యత పెరిగింది. మద్రాసు ఆంధ్రనాటక కళాపరిషత్తు వారు ఒకసారి ‘చంద్రగుప్త’ నాటకాన్ని ప్రదర్శిస్తే అందులో నందుని పాత్రను బి.ఎన్‌.రెడ్డి పోషించారు. ఆ నాటక సమీక్షపై విపులంగా విశ్లేషించి ‘ప్రజామిత్ర’ కార్యాలయానికి నివేదిక ఇచ్చారు. అది బి.ఎన్‌.రెడ్డికి బాగా నచ్చింది.

సినీ ప్రకటనలతో చిత్రరంగంలోకి...
పి.వి.దాసు మద్రాసులో వేల్‌ పిక్చర్స్‌ లిమిటెడ్‌ పేరిట సినీనిర్మాణ సంస్థను నెలకొల్పారు. రామబ్రహ్మం, దాసు ఇద్దరూ మంచి మిత్రులు. సినీ నిర్మాణ విషయాలు చర్చించడానికి రామబ్రహ్మం దాసు వద్దకువెళ్తుండేవారు. వారితో సముద్రాల కూడా స్టూడియోకి వెళ్ళేవారు. ఆ స్నేహంతోనే వేల్‌ పిక్చర్స్‌ వారు నిర్మించిన ‘సీతాకల్యాణం’ (1934), ‘శ్రీకృష్ణలీలలు’ (1935)చిత్రాలకు స్నేహధర్మంగా సముద్రాల ప్రకటనలు రాసిపెట్టారు. తరువాత 1936 వేల్‌ పిక్చర్స్‌ నిర్మించిన ‘మాయాబజార్‌’ (శశిరేఖా పరిణయము) నిర్మాణ దశలో కొన్ని సన్నివేశాలను చేర్చాల్సి వచ్చినప్పుడు, ఆ చిత్ర దర్శకులు పి. పుల్లయ్య గూడవల్లిని సంప్రదించగా ఆయన వెంటనే సముద్రాల పేరు సూచించారు. పుల్లయ్య ఆహ్వానం మీద స్టూడియోకి వెళ్లి సముద్రాల ఆ సన్నివేశాలకు మాటలు రాసి దర్శకుని మెప్పుపొందారు. అదే సముద్రాల సినిమా కోసం చేసిన తొలి రచన. అప్పుడే సరస్వతీ టాకీస్‌కు చెందిన పారుపల్లి శేషయ్య, కురుకూరు సుబ్బారావు కొల్హాపూర్‌లో ‘ద్రౌపదీ వస్తాప్రహరణం’ (1936) చిత్రాన్ని నిర్మిస్తూ సముద్రాల చేత కొన్ని సన్నివేశాలకు సంభాషణలు రాయించుకున్నారు. తరువాత సరస్వతీ టాకీస్‌ వారి ఆఫీసు మద్రాసుకు మారింది. రెండవ ప్రయత్నంగా చందాల కేశవదాసు నాటకం ‘కనకతార’ (1937) ను హెచ్‌.వి.బాబు దర్శకత్వంలో సినిమాగా నిర్మిస్తూ గూడవల్లి రామబ్రహ్మం సూచన మేరకు మాటలు, పాటలు, పద్యాలు పూర్తిగా సముద్రాల చేత రాయించారు. నాటకంలో వున్న గ్రాంధిక భాషను పక్కన పెట్టి వ్యావహార భాషా శైలిలో సంభాషణలు రాసి ‘భేష్‌’ అనిపించుకున్నారు. అలాగే కేశవదాసు రచించిన పద్యాలను మార్చి వ్యావహారిక భాషలో పద్యాలు రాశారు. కీర్తనలవంటి పాటల స్థానంలో జానపద శైలిలో పాటలు రాశారు. ఆరోజుల్లో ఇది ఒక విప్లవాత్మక పరిణామం. ‘దేవుని మహిమా తెలియగా వశమా’ అనేది సముద్రాల రాసిన తొలి సినిమా పాట. ‘కనకతార’ చిత్రం నాటక పంధాకు విభిన్నంగా, వినూత్నంగా ఉండడంతో ప్రేక్షక్ల ఆదరణ పొంది నిర్మాతకు కాసులు కురిపించింది. సముద్రాల రచనా శైలిని మెచ్చుకుంటూ పత్రికలు సమీక్షలు రాశాయి.


రోహిణితో పూర్తిస్థాయి సినీ రచయితగా...
టాకీపులిగా పేరుగాంచిన హెచ్‌.ఎం.రెడ్డి బి.ఎన్‌.రెడ్డితో కలిసి ‘రోహిణీ పిక్చర్స్‌’ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను స్థాపించారు. బి.నాగిరెడ్డి, మూలా నారాయణస్వామి, రామనాథ్, శేఖర్, కన్నాంబలను భాగస్వాములుగా చేర్చుకున్నారు. సోమరాజు రామానుజరావు ప్రఖ్యాత నాటిక ‘రంగూన్‌ రౌడీ’ హక్కులు కొని ఆ నాటికకు అసంఖ్యాక మార్పులుచేసి ‘గృహలక్ష్మి’(1938) చిత్రాన్ని నిర్మించారు. దానికి సముద్రాల కథ, మాటలు, పాటలు సమకూర్చారు. చిత్తూరు నాగయ్యకు ఇది తొలి చిత్రం. ఈ చిత్రాన్ని మద్రాసులోని గ్రీన్‌ వేస్‌ రోడ్డులో వున్న కార్తికేయ ఫిలిమ్స్‌ స్టూడియోలో నిర్మించారు. ‘గృహలక్ష్మి’ చిత్రం బ్రహ్మాండంగా ఆడింది. బి.ఎన్‌.రెడ్డి ‘గృహలక్ష్మి’లోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అంశంలో హెచ్‌.ఎం.రెడ్డితో విభేదించి తన భాగస్వామ్యాన్ని రద్దు చేసుకొని బయటకు వచ్చేశారు. తరవాత నాగిరెడ్డి, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, సముద్రాల రాఘవాచార్యను కూడా బయటకు తీసుకొనివచ్చి వాహినీ సంస్థను నెలకొల్పారు. దాంతో జోడు గుర్రాలమీద స్వారి చెయ్యడం కష్టమనిపించి సముద్రాల ‘ప్రజామిత్ర’ సంపాదకత్వానికి 1937లో రాజీనామా సమర్పించి, పూర్తి సమయాన్ని సినీ సాహిత్య రచనకు కేటాయించారు. నిరుద్యోగ సమస్యను ఇతివృత్తంగా చేసుకొని వాహినీ బ్యానర్‌ మీద బి.ఎన్‌.రెడ్డి తొలి ప్రయత్నంగా ‘వందేమాతరం’ (1939) చిత్రాన్ని నిర్మించారు. సముద్రాల ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు సమకూర్చారు. సినిమా అద్భుత విజయాన్ని సాధించి సముద్రాలకు రచయితగా స్థానాన్ని సుస్థిరం చేసింది. తరువాత వరుసగా వాహినీ సంస్థ బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘సుమంగళి’ (1940), ‘దేవత’ (1941), కె.వి.రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘భక్తపోతన’ (1942) చిత్రాలకు సముద్రాల రచన చేశారు. తరువాత నాగయ్య ’రేణుకా పిక్చర్స్‌’ అనే సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి ‘భాగ్యలక్ష్మి’ (1943) చిత్రాన్ని మొదలుపెట్టారు. ఆ చిత్రానికి కథ, మాటలు, పాటలు సముద్రాల రాశారు. ఈ చిత్రం నిర్మాణంలో వుండగా మద్రాసు మీద రెండవ ప్రపంచ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. జపాన్‌ దేశం మద్రాసు నగరం మీద బాంబుల వర్షం కురిపించబోతుందని వార్తలు రావడంతో వాహినీ వాళ్ళు తాడిపత్రికి, నాగయ్య తిరుపతికి వెళ్ళిపోయారు. రామనాథ్, శేఖర్‌ జెమినీ సంస్థలో చేరారు. పత్రికా సంపాదక వృత్తిని వదలుకొని, చేతిలో సినిమాలు లేక సముద్రాల ఆర్ధిక చిక్కులో ఇరుక్కున్నారు. రామనాథ్‌ చొరవతో జెమినీ వాసన్‌ ‘జీవన్ముక్తి’ (1943) అనే సినిమాకి పాటలు రాసే అవకాశాన్ని సముద్రాలకు కలిపించారు. యుద్ధ వాతావరణం తగ్గిన తరువాత గూడవల్లి రామబ్రహ్మం సారథి ఫిలిమ్స్‌ పతాకం మీద నిర్మించబోయే ‘పంతులమ్మ’ చిత్రానికి పనిచేయాల్సిందిగా సముద్రాలను ఆహ్వానించారు. అదే సమయంలో తమిళనాడు టాకీస్‌ వారు నిర్మిస్తున్న ‘చెంచులక్ష్మి’ (1943) చిత్రానికి మాటలు, పాటలు రాసే అవకాశం కలిగింది. దాంతో సముద్రాల ఆర్ధిక సమస్యలనుండి గట్టెక్కారు.


వెనువెంటనే రచనావకాశాలు...
1945లో వాహినీ వారు ‘స్వర్గసేమ’ చిత్రాన్ని నిర్మిస్తూ సముద్రాలకు స్వాగతం పలికారు. చక్రపాణితో కలిసి సముద్రాల మాటలు, కొన్ని పాటలు రాశారు. నాగయ్య స్వంత సినిమా ‘త్యాగయ్య’ (1946), రామబ్రహ్మం నిర్మించిన ‘పల్నాటియుద్ధం’ (1947), భరణీ వారు నిర్మించిన ‘రత్నమాల’ (1947), వాహినీ చిత్రం ‘యోగివేమన’ (1947), ప్రతిభా వారి ‘బాలరాజు’ (1948), మీర్జాపురం రాజా, కృష్ణవేణిల ‘మనదేశం’ (1949) సినిమాలకు మాటలు, పాటలు సమకూర్చే అవకాశం సముద్రాలకు వచ్చింది. ఇక వెనుకకు చూడాల్సిన అవసరం రాలేదు. తరువాత 1949-68 మధ్యకాలంలో ‘లైలా మజ్ను’, ‘స్వప్నసుందరి’, ‘చండీరాణి’, ‘బ్రతుకు తెరువు’, ‘విప్రనారాయణ’, ‘దొంగరాముడు’, ‘జయం మనదే’, ‘కనకతార’, ‘సారంగధర’, ‘వినాయకచవితి’, ‘భూకైలాస్‌’, ‘బాటసారి’, ‘పాండవ వనవాసము’, ‘సీతారామకల్యాణం’, ‘లవకుశ’, ‘నర్తనశాల’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘భక్త ప్రహ్లాద’, ‘శ్రీకృష్ణావతారం’, ‘శ్రీరామకథ’ వంటి అనేక సినిమాలకు రచయితగా సేవలు అందించారు. అశ్వరాజ్‌ సంస్థ అధినేత కె.గోపాలరావు 1957లో నిర్మించిన ‘వినాయకచవితి’ సినిమాకు కథ, మాటలు, పాటలతోబాటు దర్శకత్వం కూడా వహించారు. 1964లో ఎన్‌.టి.రామారావు, ఎస్‌.వరలక్ష్మి ముఖ్యతారాగణంగా ‘బభ్రువాహన’ చిత్రానికి కథ, సంభాషణలే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. ముచ్చటగా మూడవసారి ఘంటసాల నిర్మించిన ‘భక్తరఘునాథ్‌’ (1960) సినిమాకు కథ, మాటలు, పాటలు రాయడంతోబాటు దర్శకత్వం కూడా చేపట్టారు. అయితే ఈ మూడు సినిమాలు పెద్దగా ఆడలేదు.

ఘంటసాలకు ఆసరా...
మద్రాసు నగరంలో సముద్రాల నివాసం త్యాగరాయనగర్‌ మూసా వీధిలో వుండేది. వారి ఇల్లు వచ్చేపోయేవారితో ఒక సత్రంలా వుండేది. ఘంటసాల అత్తవారి ఊరు, సముద్రాల ఊరు ఒక్కటే కావడంతో 1944లో ఘంటసాల వివాహానికి సముద్రాల పెదపులివర్రు వచ్చి ఆశీర్వదించారు. ఘంటసాల గాత్రం విని మద్రాసు వచ్చి అదృష్టం పరీక్షించుకోమని చెప్పారు. వారి సలహా మేరకు ఘంటసాల మద్రాసు చేరుకొని సముద్రాల ఇంటిలో విడిది చేశారు. సముద్రాల ఘంటసాలను వెంటబెట్టుకొని నిర్మాతల వద్దకు, దర్శకుల వద్దకు వెళ్లి పరిచయంచేసి అవకాశాలు ఇమ్మని అడిగారు. అలాగే మద్రాసు ఆకాశవాణి కేంద్రానికి కూడా తీసుకెళ్లారు. అక్కడ బాలాంత్రపు రజనీకాంతరావు ఆశీస్సులతో ‘వెలుగు వెల్లువ’ అనే రేడియో నాటకంలో పాట పాడారు. తరువాత ‘సీతారామజననం’లో ఘంటసాల బలరామయ్య చిన్న వేషం ఇచ్చారు. నాగయ్య ‘త్యాగయ్య’లో కూడా చిన్న వేషం దొరికింది. చివరకు వాహినీ వారి ‘స్వర్గసీమ’ చిత్రంలో భానుమతితో కలిసి ‘రేయెన్నెల చిరునవ్వుల ఇరజిమ్ము పఠాణీ’ అనే గాజులపిల్ల పాటను పాడారు. అదే ఘంటసాల పాడిన తొలి చలనచిత్ర గీతం. తరవాత కృష్ణవేణి నిర్మించిన ‘మనదేశం’ చిత్రానికి ఘంటసాల సంగీత దర్శకత్వం వహించేందుకు సముద్రాల సిఫారసే కారణం. ఘంటసాల తనవద్ద దాచుకున్న సొమ్ముతో ఘంటసాల ఉస్మాన్‌ రోడ్డులో పెద్దఇల్లు కొనుక్కోగలిగారు. ఘంటసాల సముద్రాలను ఓ తండ్రిగా, గురువుగా, జీవిత మార్గదర్శిగా భావించేవారు.

                                                              

సముద్రాల ఆత్మ మల్లాది...
మల్లాది రామకృష్ణశాస్త్రి అంటే సముద్రాలకు పుత్రవాత్సల్యం. మల్లాది సినీరంగ ప్రవేశానికి ముందే సముద్రాలకు స్నేహబంధముండేది. తొలిసారి ఇద్దరూ కలిసి గూడవల్లి రామబ్రహ్మం సినిమా ‘పల్నాటియుద్ధం’కు కలిసి పనిచేశారు. తరువాత భరణీ వారి ‘రత్నమాల’, ‘లైలామజ్ఞు’ చిత్రాలకు, ప్రతిభావారి ‘బాలరాజు’కు, ‘స్వప్నసుందరికి’ కలిసే పనిచేశారు. ‘దేవదాసు’, ‘స్త్రీసాహసం’, ‘దొంగరాముడు’ చిత్రాల రచనలో సముద్రాలకు మల్లాది సహకారం ఎంతో వుంది. సముద్రాల బిజీగా వుండడం చేత కొన్ని పాటలు మల్లాది చేత రాయించేవారు. అయితే ఆ పాటలు సముద్రాల పేరుతోనే చలామణి అయ్యేవి. ఈ విషయమై మల్లాదిని కదిలించినప్పుడు ‘సముద్రాల నా కలంపేరు’ అనేవారు. కానీ ఎప్పుడూ సముద్రాల గారికి అజ్ఞాతకవిగా పాటలు రాసినట్లు మల్లాది ఎక్కడా చెప్పుకోలేదు. వారిద్దరి మధ్య వున్న ఆత్మీయబంధం అలాంటిది. ఇక పింగళి నాగేంద్రరావు విషయానికి వస్తే, ‘ప్రజామిత్ర’ పత్రికలో పింగళి చేత సముద్రాల ఎన్నో వ్యాసాలు రాయించేవారు. అలా వారిమధ్య అనుబంధం పెరిగింది. సముద్రాల బిజీగా వున్న తరుణంలో వాహినీ వారు కె.వి.రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘గుణసుందరి కథ’ (1949) సినిమాకు కథ, మాటలు, పాటలు పింగళి నాగేంద్రరావు చేత రాయించారు. దీనికి ముందు పింగళి ‘భలేపెళ్లి’ (1941) చిత్రానికి రచనచేశారు. కానీ ఆచిత్రం అపజయం పాలవడంతో బందరు వెళ్లిపోయారు. తరువాత మద్రాసు వచ్చి ‘వింధ్యరాణి’ చిత్రానికి మాటలు రాశారు. అదికూడా విజయవంతం కాలేదు. అయితే ‘గుణసుందరి’ చిత్రం పింగళికి కథారచయితగా, గేయ రచయితగా గుర్తింపు తెచ్చిపెట్టింది. వాహినీ వారికి సముద్రాల ఆస్థాన రచయిత కాగా, వాహినితో విడిపోయిన విజయా సంస్థకు పింగళి ఆస్థాన రచయిత అయ్యారు. అయితే విజయా వారి తొలిచిత్రం ‘షావుకారు’ (1950)కు సముద్రాల పాటలు రాశారు. సముద్రాల బిజీగావున్న కాలంలో ప్రభుత్వం ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ క్రాఫ్టులకు పురస్కారాలను ప్రవేశపెట్టలేదు. తదనంతరకాలంలో ‘తెనాలి రామకృష్ణ’, ‘లవకుశ’, ‘నర్తనశాల’, ‘అమరశిల్పి జక్కన్న’ చిత్రాలు జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాలు పొందాయి. ‘భక్తప్రహ్లాద’ చిత్రానికి స్వర్ణపతకం లభించింది. 1962లో సముద్రాల దంపతులకు మద్రాసు వాణీమహల్‌లో షష్టిపూర్తి మహోత్సవం వైభవంగా జరిపారు. రామారావు నిర్మించిన ‘శ్రీరామపట్టాభిషేకం’ చిత్రానికి సముద్రాల స్క్రిప్టు సమకూర్చారు. సముద్రాల రాసిన చివరి చిత్రం ‘వీరాంజనేయ’. చివరిసారిగా పద్మనాభం 1968లో నిర్మించిన ‘శ్రీరామకథ’ చిత్రంలో సముద్రాల ‘రామకథ శ్రీరామ కథ’ అనే టైటిల్‌ సాంగ్‌ ను రాశారు. మార్చి 16, 1968న మూడు దశాబ్దాలుగా చలనచిత్ర సీమలో ఓ వెలుగు వెలిగిన సాహితీ సూర్యుడు అస్తమించారు.   
 
                                 
 
సముద్రాల డైలాగులు కొన్ని...

* ‘శ్రీకృష్ణ పాండవీయం’లో సుయోధనుడు:- ‘పాంచాలీ... పంచ భర్తృకా... నీవా నన్ను పరిహసించునది! సకల మహీపాల మకుట మాణిక్య శోభా నీరాజితుడైన రారాజును, నేడొక్క ఆబల, బంధకి పరిహసించుటయా! అభిమానధనుడైన సుయోధనుడది వినిసహించుటయా... సహించక మరణించుటా!.. మరణించి సాధించునది... మచ్చ మాసిపోవునా... పరిహాస్పడుడై ప్రాణత్యాగము చేసికొన్నాడన్న అపనింద వేరోక్కటా...కల్ల ఈ పరాభవము దాగుట కల్ల....’

*
‘పాండవ వనవాసం’లో సుయోధనుడు:- ‘అస్మదీయ పితృదయాలబ్ధరాజ్యమాట వైభవులై, సామంతులైన పాండవులు రాజసూయాధ్వరప్రవర్తకులై, భద్రసింహాసనా రూడులై ఈ రారాజును చూసి పరిహసింతురే! చతుస్సముద్ర వేలావలయిత ధరణీ పట్టభాడనైన ఈ కౌరవ చక్రవర్తిని చూచి ఒక బంధకి, పంచ భర్తృక... ఆ ద్రౌపది పరిహసించునా! దానిని సహించి జీవించుటయా.....’

కొన్ని పాటలు...

మదనా నవమదనా స్వాగతమోయీ... చిగురాకులివే బాకులివే చిలకహుమాయి వజీరా... ‘రత్నమాల’

రాదే చెలీ నమ్మరాదే చెలీ మగవారినిలా నమ్మరాదే చెలీ, రాదే చెలీ... ‘దేవత’

సర్వమంగళ నామా సీతారామా రామా శర్వ వినుతా శాంతి దాతా రామా రామా... ‘భక్తపోతన’

చెలియా కనరావా నిరాశబూని పోయితివా... ‘బాలరాజు’

ఓహో చారుశీలా ఒహోహో వీర బాలా ఈ విరాళి తీరుపవే నా వరాల జవరాలా... ‘పల్నాటి యుద్ధం’

ప్రేమే నేరేమౌనా మాపై ఈ పగేలా వేదనగానే మా వలపంతా వేసారునా... ‘లైలామజ్ను’

అందాలు చిందేటి నా జ్యోతి... ‘యోగి వేమన’

ఏమనేనే చిన్నారి ఏమనేనే వన్నెల సిగపూవా కనుసన్నలలో భావమేమి... ‘షావుకారు’

జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా... ‘దేవదాసు’

ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతనా ఇందుకేనా నీవుచేసే పూజలన్నీ తపోధనా... ‘విప్రనారాయణ’

జీవితమే సఫలము రాగసుధా భరితము ప్రేమ కథా మధురము.. ‘అనార్కలి’

చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా... ‘దొంగరాముడు’

హాయిహాయిగా ఆమని సాగే సోయగాల గనవోయీ సఖా హాయి సఖా... ‘సువర్ణసుందరి’

దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో... ‘భూకైలాస్‌’

సీతారాముల కల్యాణము చూతము రారండి ... ‘సీతారామకల్యాణం’

ఓ బాటసారీ నను మరువకోయీ మజిలీ ఎటైనా మనుమా సుఖానా... ‘బాటసారి’

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా... ‘లవకుశ’

జననీ శివకామినీ జయ శుభ కారిణి విజయరూపిణీ... ‘నర్తనశాల’

హిమగిరి సొగసులూ మురిపించునూ మనసులూ... ‘పాండవ వనవాసము’

జీవము నీవేకదా దేవా ... ‘భక్త ప్రహ్లాద’

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.