తెలుగు సినీ సాహిత్య సాగరుడు... సముద్రాల

1940 దశకంలో పౌరాణిక చిత్ర గీతాలకు, భక్తిగీతాలకు అద్భుతమైన పదబంధాలతో పాటలు, వ్యావహారిక భాషలో మాటలు రాసి నూతన వరవడికి శ్రీకారం చుట్టిన మహనీయుడు సముద్రాల రాఘవాచార్యులు. తెలుగు చలనచిత్ర గేయసాహిత్యానికి, సంభాషణల రచనకు కావ్యపరిమళం అద్దిన తొలితరం కవులలో సముద్రాల రాఘవాచార్య అగ్రగణ్యుడు. తన పదునైన కలంతో ‘సినీ గీతసుందరి’ కి సొబగులద్ది, పైటవేసి అలంకరించిన సాహితీమూర్తి సముద్రాల. 1937 నుంచి 1968 వరకు సముద్రాల జీవితం తెలుగు సినీచరిత్రతో ముడిపడి వుంది. అతడు సినీకళామతల్లి పాలభాగాన తేజోమయ తిలకంగా భాసిల్లిన గీతాచార్యుడు.... సినిమా కథనాన్ని నవనవోన్మేషం చేసిన ‘మాటసారి’. తెలుగు సినీయుగపురుషులుగా కీర్తించే గూడవల్లి, కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, నాగయ్య, రామారావు, నాగేశ్వరరావు, భానుమతి, అంజలీదేవి వంటి మహనీయుల ఆలోచనలకు ఆకృతినిచ్చిన మూల విరాట్టు సముద్రాల. ఆయన దృక్కోణంలో గృహలక్ష్మి, దేవత, చండీరాణి, సతీసులోచన, సతీసుమతి, సతీ సక్కుబాయి, పార్వతి, లైలా, అనార్కలి వంటి ఆదర్శ గృహిణులు, సాహస నారీమణులు, సాధ్వీమతల్లులు, ప్రేమమూర్తులు కనిపిస్తారు. అంతేకాదు జయదేవుడు, త్యాగయ్య, రామదాసు, విప్రనారాయణ, పోతన, వేమన, కబీరు వంటి యోగిపుంగవులు, తత్వవేత్తలు, భక్తశిఖామణులు, రాముడు, కృష్ణుడు, బాలాజీ వంటి అవతారమూర్తులు, వారి గుణగణాలు సముద్రాక్ల రచనలలో అద్భుతంగా గోచరిస్తాయి. తెలుగు సినీ సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన ఈ కవిబ్రహ్మ 52వ వర్ధంతి సందర్భంగా వారి సాహితీ ప్రతిభను గుర్తుచేసుకుందాం...


బాల్యం సాహిత్యంతో ముడిపడి...

సముద్రాల వేంకట రాఘవాచార్యులు 1902 జూలై 19న కృష్ణ జిల్లా పెదపులివర్రు గ్రామంలో పండిత వంశంలో జన్మించారు. వేంకట శేషాచార్యులు, లక్ష్మీతాయారు సముద్రాల తల్లిదండ్రులు. సముద్రాల బాల్యం రేపల్లెలో గడిచింది. అక్కడి హైస్కూలులో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే కవిత్వానికి శ్రేకారం చుట్టారు. పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేవి. విద్యార్థి నాయకుడిగా కూడా సముద్రాల పనిచేశారు. తను చదువుకున్న పాఠశాలలో సాహితీవాతావరణం మెండుగా వుండేది. విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేదుల సత్యనారాయణ, పింగళి లక్ష్మీకాంతం వంటి సాహితీమూర్తులు సముద్రాలకు సమకాలికులు కావడం అదృష్టం. 1917లో స్కూలు ఫైనల్ పూర్తి చేశాక సముద్రాల ఎక్కువగా సాహిత్య అధ్యయనం, కవితా వ్యాసంగం మీద దృష్టి పెట్టడంతో, కాలేజి చదువులజోలికి వెళ్ళలేదు. మిత్రులను కూడగట్టుకొని పంటకాలవ గట్లపైన నడుస్తూ అవధాన ప్రక్రియలో తన ధారణాశక్తిని పరీక్షించుకునేవారు. మెల్లగా అవధాన ప్రక్రియ ప్రారంభించి ఆశువుగా కవితలు చెప్పడం ప్రారంభించారు. సాహిత్య విషయాలపై పత్రికలకు వ్యాసాలు రాసేవారు. తెలుగు భాషాప్రవీణ పరీక్ష కూడా ఉత్తీర్ణుడయ్యారు. సముద్రాలకు 1918 లోనే... అంటే తన పదహారవ యేటనే రత్నమ్మతో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. 1925 నుంచి స్వాతంత్ర్య పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని, కవితలు రాసి సభలో చదివేవారు. అప్పుడే సముద్రాల కొంతకాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సివచ్చింది. పూర్వీకుల ఆస్తులను దేశం కోసం త్యాగం చేశారు. చల్లపల్లి రాజా సోదరుడు, సారథి స్టూడియోస్ అధినేత రామకృష్ణ ప్రసాద్ సముఖంలో 1930 ప్రాంతంలో శతావధానాన్ని దిగ్విజయంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సహకారంతో రేపల్లెలో తెలుగు భాషా ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. కుప్పుస్వామి చౌదరి 1928 లో గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులుగా వుండగా సముద్రాల అవధాన ప్రతిభను గుర్తించి, తన కుమారుడు చంద్రమౌళి చౌదరికి తెలుగు నేర్పమని అందుకు తగిన జీతభత్యాలు ఏర్పరచారు. దాంతో సముద్రాల మకాం గుంటూరుకు మారింది. ఆరోజుల్లో కొసరాజు రాఘవయ్య చౌదరి కూడా కుప్పుస్వామి చౌదరి వద్ద వుంటూ త్రిపురనేని రామస్వామి చౌదరి నడిపే ‘రైతు పత్రిక’ లో పనిచేస్తుండేవారు. సముద్రాల ఆరోజుల్లో గుంటూరు-బెజవాడ (విజయవాడ) ల మధ్య సాహితీ యాత్రలు చేస్తూ, నాటికలు రాసి బెజవాడలో ప్రదర్శనలు ఇస్తూ వుండేవారు. బెజవాడలో గూడవల్లి రామబ్రహ్మం ‘ఫ్రెండ్స్ అండ్ కో’ పేరుతో ఒక ఫ్యాన్సీ దుకాణం నడుపుతూ, రంగస్థల కళాకారులకు, సాహితీ మిత్రులకు అండగా ఉంటూ వుండేవారు. సముద్రాల కూడా బెజవాడ వెళ్ళినప్పుడు రామబ్రహ్మం దుకాణంలోనే కూర్చొని సాహిత్య చర్చలు నిర్వహించేవారు. అలా వారిద్దరిమధ్య స్నేహం స్నేహబంధం బలపడింది.



కమ్మవారి పరిశోధనకు మద్రాసు పయనం...

ఒకసారి కుప్పుస్వామి చౌదరిని త్రిపురనేని రామస్వామి చౌదరి, ఉన్నవ లక్ష్మీనారాయణ కలిశారు. అప్పుడు కట్టమంచి రామలింగారెడ్డి రెడ్ల చరిత్రపై పరిశోధన చేయడం గురించి చర్చ జరిగింది. వారు ముగ్గురూ కమ్మవారి చరిత్రపై పరిశోధన జరిపితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. అప్పుడు సముద్రాల, గూడవల్లి రామబ్రహ్మం, కొసరాజులను పిలిచి మద్రాసు వెళ్లి కమ్మవారి చరిత్రపై పరిశోధన చేయవలసిందిగా కోరారు. దాంతో ముగ్గురూ 1930 లో మద్రాసు వెళ్లి ట్రిప్లికేన్ బెల్స్ రోడ్డులో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని పరిశోధనకు ఉపక్రమించారు. అయితే గూడవల్లి రామబ్రహ్మం పత్రికా వ్యాసంగం మీద, కొసరాజు బీమా వ్యాపారం మీదశ్రద్ధ చూపడంతో పరిశోధనా బాధ్యతలు సముద్రాల మీద పడ్డాయి. గూడవల్లి ‘సమదర్శని’ అనే పక్షపత్రికలో సహాయ సంపాదకుడుగా చేరిపోయారు. సముద్రాల రోజూ మద్రాసు విశ్వవిద్యాలయం ప్రాచీన లిఖిత పుస్తక భాండాగారానికి (ఆర్ఖైవ్స్), ఇతర గ్రంధాలయాలకు వెళ్లి అక్కడ దొరికిన తాళపత్ర గ్రంధాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. కొసరాజు, గూడవల్లి ఇద్దరూ రైతు వుద్యమాలలో చురుకుగా పాల్గొంటూ వుండేవారు. తరవాత సముద్రాలను కూడా ‘సమదర్శని’ లో చేర్పించారు. సంవత్సరం తరవాత సముద్రాల పరిశోధనకు విరామం ప్రకటించి గూడవల్లితోబాటు బెజవాడ వచ్చి జాతీయోద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1932లో బెజవాడ నుంచి ప్రచురించే ‘ప్రజామిత్ర’ వారపత్రికను మద్రాసులోని రాయపేటకు మార్చి, పత్రిక సంపాదకత్వ బాధ్యత గూడవల్లికి అప్పగించారు. సముద్రాల కూడా మరలా కుటుంబంతో సహా మద్రాసు వెళ్లి ఆ పత్రికలోలు రాసేవారు. ఆ పత్రిక ప్రాచుర్యంలోకి రావడానికి సముద్రాల చాలా శ్రమించారు. 1931-36 మధ్యకాలంలో ‘ప్రజామిత్ర’కు సముద్రాల పనిచేశారు. అప్పుడప్పుడే తెలుగు చలనచిత్రరంగంలో పెనుమార్పులు సంభవించాయి. టాకీ చిత్రాలు ప్రారంభమయ్యాయి. గూడవల్లికి మాత్రం సినిమాలమీద ఆసక్తి పెరిగి’ ‘సీతాకల్యాణం’, ‘కృష్ణలీలలు’ వంటి చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తూ చిత్ర నిర్మాణం మీద పట్టు సాధించారు. సముద్రాల మాత్రం ‘ప్రజామిత్ర’ పత్రిక సంపాదకత్వ బాధ్యతలు మోస్తూ గూడవల్లికి సహకారిగా వుండేవారు. ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్. రెడ్డి ఆడిటర్ వృత్తిలో ఉంటూ ‘ప్రజామిత్ర’ కార్యాలయానికి తరచూ వస్తుండేవారు. అక్కడ గోపీచంద్, ధర్మారావు నాయుడు వంటి సాహితీవేత్తలతో చర్చలలో పాల్గొనేవారు. తరవాత బి.ఎన్. ప్రెస్ ప్రారంభించి ‘ప్రజామిత్ర’ పత్రికను కూడా అందులోనే అచ్చువేయించేవారు. దాంతో సముద్రాలకి బి.ఎన్. రెడ్డికి మధ్య సఖ్యత పెరిగింది. మద్రాసు ఆంధ్రనాటక కళా పరిషత్తు వారు ఒకసారి ‘చంద్రగుప్త’ నాటకాన్ని ప్రదర్శిస్తే అందులో నందుని పాత్రను బి.ఎన్. రెడ్డి పోషించారు. ఆ నాటక సమీక్ష పై జరిగిన చర్చలో సముద్రాల ‘ప్రజామిత్ర’ కార్యాలయానికి విపులంగా విశ్లేషించి నివేదిక ఇచ్చారు. అది బి.ఎన్. రెడ్డికి బాగా నచ్చింది.



సినీ ప్రకటనలతో చిత్రరంగంలోకి...

పి.వి. దాసు మద్రాసులో వేల్ పిక్చర్స్ లిమిటెడ్ పేరిట సినీనిర్మాణ సంస్థను నెలకొల్పారు. రామబ్రహ్మం, దాసు ఇద్దరూ మంచి మిత్రులు. సినీ నిర్మాణ విషయాలు చరిచించడానికి రామబ్రహ్మం దాసు వద్దకు వెళ్తుండేవారు వారితో సముద్రాల కూడా స్టూడియోకి వెళ్ళేవారు. ఆ స్నేహంతోనే వేల్ పిక్చర్స్ వారు నిర్మించిన ‘సీతాకల్యాణం’ (1934), ‘శ్రీకృష్ణలీలలు’ (1935) చిత్రాలకు స్నేహధర్మంగా సముద్రాల ప్రకటనలు రాసిపెట్టారు. తరవాత 1936 వేల్ పిక్చర్స్ నిర్మించిన ‘మాయాబజార్’ (శశిరేఖా పరిణయము) నిర్మాణ దశలో కొన్ని సన్నివేశాలను చేర్చాల్సి వచ్చినప్పుడు ఆ చిత్ర దర్శకులు పి. పుల్లయ్య గూడవల్లిని సంప్రదించగా ఆయన వెంటనే సముద్రాల పేరు సూచించారు. పుల్లయ్య ఆహ్వానం మీద స్టూడియోకి వెళ్లి సముద్రాల ఆ సన్నివేశాలకు మాటలు రాసి దర్శకుని మెప్పుపొందారు. అదే సముద్రాల సినిమాకోసం చేసిన తొలి రచన. అప్పుడే సరస్వతీ టాకీస్ కు చెందిన పారుపల్లి శేషయ్య, కురుకూరు సుబ్బారావు కొల్హాపూర్ లో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ (1936) చిత్రాన్ని నిర్మిస్తూ సముద్రాల చేత కొన్ని సన్నివేశాలకు సంభాషణలు రాయించుకున్నారు. తరవాత సరస్వతీ టాకీస్ వారి ఆఫీసు మద్రాసుకు మారింది. రెండవ ప్రయత్నంగా చందాల కేశవదాసు నాటకం ‘కనకతార’ (1937) ను హెచ్.వి. బాబు దర్శకత్వంలో సినిమాగా నిర్మిస్తూ గూడవల్లి రామబ్రహ్మం సూచనమేరకు మాటలు, పాటలు, పద్యాలు పూర్తిగా సముద్రాల చేత రాయించారు. నాటకంలో వున్న గ్రాంధిక భాషను పక్కన పెట్టి వ్యావహార భాషా శైలిలో సంభాషణలు రాసి సముద్రాల ‘భేష్’ అనిపించుకున్నారు. అలాగే కేశవదాసు రచించిన పద్యాలను మార్చి వ్యావహారిక భాషలో పద్యాలు రాశారు. కీర్తనలవంటి పాటల స్థానంలో జానపద శైలిలో పాటలు రాశారు. ఆరోజుల్లో ఇది ఒక విప్లవాత్మక పరిణామం. ‘దేవుని మహిమా తెలియగా వశమా’ అనేది సముద్రాల రాసిన తొలి సినిమా పాట ‘కనకతార’ చిత్రం నాటక పంధాకు విభిన్నంగా, వినూత్నంగా ఉండడంతో నిర్మాతకు కాసులు కురిపించింది. సముద్రాల రచనా శైలిని మెచ్చుకుంటూ పత్రికలు సమీక్షలు రాశాయి.


రోహిణి తో పూర్తిస్థాయి సినీ రచయితగా...

టాకీపులిగా పేరుగాంచిన హెచ్.ఎం. రెడ్డి బి.ఎన్. రెడ్డితో కలిసి ‘రోహిణీ పిక్చర్స్’ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. బి. నాగిరెడ్డి, మూలా నారాయణస్వామి, రామనాథ్, శేఖర్, కన్నాంబ లను భాగస్వాములుగా చేర్చుకున్నారు. సముద్రాల కథ, మాటలు, పాటలు సమకూర్చారు. సోమరాజు రామానుజరావు ప్రఖ్యాత నాటిక ‘రంగూన్ రౌడీ’ హక్కులు కొని ఆ నాటికకు అసంఖ్యాక మార్పులుచేసి ‘గృహలక్ష్మి’(1938) చిత్రాన్ని నిర్మించారు. చిత్తూరు నాగయ్యకు ఇది తొలి చిత్రం. ఈ చిత్రాన్ని మద్రాసులోని గ్రీన్ వేస్ రోడ్ లో వున్న కార్తికేయ ఫిలిమ్స్ స్టూడియోలో నిర్మించారు. ‘గృహలక్ష్మి’ చిత్రం బ్రహ్మాండంగా ఆడింది. బి.ఎన్. రెడ్డి ‘గృహలక్ష్మి’ లోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో హెచ్.ఎం. రెడ్డితో విభేదించి తన భాగస్వామ్యాన్ని రద్దు చేసుకొని బయటకు వచ్చేశారు. తరవాత నాగిరెడ్డి, కె.వి. రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, సముద్రాల రాఘవాచార్యను కూడా బయటకు తీసుకొని వచ్చి వాహినీ సంస్థను నెలకొల్పారు. దీంతో జోడు గుర్రాలమీద స్వారి చెయ్యడం కష్టమనిపించి సముద్రాల ‘ప్రజామిత్ర’ సంపాదకత్వానికి 1937లో రాజీనామా సమర్పించి, పూర్తి సమయాన్ని సినీ సాహిత్య రచనకు కేటాయించారు. నిరుద్యోగ సమస్యను ఇతివృత్తంగా చేసుకొని వాహినీ బ్యానర్ మీద బి.ఎన్. రెడ్డి తొలి ప్రయత్నంగా ‘వందేమాతరం’ (1939) చిత్రాన్ని నిర్మించినప్పుడు సముద్రాల ఆ చిత్రానికి కథ, మాటలు, పాటలు సమకూర్చారు. సినిమా అద్భుత విజయాన్ని సాధించి సముద్రాలకు రచయితగా స్థానాన్ని సుస్థిరం చేసింది. తరవాత వరసగా వాహినీ సంస్థ బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘సుమంగళి’ (1940), ‘దేవత’ (1941), కె.వి. రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘భక్తపోతన’ (1942) చిత్రాలకు రచన చేశారు. తరవాత నాగయ్య ’రేణుకా పిక్చర్స్’ అనే సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి ‘భాగ్యలక్ష్మి’ (1943) చిత్రాన్ని మొదలుపెట్టారు. ఆ చిత్రానికి కథ, మాటలు, పాటలు సముద్రాల రాశారు. ఈ చిత్రం నిర్మాణంలో వుండగా మద్రాసుమీద రెండవ ప్రపంచ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. జపాన్ దేశం మద్రాసు నగరం మీద బాంబుల వర్షం కురిపించబోతుందని వార్తలు రావడంతో వాహినీ వాళ్ళు తాడిపత్రికి, నాగయ్య తిరుపతికి వెళ్ళిపోయారు. రామనాథ్, శేఖర్ జెమినీ సంస్థలో చేరారు. పత్రికా సంపాదక వృత్తిని వదలుకొని, చేతిలో సినిమాలు లేక సముద్రాల ఆర్ధిక చిక్కులో ఇరుక్కున్నారు. అప్పుడు జెమినీ వాసన్ రామనాథ్ చొరవతో ‘జీవన్ముక్తి’ (1943) అనే సినిమాకి పాటలు రాసే అవకాశాన్ని సముద్రాలకు కలిపించారు. యుద్ధ వాతావణం తగ్గిన తరవాత గూడవల్లి రామబ్రహ్మం సారథి ఫిలిమ్స్ పతాకం మీద నిర్మించబోయే ‘పంతులమ్మ’ చిత్రానికి పనిచేయాల్సిందిగా సముద్రాలను ఆహ్వానించారు. అదే సమయంలో తమిళనాడు టాకీస్ వారు నిర్మిస్తున్న ‘చెంచులక్ష్మి’ (1943) చిత్రానికి మాటలు, పాటలు రాసే అవకాశం కలిగింది. దాంతో సముద్రాల ఆర్ధిక సమస్యలనుండి గట్టెక్కారు.

వెనువెంటనే రచనావకాశాలు...

1945 లో వాహినీ వారు ‘స్వర్గసేమ’ చిత్రాన్ని నిర్మిస్తూ సముద్రాలకు స్వాగతం పలికారు. చక్రపాణితో కలిసి సముద్రాల మాటలు, కొన్ని పాటలు రాశారు. నాగయ్య స్వంత సినిమా ‘త్యాగయ్య’ (1946), రామబ్రహ్మం నిర్మించిన ‘పల్నాటియుద్ధం’ (1947), భరణీ వారు నిర్మించిన ‘రత్నమాల’ (1947), వాహినీ చిత్రం ‘యోగి వేమన’ (1947), ప్రతిభా వారి ‘బాలరాజు’ (1948), మీర్జాపురం రాజా, కృష్ణవేణి ల ‘మనదేశం’ (1949) సినిమాలకు మాటలు, పాటలు సమకూర్చే అవకాశం సముద్రాలకు వచ్చింది. ఇక వెనుకకు చూడాల్సిన అవసరం రాలేదు. తరవాత 1949-68 మధ్యకాలంలో లైలా మజ్ను, స్వప్నసుందరి, చండీరాణి, బ్రతుకు తెరువు, విప్రనారాయణ, దొంగరాముడు, జయంమనదే, కనకతార, సారంగధర, వినాయకచవితి, భూకైలాస్, బాటసారి, పాండవ వనవాసము, సీతారామ కల్యాణం, లవకుశ, నర్తనశాల, శ్రీకృష్ణ పాండవీయం, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణావతారం, శ్రీరామకథ వంటి అనేక సినిమాలకు రచయితగా సేవలు అందించారు. అశ్వరాజ్ సంస్థ అధినేత కె. గోపాలరావు 1957లో నిర్మించిన ‘వినాయకచవితి’ సినిమాకు కథ, మాటలు, పాతలతోబాటు దర్శకత్వం కూడా వహించారు. 1964లో ఎన్.టి. రామారావు, ఎస్. వరలక్ష్మి ముఖ్యతారాగణంగా ‘బబ్రువాహన’ చిత్రానికి కథ, సంభాషణలేకాకుండా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ముచ్చటగా మూడవసారి ఘంటసాల నిర్మించిన ‘భక్తరఘునాథ్’ (1960) సినిమాకు కూడా కథ, మాటలు, పాటలు రాయడంతోబాటు దర్శకత్వం కూడా చేపట్టారు. అయితే ఈ మూడు సినిమాలు పెద్దగా ఆడలేదు.

ఘంటసాలకు ఆసరా...

మద్రాసు నగరంలో సముద్రాల నివాసం త్యాగరాయనగర్ మూసా వీధిలో వుండేది. వారి ఇల్లు వచ్చేపోయేవారితో ఒక సత్రంలా వుండేది. ఘంటసాల అత్తవారి వూరు, సముద్రాల వూరు ఒక్కటేకావడంతో 1944లో ఘంటసాల వివాహానికి సముద్రాల పెదపులివర్రు వచ్చి ఆశీర్వదించారు. ఘంటసాల గాత్రం విని మద్రాసు వచ్చి అదృష్టం పరీక్షించుకోమని చెప్పారు. వారి సలహామేరకు ఘంటసాల మద్రాసు చేరుకొని సముద్రాల ఇంటిలోనే విడిది చేశారు. సముద్రాల ఘంటసాలను వెంటబెట్టుకొని నిర్మాతల వద్దకు, దర్శకుల వద్దకు వెళ్లి పరిచయం చేసి అవకాశాలు ఇమ్మని అడిగేవారు. అలాగే మద్రాసు ఆకాశవాణి కేంద్రానికి కూడా తీసుకెళ్ళారు. అక్కడ బాలాంత్రపు రజనీకాంతరావు ఆశీస్సులతో ‘వెలుగు వెల్లువ’ అనే రేడియో నాటకంలో పాట పాడించారు. తరవాత ‘సీతారామజననం’ లో ఘంటసాల బలరామయ్య ఘంటసాలకుమ చిన్న వేషం ఇచ్చారు. నాగయ్య గారి ‘త్యాగయ్య’ లో కూడా చిన్న వేషం దొరికింది. చివరకు వాహినీ వారి ‘స్వర్గసీమ’ చిత్రంలో భానుమతితో కలిసి ‘రేయెన్నెల చిరునవ్వుల ఇరజిమ్ము పఠాణీ’ అనే గాజులపిల్ల పాటను పాడారు. అదే ఘంటసాల పాడిన తొలి చలనచిత్ర గీతం. తరవాత కృష్ణవేణి నిర్మించిన ‘మనదేశం’ చిత్రానికి ఘంటసాల సంగీత దర్శకత్వం వహించేందుకు సముద్రాల సిఫారసే కారణం. ఘంటసాల సముద్రాలవద్ద దాచుకున్న సొమ్ముతో ఉస్మాన్ రోడ్డులో పెద్ద ఇల్లు కొనుక్కోగలిగారు. ఘంటసాల సముద్రాలను ఓ తండ్రిగా, గురువుగా, జీవిత మార్గదర్శిగా భావించేవారు.

సముద్రాల ఆత్మ మల్లాది...

మల్లాది రామకృష్ణశాస్త్రి అంటే సముద్రాలకు పుత్రవాత్సల్యం. మల్లాది సినీరంగ ప్రవేశానికి ముందే సముద్రాలకు స్నేహబంధముండేది. తొలిసారి ఇద్దరూ గూడవల్లి రామబ్రహ్మం సినిమా ‘పల్నాటి యుద్ధం’ కు కలిసి పనిచేశారు. తరవాత ‘దేవదాసు’, ‘స్త్రీసాహసం’, ‘దొంగరాముడు’ చిత్రాలకు కలిసి పనిచేశారు. సముద్రాల బిజీగా వుండడం చేత సముద్రాల కొన్ని పాటలను మల్లాది చేత రాయించేవారు. అయితే ఆ పాటలు సముద్రాల పేరుతోనే చలామణి అయ్యేవి. ఈ విషయమై మల్లాదిని పాత్రికేయులు అడిగితే మల్లాది “సముద్రాల నా కలంపేరు” అనేవారు. కానీ ఎప్పుడూ సముద్రాల గారికి అజ్ఞాతకవిగా పాటలు రాసినట్లు మల్లాది యెక్కడా చెప్పుకోలేదు. వారిద్దరి మధ్య వున్న ఆత్మీయ బంధం అలాంటిది. ఇక పింగళి నాగేంద్రరావు విషయానికి వస్తే, ‘ప్రజామిత్ర’ పత్రికలో పింగళి చేత సముద్రాల యెన్నో వ్యాసాలు రాయించేవారు. అలా వారి మధ్య అనుబంధం పెరిగింది. సముద్రాల బిజీగా వున్న తరుణంలో వాహినీ వారు కె.వి. రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘గుణసుందరి కథ’ (1949) సినిమాకు కథ, మాటలు, పాటలు పింగళి నాగేంద్రరావు చేత రాయించారు. దీనికి ముందు పింగళి ‘బలేపెళ్లి’ (1941) చిత్రానికి రచనచేశారు. కానీ ఆచిత్రం అపజయం పాలవడంతో బందరు వెళ్ళిపోయారు. తరవాత మద్రాసు వచ్చి ‘వింధ్యరాణి’ చిత్రానికి మాటలు రాశారు. అదికూడా విజయవంతం కాలేదు. అయితే ‘గుణసుందరి’ చిత్రం పింగళికి కథా రచయితగా, గేయ రచయితగా గుర్తింపుతెచ్చిపెట్టింది. వాహినీ వారికి సముద్రాల ఆస్థాన రచయిత కాగా, వాహిని తో విడిపోయిన విజయా సంస్థకు పింగళి ఆస్థాన రచయిత అయ్యారు. అయితే విజయా వారి తొలిచిత్రం ‘షావుకారు’ (1950)కు సముద్రాల పాటలు రాశారు. సముద్రాల బిజీగా వున్నకాలంలో ప్రభుత్వం పురస్కారాలను ప్రవేశపెట్టలేదు. తదనంతరకాలంలో తెనాలి రామకృష్ణ, లవకుశ, నర్తనశాల, అమరశిల్పి జక్కన్న చిత్రాలు జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాలు పొందాయి. భక్త ప్రహ్లాద చిత్రానికి స్వర్ణపతకం లభించింది. 1962లో సముద్రాల దంపతులకు మద్రాసు వాణీమహల్ లో షష్టిపూర్తి మహోత్సవం వైభవంగా జరిగింది. రామారావు నిర్మించిన ‘శ్రీరామపట్టాభిషేకం’ చిత్రానికి సముద్రాల స్క్రిప్టు సమకూర్చారు. సముద్రాల రాసిన చివరి చిత్రం ‘వీరాంజనేయ’. పద్మనాభం 1968 లో నిర్మించిన ‘శ్రీరామకథ’ చిత్రంలో సముద్రాల “రామకథ శ్రీరామ కథ” అనే టైటిల్ సాంగ్ ను రాశారు. అదే సముద్రాల రాసిన చివరి పాట. సముద్రాల రచనచేసిన ‘వందేమాతరం’ చిత్రాన్ని మైసూరు సంస్థాన మహారాజు ప్రత్యేకంగా చూసి అభినందించారు. ‘స్వర్గసీమ’ సినిమా వియత్నాంలో జరిగిన అతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. మరొక సినిమా ‘నర్తనశాల’ జకార్తా లో ఉత్తమచిత్ర బహుమతితోబాటు ఉత్తమ నటుడిగా రంగారావు, ఉత్తమ కళాదర్శకుడిగా టి.వి.ఎస్. శర్మకు బహుమతులు తెచ్చిపెట్టింది.

వ్యక్తిగతం

సముద్రాలకు రామానుజాచార్య (జూనియర్ సముద్రాల), శేషాచార్య అనే ఇద్దరు కుమారులు, కుముదవల్లి తాయారు, అలివేలు మనగ తాయారు అనే ఇద్దరు పుత్రికలు సంతానం. 1962 జూలై 19 న మద్రాసు వాణీ మహల్ లో సముద్రాలకు షష్టిపూర్తి మహోత్సవం జరిగింది. 1967లో సముద్రాలకు ఉబ్బస వ్యాధి ముదిరి, వూపిరితిత్తులు క్షీణించడంతో గుత్తా రామినీడు తలపెట్టిన ‘భక్తపోతన’ చిత్రానికి సముద్రాల తన శిష్యుడైన దాసం గోపాలకృష్ణ చేత మాటలు రాయించారు. అప్పటికీ అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించిన ‘శ్రీకృష్ణావతారం’, వీనస్ మహీజా వారి ‘వీరాంజనేయ’, సురేశ్ ప్రొడక్షన్స్ వారి ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రాలకు ఇబ్బంది పడుతూనే సముద్రాల రచన చేశారు. వ్యాధి ముదిరి మార్చి 16, 1968 న మూడు దశాబ్దాలుగా చలనచిత్ర సీమలో ఓ వెలుగు వెలిగిన సాహితీ సూర్యుడు అస్తమించారు.

మచ్చుకి సముద్రాల డైలాగులు రెండు...

శ్రీకృష్ణ పాండవీయంలో సుయోధనుడు:

- “పాంచాలీ... పంచ భర్తృకా... నీవా నన్ను పరిహసించునది! సకల మహీపాల మకుట మాణిక్య శోభా నీరాజితుడైన రారాజును, నేడొక్క అబల, బంధకి అపహసించుటయా! అభిమానధనుడైన సుయోధనుడది విని సహించుటయా... సహించక మరణించుటా!.. మరణించి సాధించునది... మచ్చ మాసిపోవునా... పరిహాస్పదుడై ప్రాణత్యాగము చేసికొన్నాడన్న అపనింద వేరొక్కటా...కల్ల... ఈ పరాభవము దాగుట కల్ల...ఆ పాంచాలి ప్రక్కన నిలచి ఫక్కున నవ్విన ఆ టెక్కులాండ్రలో, యే ఒక్కతైనా ఈ వార్త ప్రక్కవాటుగా నొక్కించక మానునా! ఈ అపఖ్యాతి ఆనాటికానాటికి జ్వాజ్వల్యమాన దావానలమై అఖండ భూమండల మావరించి మా శ్రవణపుటభేద్యము కాకమానునా...శత్రువులని తెలిసి తెలిసి నన్నధిక్షేపించుటకే పన్నిన పన్నాగమని ఎరిగి ఎరిగి మందమతినై, మామ మాటలకు ఏల చెవి ఒగ్గవలె... ఈ పాండవ హతకుల ఆహ్వానము నేనెలా మన్నించవలె... మన్నించితిపో...ఈ మయసభ మాకేల విడిది కావలె...అయినదిపో...ఈ మందిర సౌందర్య సందర్శనాపేక్ష నాకేల జనించవలె...జనించెపో... మేమందేల పరిభ్రమించవలె, మనసేల భ్రమించవలె... ఆహూతుడన్న ఆదరముంచక, వావివరుసలు గణించక, బంధువని పాటించక, ఆ బంధకి... పాంచాలి... ఏల అపహసించవలె! మనుటయా మరణించుటయా’’

పాండవవనవాసములో సుయోధనుడు:-

“అస్మదీయ పితృదయాలబ్ధరాజ్యమాత్రవైభవులై, సామంతులైన పాండవులు రాజసూయాధ్వరప్రవర్తకులై, భద్రసింహాసనారూఢులై ఈ రారాజును చూసి పరిహసింతురే! చతుస్సముద్ర వేలావలయిత ధరణీ పట్టభద్రుడనైన ఈ కౌరవ చక్రవర్తిని చూచి ఒక బంధకి, పంచ భర్తృక... ఆ ద్రౌపది పరిహసించునా! దానిని సహించి రారాజు జీవించుటయా.....ఈ పరాభవానికి తగిన ప్రతీకారం జరగవలసినదే ... పగ సాధించవలసినదే! ఉద్దండ వైరిమండలహృదయ విభేదన ప్రచండమైన ఈ గధా దండము నిస్సారమా! నిరర్ధకమా!!”

కొన్ని పాటలు...

1)మదనా నవమదనా స్వాగతమోయీ... చిగురాకులివే బాకులివే #చిలకహుమాయి వజీరా ... రత్నమాల

2)రాదే చెలీ నమ్మరాదే చెలీ మగవారినిలా నమ్మరాదే చెలీ, రాదే చెలీ ... దేవత

3)సర్వమంగళ నామా సీతారామా రామా శర్వ వినుతా శాంతి దాతా రామా రామా ... భక్తపోతన

4)చెలియా కనరావా నిరాశబూని పోయితివా ... బాలరాజు

5)ఓహో చారుశీలా ఒహోహో వీర బాలా ఈ విరాళి తీరుపవే నా వరాల జవరాలా ... పల్నాటి యుద్ధం

6)ప్రేమే నేరేమౌనా మాపై ఈ పగేలా వేదనగానే మా వలపంతా వేసారునా ... లైలామజ్ను

7)అందాలు చిందేటి నా జ్యోతి ... యోగి వేమన

8)ఏమనేనే చిన్నారి ఏమనేనే వన్నెల సిగపూవా కనుసన్నలలో భావమేమి ... షావుకారు

9)జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా ... దేవదాసు

10)ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతనా ఇందుకేనా నీవుచేసే పూజలన్నీ తపోధనా... విప్రనారాయణ

11)జీవితమే సఫలము రాగసుధా భరితము ప్రేమ కథా మధురము .. అనార్కలి

12)చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా ... దొంగరాముడు

13)హాయిహాయిగా ఆమని సాగే సోయగాల గనవోయీ సఖా హాయి సఖా ... సువర్ణసుందరి

14)దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో ... భూకైలాస్

15)సీతారాముల కల్యాణము చూతము రారండి ... #సీతారామకల్యాణం

16)ఓ బాటసారీ నను మరువకోయీ మజిలీ ఎటైనా మనుమా సుఖానా ... బాటసారి

17)శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ... లవకుశ

18)జననీ శివకామినీ జయ శుభ కారిణి విజయరూపిణీ ... నర్తనశాల

19)హిమగిరి సొగసులూ మురిపించునూ మనసులూ ... పాండవ వనవాసము

20)జీ"వము నీవేకదా దేవా ... భక్త ప్రహ్లాద

- ఆచారం షణ్ముఖాచారి



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.