శేఖర్ కమ్ముల.. మంచి కాఫీలాంటి సినిమాలు

ఇంటర్వెల్ కి ముందు... ఆ తర్వాత మూడు ఫైట్స్, మూడు సాంగ్స్... .మధ్య మధ్య కాస్త కామెడీ...ఇదీ తెలుగు సినిమా కిచిడి. ఏ కొత్త దర్శకుడు వచ్చినా ఇంచుమించు ఇదే ఫార్ములా. ఇదే చట్రం. మాస్ సినిమాల పేరుతో ఇవే విన్యాసాలు. గోదారికి పుష్కరమొచ్చినట్లు అపుడపుడు కొంతమంది అభిరుచిగల దర్శకులు వస్తారు....అచ్చం శేఖర్ కమ్ములలా. వేడి వేడిగా పొగలు కక్కే రంగూ, రుచి, వాసన గల మంచి కాఫీలాంటి సినిమాలు అందిస్తారు. ముష్టిఘాతాలు, తలలు నరుక్కోవడాలులాంటి ఊర మాస్ సినిమాలు తెగ చూసేసి విసిగి వేసారెత్తిన ప్రేక్షకులకు మంచిగంధంలాంటి సినిమా వస్తే గోదారికి వరద వచ్చినట్లే. ఎంత కాలమైనదో...మంచి సినిమాకి మొహం వాచి...అనుకుంటూ ఆ సినిమాని నెత్తికెత్తుకుంటారు. ఔను... వ్యక్తిత్వం గల పాత్రలు, తర్కంతో కూడిన కథాకథనాలు, మనసుకు ఊరటనిచ్చే సన్నివేశాలు, ఔరా...అనిపించే సందర్భాలు, హృదయాల్ని తాకే సుశ్రావ్య గీతాలు, గుండె కింద తడిని తడిమే అక్షరాలు...ఇవన్నీ ఒక్కసారిగా ఎదురైతే ప్రేక్షకుడి ఆనందానికి పట్టపగలు ఉంటాయా? ఏదో...సినిమా తీసేసాం... చూసేయండి అంటూ ఊదరగొట్టేయడమే తప్ప సరకు లేని చోట ఆదరణ ఎక్కడుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానంగానే శేఖర్ కమ్ముల చిత్రాలు మనసుకు హత్తుకుంటున్నాయి. ప్రేక్షకులని ఫిదా చేస్తున్నాయి. ప్రశాంత గోదారిలా గుండెల్ని తడిపేస్తున్నాయి. తెలుగు సినిమాకి శేఖర్ కమ్ముల అందిస్తున్న సృజన ఎప్పటికి చెరిగిపోనిది...చరిత్రలో మిగిలిపోయేది. దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా బహుముఖ ప్రజ్ఞ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.


* 17 ఏళ్ళు... 10 సినిమాలు
శేఖర్ కమ్ముల 2000 సంవత్సరంలో మెగా ఫోన్ పట్టుకుని డాలర్ డ్రీమ్స్ పేరుతో తన సినీ కలని సాకారం చేసుకున్నారు. ఆ సినిమా తీసేటప్పుడు ఆయన పడ్డ తపన, తపస్సు అంతా ఇంతా కాదు. ఒకేసారి సినిమాని పూర్తి చేసే స్థాయిలో చేతుల్లో అంత సొమ్ము లేదు. కానీ, సినిమా తీయాలనే సంకల్పం మెండుగా ఉంది. ఆ సంకల్పమే ఏ మాత్రం చెదిరిపోకుండా నెమ్మది నెమ్మదిగా డబ్బులు సమకూర్చుకుంటూ తీసిన సినిమా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమాతో బెస్ట్ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ గా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. డాలర్ డ్రీమ్స్ తో విమానం రెక్కలు పట్టుకుని విదేశాలకు మేధో వలస వెళ్తున్న భారతీయుల్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా. అవార్డులు, పురస్కారాలు అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను సైతం అనుడుకున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఈ కొత్త దర్శకుడిపై జనాలకు ఆసక్తి పెరిగింది. ఆయన సృజనకు ఆశ్చర్యం కలిగింది. ఆ తరవాత నుంచి శేఖర్ కమ్ముల ఎం చేస్తున్నారో? అనే కుతూహలం కూడా హెచ్చింది. శేఖర్ కమ్ముల నుంచి వచ్చే ప్రతీ సినిమాని అక్కున చేర్చుకోవాలని అభిమానం కూడ పెరిగింది. 2004లో శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన సినిమా ఆనంద్. మంచి కాఫీలాంటి సినిమా అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజా, కమలిని ముఖర్జీ హీరో హీరోయిన్ లుగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని చవి చూసింది. వ్యక్తిత్వం ఉన్న నాయికలు తెరపై కనుమరుగవుతున్న నేపథ్యంలో...ఆనంద్ సినిమాలో కమలిని ముఖర్జీ పాత్ర ప్రశంసాపాత్రమైనది 2006లో గోదావరి, 2007లో హాపీడేస్, 2008లో ఆవకాయ బిర్యాని, 2010లో లీడర్, 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 2014లో అనామిక, 2017లో ఫిదా సినిమాలు శేఖర్ కమ్ముల ఖ్యాతిని ఇనుమడింపచేశాయి. ఒక్కో సినిమా ఒక్కో నేపథ్యంతో సాగడం, పాత్రల మధ్య ఘర్షణ, మానసిక సంఘర్షణ ప్రాతిపదికగా సన్నివేశాలను పొదగడం శేఖర్ కమ్ముల ప్రత్యేకత. ఆనంద్, గోదావరి, ఫిదా సినిమాల్లో మహిళా ఔన్నత్యాన్ని తెరకి అనువదించిన తీరు అభినందనీయం. అలాగే... లీడర్ సినిమాలో రాజకీయాల్ని స్పృశించిన దర్శకుడు హాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో యువత అంతరంగాన్ని అందంగా ఆవిష్కరించారు. ఫిదా సినిమాలో తెలంగాణా యాస్కి పట్టాభిషేకం చేస్తూనే... తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఒంటరై పోయే తండ్రి గురించి మధనపడే నాయిక పాత్రను హృద్యం గా మలచారు. ఇలా...ప్రతి సినిమాలోనూ తనదయిన ముద్ర వేస్తూ శేఖర్ కమ్ముల ప్రేక్షకుల మనస్సులకు దగ్గరయ్యారు. విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.


* వ్యక్తిగతం
శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4న హైద్రాబాద్ లో జన్మించారు. తండ్రి శేషయ్య కమ్ముల. భార్య శ్రీవిద్య కమ్ముల. చైతన్య భారతి ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసారు. తర్వాత యు ఎస్ లో కంప్యూటర్ సైన్స్ లో ఎమ్ ఎస్ చేసిన శేఖర్ కమ్ముల ఐటీ రంగంలో మూడు సంవత్సరాలు పనిచేసారు. ఆ తర్వాత హార్వార్డ్ యూనివర్సిటీ లో ఎం.ఎఫ్. ఎ . చేశారు. ఎం.ఎఫ్. ఎ . చేస్తున్నప్పుడే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశారు.


* అవార్డులు-పురస్కారాలు
శేఖర్ కమ్ముల తాను తీసిన సినిమాలకుగాను అనేక అవార్డులు అందుకున్నారు. 2004లో ఆనంద్ సినిమాకి గాను ఉత్తమ దర్శకుడిగా, ద్వితీయ ఉత్తమ సినిమాగా రెండు నంది అవార్డులు అందుకున్నారు. 2006లో గోదావరి సినిమాకి ఉత్తమ దర్శకుడిగా, ద్వితీయ ఉత్తమ సినిమాగా రెండు నంది అవార్డులు అందుకున్నారు. 2007లో హ్యాపీ డేస్ సినిమాకిగాను తీయ ఉత్తమ సినిమాగా నంది అవార్డు అందుకున్నారు. 2011లో లీడర్ సినిమాకి ఉత్తమ కథకుడిగా నంది అవార్డు అందుకున్నారు. 2007లో హ్యాపీ డేస్ సినిమాకి ఉత్తమ సినిమాగా , ఉత్తమ దర్శకుడిగా రెండు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. హ్యాపీ డేస్ సినిమాకి దాసరి బెస్ట్ ఫిలిం డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. ఫిదా సినిమాకి జీ గోల్డెన్ అవార్డుని స్వీకరించారు.


- పి.వి. డి.ఎస్. ప్రకాష్

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.