మూగబోయిన మువ్వల రవళి

సుమారు మూడువేల సంవత్సరాలకు పూర్వం భరతముని తెలుగు జాతికి అందించిన నాట్య వినోదం కూచిపూడి నాట్యం. భరతనాట్యానికి ధీటుగా కూచిపూడి ముద్రతో భామాకలాపం వంటి లాస్యకళా రీతులను తనదైన శైలిలో ప్రదర్శిస్తూ అఖండ భారతావనికే కాకుండా, ప్రపంచ నలుమూలలా తన ప్రదర్శనలతో కళాసేవచేసిన ప్రఖ్యాత నాట్యమయూరి పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు 64 ఏళ్ల వయసులో అస్వస్థులై హైదరాబాద్ ఆసుపత్రిలో చేరి మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు శివైక్యం చెందడం తెలుగు ప్రజల దురదృష్టం. ముఖ్యంగా భామాకలాపం నృత్యప్రదర్శనలో శోభా నాయుడు సత్యభామ పాత్రలోని విరహవేదన అభినయించే తీరు, ఆ ప్రయత్నంలో హావభావాలను ప్రదర్శించే విధానం ఆమె సొంతం. నిరాడంబరంగా వుంటూ అందరితో ఇట్టే కలిసిపోయే మనస్తత్వం కలిగిన శోభా నాయుడు ఆత్మకు సద్గతి కలగాలని ఆకాంక్షిస్తూ, ఆమెను గురించి కొన్ని విశేషాలు...


తొలిరోజుల్లో...

శోభా నాయుడు జన్మస్థలం అనకాపల్లి. సరోజినీ దేవి, వెంకటనాయుడు ఆమె తల్లిదండ్రులు. తండ్రి వెంకట నాయుడు ఇంజనీరు గా పనిచేసేవారు. తండ్రికి కూతుర్ని డాక్టర్ చేయాలనే కోరిక వుండేది. అయితే ఆమె నాట్యం పట్ల మొగ్గుచూపడంతో అది సాధ్యపడలేదు. శోభా నాయుడు రాజమహేంద్రవరంలో పి.ఎల్. రెడ్డి వద్ద నాట్యశాస్త్రంలోని ప్రాధమిక మెళకువలు నేర్చుకున్నారు. తల్లిదండ్రులకు శోభా నాయుడు నాట్యకళను అభ్యసించడం ఇష్టం లేకున్నా, ఆమె అభిరుచిని కాదనలేక తర్ఫీదు ఇప్పించారు. 12 ఏళ్లకే శోభా నాయుడు రాజమహేంద్రవరంలో నృత్య ఆరంగేట్రం చేశారు.

చెన్నపట్నంలో నాట్య శిక్షణ...

చెన్నై లోని క్వీన్స్ మేరే కళాశాలలో ఆమె పట్టభద్రురాలయ్యారు. అక్కడ వుంటూ ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చిన సత్యం గారి అకాడమీలో పన్నెండు సంవత్సరాలపాటు కూచిపూడి నాట్య కళను అభ్యసించి ఆపోశన పట్టారు. సాధన విషయంలో శోభా నాయుడు తీసుకుంటున్న శ్రద్ధకు ముగ్ధుడైన వెంపటి చిన సత్యం, ఆమెను తన ప్రధాన శిష్యురాలిగా చేసుకున్నారు. భరతనాట్య గురువు గా పేరుగాంచిన వాళ్వూరు రామయ్య పిళ్ళై శోభా నాయుడు కి భరతనాట్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తానని ప్రతిపాదించగా, కూచిపూడి నాట్యం మీద వున్న మక్కువతో ఆ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించారు. తరవాత చెన్నై విడచిపెట్టి హైదరాబాద్ దోమల్ గూడాలోని గగన్ మహల్ కాలనీలో కూచిపూడి నాట్య అకాడమీని స్థాపించి వేలాది బాలికలకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇచ్చారు. స్వయంగా 15 నృత్యనాటికలకు రూపకల్పన చేసి ప్రదర్శనలు ఇచ్చారు. ఇవికాకుండా ఏకాంకిక నృత్య ప్రదర్శనలు కోకొల్లలుగా ప్రదర్శించారు. శోభా నాయుడు ప్రత్యేకంగా చండాలిక, విప్రనారాయణ, కల్యాణ శ్రీనివాసం, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ పారిజాతం, విజయోస్తుతే నారీ, క్షీరసాగర మథనం, సర్వం సాయిమయం, జగదానంద కారక, గిరిజా కల్యాణం, స్వామి వివేకానంద వంటి నృత్య నాటికలకు రూపకల్పన చేయించి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రదర్శనలు ఇచ్చారు. ఈ నృత్యనాటికలలో శోభా నాయుడు చండాలిక, సత్యభామ, దేవదేవకి, పద్మావతి, మోహిని, పార్వతీదేవి, సాయిబాబా పాత్రలను పోషించేవారు. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ వారి 'సాధన' అనే కార్యక్రమం ద్వారా చిన్నారులకు నృత్య శిక్షణా కార్యక్రమాలను ఆమె నిర్వహించారు. సంస్కృతి టెలివిజన్ చానల్ లో 'సిరిసిరిమువ్వ' అనే కార్యక్రమం ద్వారా చిన్నారులకు నృత్య శిక్షణ అమలు చేశారు. శ్రీనివాస కల్యాణం నృత్యనాటికకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ప్రచారం కల్పించి వీడియో ప్రచార సాధనాల ద్వారా ఆ నృత్య నాటికకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

కూచిపూడి నాట్య అమలులో...

అమెరికా దేశంలోని 'తానా' (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సంస్థ శోభా నాయుడుని అనేకసార్లు అమెరికాకు ఆహ్వానించి నృత్య నాటికలను ప్రదర్శింపజేసింది. లండన్, రష్యా, సిరియా, బాగ్దాద్, కంపూచియా, టర్కీ, హాంగ్ కాంగ్, బ్యాంకాక్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలలో నృత్యప్రదర్శనలు ఇచ్చి కూచిపూడి నాట్యానికి ప్రచార రాయబారిగా వ్యవహరించారు. భారతదేశం తరఫున వెస్ట్ ఇండీస్, మెక్సికో, వెనిజులా, ట్యూనిస్, క్యూబా దేశాలలో సాంస్కృతిక బృందానికి ఆమె నాయకత్వం వహించారు. భారతదేశంలోనే కాకుండా 'ఆన్ లైన్' ద్వారా రెండువేలకు పైగా బాలబాలికలకు కూచిపూడి నాట్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 2010 లో 'కూచిపూడి నాట్య కళా అకాడమీ' 30 వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలలోని శోభా నాయుడు శిష్యురాండ్రు విచ్చేసి ప్రదర్శనలు ఇచ్చారు. మద్రాసు నగరంలోని ప్రతిష్టాత్మక 'కృష్ణ గానసభ' సంస్థ శోభా నాయుడు కు 'నాట్య శిరోమణి' బిరుదు ప్రదానం చేసి గౌరవించింది. 1990లో కేంద్ర సంగీత నాటక ఆకాడమీ అవార్డును శోభా నాయుడు స్వీకరించారు. ముంబై కి చెందిన శ్రీ శ్రీరంగ సంసద్ సంస్థ 'నృత్యవిహారి' బిరుదు ప్రదానం చేసి అవార్డుతో సత్కరించింది. 1996లో చెన్నై నుంగంబాకం సాంస్కృతిక సంస్థ వారు 'నృత్య కళా శిరోమణి' బిరుదు ప్రదానం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్.టి. రామారావు అవార్డుతో ఆమెను సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శోభా నాయుడుకు 'కళాప్రపూర్ణ' డాక్టరేట్ ప్రదానం చేసింది. తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'హంస' అవార్డును శోభా నాయుడు స్వీకరించారు. 2001లో భారత ప్రభుత్వం ఆమెకు 'పద్మశ్రీ' అవార్డును ప్రదానం చేసి సత్కరించింది. 2011 లో జరిగిన 'నృత్యోత్సవ్' లో శోభా నాయుడు వివిధ పాత్రలతో కూడిన 'దేవి' ఆహార్యంలో 'నవరస నటభామిని'గా ప్రదర్శన ఇచ్చారు.

సినిమా నటనకు ‘నో’...

సినిమాలలో నటించమని ఆమెకు చలనచిత్రపరిశ్రమ ఎన్నోసార్లు ఆహ్వానం పలికినా, స్వచ్ఛంద కళాసేవ చేయాలనే సత్సంకల్పంతో ఆ ప్రతిపాదనలను శోభా నాయుడు సున్నితంగా తిరస్కరించారు. విజయా నిర్మాత బి. నాగిరెడ్డి శోభా నాయుడు ని ఆహ్వానించి ఒక బ్లాంక్ చెక్ ఇస్తూ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టమని కోరారు. కానీ తన జీవితాన్ని నాట్యకళకే అంకితం చేస్తానని, సినిమాలు అంటే తనకు గౌరవమే కానీ వాటిలో నటించడం తనకు ఇష్టంలేదని చెప్పారు. ఆమెకు నాట్యం మీద వున్న అంకిత భావానికి నాగిరెడ్డి ఆమెను అభినందించారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆమెతో నటించాలని వుందని ఎన్నోసార్లు శోభా నాయుడు కి చెప్పిచూశారు. కానీ శోభా నాయుడు ఒప్పుకోలేదు. 1976 లో దర్శకుడు కె. విశ్వనాథ్ ‘సిరిసిరిమువ్వ’ చిత్రాన్ని నిర్మిస్తూ శోభా నాయుడు కి అందులో నృత్యప్రధానమైన హీరోయిన్ పాత్రను ఇవ్వజూపారు. ఆమె కాదనడంతో ఆ పాత్ర జయప్రదకు దక్కింది. ప్రముఖ క్యారక్టర్ నటులు ఎస్.వి. రంగారావు శోభా నాయుడు కి వరసకు తాతగారు అవుతారు. వారుకూడా ఏనాడూ శోభా నాయుడుని సినిమాలలో నటించమని అడగలేదు. అయితే, 1973లో శ్రీరామకృష్ణా ఫిలిమ్స్ అధినేత ఎం. రామకృష్ణారెడ్డి అభ్యర్ధన మేరకు ఆయన నిర్మించిన 'అభిమానవంతులు' చిత్రంలో డాక్టర్ సి. నారాయణరెడ్డి రచించగా వాణీ జయరాం ఆలపించిన ''ఎప్పటివలె కాదురా నా స్వామీ ఎప్పటివలె కాదురా'' అనే జావళికి నాట్యం చేశారు. అదే శోభా నాయుడు నటించిన తొలి, ఆఖరి సినిమా కూడా. 'ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నాట్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి అంటే శోభా నాయుడు కి అత్యంత అభిమానం, గురుభక్తి కూడా.

- ఆచారం షణ్ముఖాచారి 
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.