బావలు సయ్యా...

వెండితెరపై మెరిసిన అందాల తారలు ఎంతోమంది. వారిలో సిల్క్‌ స్మిత ప్రత్యేకం. స్టార్‌ హీరోల్ని మించిన క్రేజ్‌ ఆమెది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రెండు వందలకిపైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులపై తనదైన ముద్ర వేశారు. ప్రత్యేకమైన ఆమె అందాన్ని చూడటం కోసమే అప్పట్లో ప్రేక్షకులు థియేటర్లకి వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో 1960, డిసెంబరు 2న జన్మించిన సిల్క్‌స్మిత అసలు పేరు విజయలక్ష్మి. నాలుగో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పిన ఆమె సినీ నటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని అత్త ఇంటికి చేరింది. స్మిత అని పేరు మార్చుకొని, తమిళంలో ‘వండి చక్రం’ అనే చిత్రం చేసింది. 1979లో విడుదలైన ఆ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్‌. ఆ చిత్రం పాత్ర ప్రేక్షకాదరణ పొందడంతో స్మిత కాస్త సిల్క్‌ స్మితగా మారిపోయారు. శృంగార తారగా ఎదిగిన ఆమె ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే ప్రత్యేక గీతాల్లో ఎక్కువగా ఆడిపాడారు. అందంతో పాటు, అభినయంతోనూ ఆమె ప్రేక్షకుల మనసుని చూరగొన్నారు. 1981లో విడుదలైన ‘సీతాకోకచిలుక’ చిత్రంలో సిల్క్‌ అభినయం ఆకట్టుకుంది. ‘లయనం’, ‘వసంత కోకిల’ చిత్రాల్లో నటనతో సిల్క్‌స్మిత మంచి పేరు తెచ్చుకొన్నారు. తెలుగులో ‘యమకింకరుడు’, ‘ఖైదీ’, ‘మెరుపుదాడి’, ‘శ్రీదత్త దర్శనం’, ‘పాతాళ భైరవి’, ‘ఖైదీ నంబర్‌ 786’, ‘గీతాంజలి’, ‘ఆదిత్య 369’, ‘కుంతీపుత్రుడు’, ‘అలీబాబా అరడజను దొంగలు’, ‘బావ బావమరిది’, ‘మా ఆవిడ కలెక్టర్‌’, ‘కిష్కిందకాండ’... ఇలా ఆమె ఎన్నో చిత్రాల్లో ఆడిపాడి ప్రేక్షకుల్ని మురిపించారు. ‘బావ బావమరిది’ చిత్రంలో బావలు సయ్యా... అంటూ సిల్క్‌స్మిత చేసిన హంగామా ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ పాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది. అవివాహిత అయిన సిల్మ్‌స్మిత 1996 సెప్టెంబరు 23న మద్రాసులోని తన సొంతింట్లో విగతజీవిగా పడిపోయారు. చిత్రనిర్మాణ ప్రయత్నాల్లో ఉన్న ఆమె నష్టాలపాలవడంతో పాటు, ప్రేమ వ్యవహారాలతో ఆమె ఆత్మహత్య చేసుకుందనే అభిప్రాయాలు వినిపించాయి. సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్‌’ సంచలన విజయం సొంతం చేసుకొంది. ఈరోజు సిల్క్‌స్మిత వర్ధంతి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.