సదా తెర స్మరణీయం...!
సావిత్రి వెండితెరకి దొరికిన అరుదైన అభినేత్రి. చారడేసి కళ్లతో వీక్షకుల హృదయాలపై మంత్రజలం చల్లిన మహానటి. నిండైన విగ్రహం...నటనలో నిగ్రహం. పెదాలపై చిరునవ్వులతో సినీకళామతల్లి సిగలో ఒద్దికగా ఒదిగిన వెన్నెల పువ్వు. ఓ చూపుతో...చిన్ని కదలికతో చెప్పగల భావాల్ని చక్కగా చూపగల నేర్పరి. అందుకే... ఆనాటికి, ఈనాటికి సావిత్రిని మించిన అభినేత్రి లేదని సినీ పండితులు చెప్తుంటారు. అయితే... ఆ మహానటి లేని లోటు మరే నటి పూడ్చలేకపోయినా... ఆ తరువాత ప్రతి తరంలోనూ ఒక్కో నటి సావిత్రిని గుర్తు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఆ కోవలో చెప్పుకోదగ్గ నటి సౌందర్య. సన్నజాజి స్వప్నించినట్లు... గులాబీ అత్తరు జల్లినట్లు... ఏ అదృశ్య చిత్రకారుడో మరో అద్భుత చిత్రాన్ని లిఖించినట్లు... వెండి తెరపై ఆ స్వప్న లోకాల సౌందర్య రాశి తనని తానూ అందంగా ఆవిష్కరించుకుంటే... ఆమె సౌందర్య. అసలు పేరు సౌమ్య. మంత్రనగరిలోకి ఏతెంచిన తరువాత పేరు సౌందర్య. అందం... అభినయం చెట్టాపట్టాలేసుకుంటే... సొగసు...సోయగం కరచాలనం చేసుకుంటే... సౌమ్యం... చిరస్మరణీయ చిరుదరహాసం గాఢంగా కౌగిలించుకుని తెరపై సాక్షాత్కరిస్తే... ఆమె అచ్చం సౌందర్యలా ఉంటుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వెండి తెరకు అలుముకున్న కన్నడ కస్తూరి. కాటుక కళ్లతో మెస్మరైజ్‌ చేసే సౌందర్య లహరి... స్వప్న సుందరి.


* అందమైన డ్రెస్‌ ఆమె అడ్రస్‌
హీరోయిన్స్‌ వస్త్రాల విషయంలో అతి పొదుపును పాటిస్తూ ప్రత్యేక నృత్యతారలు అవసరం లేని విధంగా ఆడిపాడుతూ వెండి తెరపై అందాలను స్వేచ్ఛగా ఆరబోస్తున్న నేపథ్యంలో కూడా తనని తాను ప్రత్యేకంగా ఆవిష్కరించుకున్న తీరు సౌందర్యకు ఆభరణంగా మారింది. రాజీలేని డ్రెస్‌ కోడ్‌ ఆమెని సినీ రాణిని చేసింది. ఎక్సపోజింగ్‌ విషయంలో తన పట్టు సడలించకుండానే... చక్కనైన డ్రెస్‌ కోడ్‌తో అటు ప్రేక్షకులను, ఇటు సినీ వర్గాలనూ అలరించి అందలమెక్కింది. గ్లామర్‌ కన్నా యాక్టింగ్‌ గ్రామర్‌ తెలుసుకుని సినీ చరిత్ర పుస్తకంలో తనకంటూ ఓ పేజీని కేటాయించుకున్న అందాల అభినేత్రి సౌందర్య. హ్యాట్సాఫ్‌తో ది గ్రేట్‌ స్టార్‌.


* శత చిత్ర తారక
సినీ వినీలాకాశంలో ఈ అభినయ తారక ఎప్పుడు ఉదయించిందో... ఎన్నాళ్లు... ఎన్నేళ్లు వెన్నెలల్ని పంచిందో... యావత్‌ వీక్షక లోకం సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగానే వంద చిత్రాలు చేసేసింది. కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషా చిత్రాల్లో కనిపిస్తూ ఎక్కడ చూసినా సౌందర్య మానియాతో యువ హృదయాలు ఉప్పొంగిపోయేలా విజయవంతమైన సినీయానాన్ని కొనసాగించింది. కర్ణాటక కోలార్‌ జిల్లా ముల్‌ బగల్‌లో 1976 జులై 18న జన్మించిన సౌందర్య... చిత్రసీమలో అనతి కాలంలోనే విజయ తారగా చరిత్ర సృష్టించి ... వచ్చిన పని అయిపోయిందన్నట్లు...మరెన్నటికీ తిరిగిరాలేని లోకాలకు తరలిపోవడం ఆ అభినేత్రిని తలచుకున్నప్పుడల్లా అభిమానుల్ని వెంటాడే పెను విషాదం. వందకు పైగా సినిమాలు చేసి... ఇంకా చేయవలసిన చిత్రాలు... పనులు ఎన్నో ఉన్నా... కర్కశ మృత్యు రక్కసి విమాన ప్రమాదంలో ఆమెను పొట్టన పెట్టుకుంది. ఇలాంటి ఓ వేసవిలోనే... మండే ఎండల ఎన్నికల సమయంలో ఏప్రిల్‌ నెల 2004 సంవత్సరం 17వ తేదీన బీజేపీ ప్రచారం కోసం వెళ్లబోతూ... ఎగేరి విమానం కుప్ప కూలిపోవడంతో సౌందర్యను మృత్యువు కబళించింది.


* డాక్టర్‌ కాబోయి యాక్టెస్ర్‌గా మారి...

చాలామంది హీరోయిన్స్‌ తాము డాక్టర్‌ కాబోయి యాక్టర్స్‌గా మారామంటూ రిథమిక్‌గా చెప్తుంటారు. కానీ... సౌందర్య వైద్య విద్య చదువుతూ సినిమా అవకాశాలు వెతుక్కుని రావడంతో... ఆ చదువును అర్ధాంతరంగా ఆపి సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. సౌందర్యకి మొదటి నుంచి పరిచయమే. ఆమె తండ్రి కె.ఎస్‌.సత్యనారాయణ కన్నడ సినిమాలకు రచయితగా, నిర్మాతగా వ్యవహరించేవారు. స్థూడియోలు, సినీ వాతావరణం ఆమెకి కొత్త కాదు. 1992లో సౌందర్య సినీ అరంగేట్రం జరిగింది. మొదటి చిత్రం మాతృభాషలోనే గంధర్వ. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు హంసలేఖ. అదే సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సౌందర్య. కృష్ణ హీరోగా నిర్మితమైన ‘రైతు భారతం’ చిత్రంలో నాయికగా నటించింది. ఆ తరువాత వరుసగా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలతో బిజీ అయింది. 12 సంవత్సరాల కాలంలో 12 సినిమాలు చేసిన ఘనత సౌందర్యకి దక్కుతుంది.

* వెంకీ, సౌందర్య సూపర్‌ జోడి
సినిమాల్లో విజయవంతమైన జోఢీలుగా కొన్నిటిని మాత్రమే ప్రేక్షకలోకం ఆమోదిస్తుంది. నిర్మాత డాక్టర్‌ డి.రామానాయుడు మాటల్లో చెప్పాలంటే... అలాంటి సూపర్‌ జోడీల్లో ఎన్ఠీఆర్, సావిత్రి, ఏఎన్నార్, వాణిశ్రీ, చిరంజీవి, విజయశాంతి, వెంకటేష్, సౌందర్య ఉన్నారు. వెంకటేష్‌ సౌందర్య కాంబినేషన్‌లో అనేక సినిమాలు విజయాన్ని చవి చూసి సంచలన చరిత్ర నమోదు చేశాయి. వాటిలో... ‘రాజా’, ‘జయం మనదేరా’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘పవిత్ర బంధం’, ‘ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు’, ‘దేవి పుత్రుడు’లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలు ఉన్నాయి. అగ్ర హీరోలు అందరి సరసన ఆమె నటించి మెప్పించింది. కృష్ణతో ‘రైతు భారతం’ చిత్రం ద్వారా తెలుగులోకి ప్రవేశించిన సౌందర్య ఆయనతో ‘అమ్మ దొంగ’, ‘జగదేకవీరుడు’ సినిమాల్లో కావాల్సినంత గ్లామర్‌ పరిచింది. ‘నంబర్‌ వన్‌’ చిత్రంలో అల్లరి హీరోయిన్‌గా కృష్ణను ఆటపట్టించింది. కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్‌ సరసన కొన్ని హాస్యభరిత సినిమాల్లో నాయికగా నటించింది. ‘మాయలోడు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘మేడం’ సినిమాలో నట ప్రతిభ కనబరిచింది. మోహన్‌ బాబు పక్కన ‘పెదరాయుడు’ చిత్రం ఆమె కెరీర్‌లోనే మంచి చిత్రంగా ప్రేక్షకులు ఇప్పటికీ ఆరాధిస్తారు. ‘పోస్ట్‌మాస్టర్‌’ చిత్రం కూడా వీరి కాంబినేషన్‌లో మెచ్చు తునక. చిరంజీవికి జతగా ‘చూడాలని ఉంది’, ‘రిక్షావోడు’ చిత్రాల్లో కవ్వించింది. పద్మావతి...పద్మావతి ...నీ ఎర్రని మూతి...చూడగానే పోయింది నా మతి... అయిపోయింది నా మనసు కోతి... అంటూ ఆమె చదివిన కవిత ఇప్పటికీ జనం నాలుకలపై కదలాడుతూనే ఉంది. ‘అన్నయ్య’ చిత్రంలో సౌందర్య అందం చూసి తీరాల్సిందే తప్ప వర్ణించనలవికాదు. ‘శ్రీ మంజునాథ’ చిత్రం కూడా ఆమెకి మంచి పేరు తెచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవితో పాటు అర్జున్‌ కూడా నటించారు. ఇక డాక్టర్‌ రాజశేఖర్‌ పక్కన ‘మా ఆయన బంగారం’, ‘సూర్యుడు’, ‘వేటగాడు’, ‘రవన్న’లాంటి చిత్రాల్లో ఆమె నటించింది. జగపతిబాబుతో కూడా సౌందర్య మంచి చిత్రాల్లోనే నటించింది. ‘దొంగాట’, ‘మూడు ముక్కలాట’, ‘పెళ్లిపీటలు’..లాంటి చిత్రాలెన్నో ఉన్నాయి. నాగార్జునకి జోడిగా సౌందర్య ‘హలో బ్రదర్‌’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘ఆజాద్‌’, ‘రాముడొచ్చాడు’, ‘ఎదురులేని మనిషి’ తదితర చిత్రాల్లో నటించింది. శ్రీకాంత్, జె.డి చక్రవర్తి హీరోలుగా సౌందర్య హీరోయిన్‌గా నటించిన చిత్రాలు కూడా హిట్‌ అయ్యాయి.


* తమిళ సూపర్‌ స్టార్‌ రజినీతో, బిగ్‌ బీతో...
తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కూడా సౌందర్య నటించారు. ‘అరుణాచలం’ చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రేక్షకులకు తెలిసిన విషయమే. అలాగే... బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌తో కూడా సౌందర్య నటించి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ‘సూర్య వంశం’ చిత్రంలో అమితాబ్‌కి జోడిగా ఆమె నటించింది.

* అవార్డులు-పురస్కారాలు
ద్వీప సినిమా నిర్మాతగా సౌందర్య 2003 సంవత్సరంలో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు స్వీకరించారు. 1998లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ‘ధోనీ సాగాలి’ అనే చిత్రంలో నటనకు ఉత్తమ నటి అవార్డు అందుకుంది. 2003లో ‘ద్వీప’ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటి పురస్కారాన్ని కర్ణాటక ప్రభుత్వం నుంచి స్వీకరించింది. ఫిలిం ఫేర్‌ అవార్డులు కూడా సౌందర్యను వరించాయి. 1995లో ‘అమ్మోరు’, 1998లో ‘అంతపురం’ చిత్రాల్లో నటనకు ఉత్తమ నటి అవార్డు అందుకుంది. 1995లో ‘రాజా, 2003లో ‘ద్వీప’ (కన్నడ) చిత్రంలో నటనకు ఉత్తమ కాకుండా, ఉత్తమ నిర్మాతగా కూడా ఫిలిం ఫేర్‌ పురస్కారాన్ని సాధించింది. 2004లో కన్నడ చిత్రం ‘ఆప్త మిత్ర’లో నటనకుగాను ఉత్తమ నటి అవార్డు పొందింది.


* నంది అవార్డులు

సౌందర్య ముచ్చటగా మూడు నంది పురస్కారాలు అందుకుంది. 1994లో ‘అమ్మోరు’, 1996లో ‘పవిత్ర బంధం’, 1995లో ‘అంతపురం’ చిత్రాల్లో నటనకుగాను ఉత్తమ నటిగా నంది పొందింది.


* సౌందర్య తెర స్మరణీయం
ఆమె లేదు... ఆమె నటించిన కదిలే బొమ్మలు ఉన్నాయి. ఆమె మన మనోఫలకాలపై లిఖించిన సుందర దృశ్యాలు సదా చిరస్మరణీయాలు... తెరస్మరణీయాలు. అవెప్పుడూ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటాయి. ఆమె గుండెల్లో వర్షించే సౌందర్య ధార. తెరని వెలిగించే వేవేల వెలుగుల కాంతిధార.                                                                                                                                                                 - పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.