స్టార్‌ స్టార్‌.... ‘రియల్‌ స్టార్‌’
వైవిధ్యభరితమైన పాత్రలకే ‘ఢీ’ అని సవాలు విసరడంలో ఆయన ముందుండేవారు. ఎంతో మంది సినీ ప్రముఖులు ఒకేతరహా పాత్రలను పోషిస్తూ కేవలం ‘స్టార్‌’ అని అనిపించుకుంటే, ఈ నటుడు మాత్రం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హీరోగా వచ్చిన పాత్రలలో జీవించి ఆ పాత్రలకు ప్రాణం పోసి అభిమానుల చేత ఇష్టంగా ‘రియల్‌ స్టార్‌’ అని పిలిపించుకున్నారు. ఎస్‌... అతనే ‘రియల్‌ స్టార్‌’ శ్రీహరి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో శ్రీహరి నిజంగా ప్రశంసించదగ్గ నటుడని చెప్పాలి. ఈ నటుడు పోషించినవన్నీ వైవిధ్యభరితమైనవే. హీరోగానే కాకుండా ఎన్నో వివిధ పాత్రల్లో నటించిన శ్రీహరికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అక్టోబర్ 9న శ్రీహరి వర్ధంతి. ఈ సందర్బంగా ఈ రియల్‌ స్టార్‌ గురించి కొన్ని విషయాలు.


కుటుంబ నేపథ్యం...
శ్రీహరిది ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని కృష్ణా జిల్లా. ఈ దివంగత నటుడి తల్లితండ్రులు గుడివాడకు చెందినవారు. శ్రీహరి చిన్నతనంలో వారు హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యారు. ఈ రియల్‌ స్టార్‌ జిమ్నాస్టిక్స్లో అథ్లెట్‌ కూడా. యుక్తవయసు నుంచే శ్రీహరి శారీరక ధారుడ్యంపై దృష్టిపెట్టేవారు. హైదరాబాద్‌లో ఎన్నో శారీరక ధారుడ్య పోటీల్లో శ్రీహరి పాల్గొనేవారు. ఆయా పోటీల్లో ఏడు సార్లు ‘మిస్టర్‌ హైదరాబాద్‌’ అవార్డును సంపాదించుకున్నారు ఈ వెర్సటైల్‌ యాక్టర్‌.


సినీ ప్రస్థానం
జిమ్నాస్టిక్స్లో శ్రీహరి రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌. అథ్లెట్‌ అవ్వాలనుకునేవారట. అయితే, సినిమాలపై ఆసక్తితో సినిమా రంగంలోనే కెరీర్‌ని మొదలుపెట్టారట. ఇండస్ట్రీకి శ్రీహరి స్టంట్‌ మాస్టర్‌గా అడుగుపెట్టారు. ఆ తరువాత అంచెలంచలుగా ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కథానాయకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోగలిగారు. వంద చిత్రాల్లో నటించారు. అందులో 28 సినిమాలలో హీరోగా నటించారు. ‘పోలీస్‌’ చిత్రం శ్రీహరికి హీరోగా మొదటి చిత్రం. ఈ రియల్‌ స్టార్‌ హీరోగా చేసిన చివరి చిత్రం ‘పోలీస్‌ గేమ్’.

దాసరి చిత్రం ద్వారా సినీ ఎంట్రీ
దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మనాయుడు’ సినిమా శ్రీహరికి నటుడుగా మొదటి తెలుగు సినిమా. ముప్పలనేని శివ దర్శకత్వంలో రామానాయుడు నిర్మాణంలో తెరకెక్కిన ‘తాజ్‌ మహల్‌’ సినిమాలో శ్రీహరి ఓ పూర్తి స్థాయి విలన్‌గా నటించారు. ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. ఒకపక్క హీరోగా పాత్రలు చేస్తూనే మరోపక్క వైవిద్యభరితమైన పాత్రల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా... విలన్, హీరో, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.. ఏ పాత్రైలోనైనా నటించి తానేమిటో నిరూపించుకోగలిగారు శ్రీహరి.


అనేక సినిమాలు, ఎన్నో పాత్రలు
శ్రీహరి అన్న పేరు వినగానే వెంటనే మనకు బోలెడు సినిమాలు గుర్తుకొచ్చేస్తాయి. తన సహజమైన నటనతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు శ్రీహరి. గంభీరమైన పాత్రల్లో భయపెట్టినా, ఫన్నీ పాత్రలతో నవ్వించినా, హీరోగా... ఇలా అనేక పాత్రలతో ప్రేక్షకులను అలరించగలిగిన క్రెడిట్‌ కేవలం శ్రీహరికే దక్కుతుంది. ‘ధర్మ క్షేత్రం’, ‘రౌడీ ఇన్స్పెక్టర్‌’, ‘అల్లరి ప్రేమికుడు’, ‘హలో బ్రదర్‌’, ‘ఘరానా బుల్లోడు’, ‘అల్లుడా మజాకా’, ‘శ్రీ కృష్ణార్జున విజయం’, ‘రాముడొచ్చాడు’, ‘వీడెవడండీ బాబు’, ‘గోకులంలో సీత’, ‘ప్రీమించుకుందాం రా’, ‘బావగారు బాగున్నారా’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ప్రేయసి రావే’, ‘రాజకుమారుడు’ వంటి ఎన్నో సినిమాల్లో శ్రీహరి నటన ప్రేక్షకులు మర్చిపోలేనిది. జక్కన్న రాజమౌళి తెరకెకి ్కంచిన ‘మగధీర’ సినిమాలో శ్రీహరి పోషించిన ‘షేర్‌ ఖాన్‌’ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. ఈ సినిమా వచ్చి పది సంవత్సరాలు పూర్తైనా షేర్‌ ఖాన్‌ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయిందంటే శ్రీహరి నటన ప్రేక్షకులకు ఎంతలా దగ్గరయ్యిందో తెలుసుకోవచ్చు.

ప్రేమ వివాహం - సామాజిక సేవ
ప్రముఖ దక్షిణ భారత నటి డిస్కోశాంతిని శ్రీహరి వివాహమాడారు. వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె అక్షర కేవలం నాలుగు నెలలున్నప్పుడే మరణించింది. దాంతో, శ్రీహరి, డిస్కోశాంతి దంపతులు తన కుమార్తె జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్‌న్ని మొదలుపెట్టారు. గ్రామాలకు ఫ్లోరైడ్‌ లేని నీరు అలాగే పేద విద్యార్థులకు పాఠశాల సామాగ్రిని అందించడం ఈ ఫౌండేషన్‌ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శ్రీహరి మేడ్చల్‌ల్లో నాలుగు గ్రామాలు దత్తత తీసుకొన్నారు.పురస్కారాలు
శ్రీహరి నటనకు ఎన్నో పురస్కారాలు కూడా దక్కాయి. ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుతో పాటు ఎన్నో నంది అవార్డులను దక్కించుకున్న ఘనత శ్రీహరి సొంతం. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా శ్రీహరి ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డును, నంది అవార్డును అందుకున్నారు. ‘తాజ్‌ మహల్‌’ సినిమాకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు, ‘శ్రీరాములయ్య’, ‘పోలీస్‌’, ‘రామసక్కనోడు’, ‘విజయ రామ రాజు’ సినిమాలకు నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డులను గెలుచుకున్నారు శ్రీహరి.


మరణం
తన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన శ్రీహరి అక్టోబర్‌ 9, 2013లో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. శ్రీహరి మరణ వార్త విని సినిమా పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులు తీవ్ర దిగ్బా్రంతికి లోనయ్యారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కోసం ముంబై వెళ్లారు శ్రీహరి. అక్కడ నటిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో, వెంటనే ఆయన్ను ముంబై లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. కాలేయ సంబంధ వ్యాధితో శ్రీహరి కన్నుమూశారు. అలా 49 సంవత్సరాల వయసులోనే ఈ ప్రపంచాన్ని వీడారు.వారసుడి ఎంట్రీ
శ్రీహరి కుమారుడు మేఘాంశ్‌ ‘రాజ్‌ దూత్‌’ సినిమా ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులకు హాయ్‌ చెప్పారు. తనయుడు మేఘాంశ్‌ రూపంలో శ్రీహరిని చూసుకుంటున్నారు ఆయన అభిమానులు. మేఘాంశ్‌ తన తండ్రి శ్రీహరి లాగే ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలు చేసి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.