నవ్వుల నటుడు

మా
మిడిపల్లి వీరభద్రరావు అంటే గుర్తుపట్టేవాళ్లు తక్కువే కావొచ్చు కానీ... సుత్తి వీరభద్రరావు అంటే మాత్రం ఆయన రూపం, రకరకాల పాత్రల్లో ఆయన పంచిన వినోదాలు వెంటనే గుర్తుకొస్తాయి. 1980వ దశకంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సుత్తి. మరో నటుడు సుత్తివేలుతో కలిసి సుత్తి ద్వయంగా పలు చిత్రాల్లో నవ్వించారు. తూర్పు గోదావరి జిల్లా అయినాపురంలో జన్మించిన సుత్తి వీరభద్రరావు విజయవాడలో పెరిగారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఆయన కుటుంబం విజయవాడలో స్థిరపడింది. ఎస్‌.ఆర్‌.ఆర్‌.కళాశాలలో విద్యాభ్యాసం సాగింది. ప్రముఖ దర్శకుడు జంధ్యాల, వీరభద్రరావు సహాధ్యాయిలు. ఆంధ్రా విశ్వవిద్యాలయం స్థాయిలో ఇద్దరూ కలిసి పలు నాటకపోటీల్లో పాల్గొన్నారు. డిగ్రీ తర్వాత ఆల్‌ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించిన సుత్తి ఆ తర్వాత కూడా నాటకాలతో అనుబంధం కొనసాగించారు. 1981లో ‘జాతర’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ‘నాలుగు స్తంభాలాట’తో ఆయనకి మంచి పేరొచ్చింది. సుదీర్ఘమైన సంభాషణల్ని పలుకుతూ అనతికాలంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకొన్నారు. 1982 నుంచి 88 కాలంలోనే 200కి పైగా సినిమాల్లో నటించారు. నరేష్, రాజేంద్రప్రసాద్‌ లాంటి కథానాయకులు చిత్రాల్లో వీరభద్రరావు కీలకపాత్రలు పోషించేవారు. సుత్తి వీరభద్రరావు సినిమాలో ఉంటే విజయం ఖాయమనే ఓ సెంటిమెంట్‌తో పలువురు దర్శకనిర్మాతలు, మా సినిమాలో కనీసం ఓ చిన్న పాత్రలోనైనా కనిపించాలంటూ సుత్తి వీరభద్రరావును సంప్రదించేవారు అప్పట్లో. తన 41వ యేటనే ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆఖరి చిత్రం ‘చూపులు కలిసిన శుభవేళ’. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే సుత్తి వీరభద్రరావు అనారోగ్యానికి గురయ్యారు. ఇందులో సుత్తి పాత్రకి జంధ్యాల డబ్బింగ్‌ చెప్పారు. ఇవాళ వీరభద్రరావు జయంతి (1947).


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.