వేనవేల నవ్వుల గుత్తి... వీరభద్రరావు సుత్తి
వెకిలి మకిలి చేష్టలతో, వొళ్ళంతా విరుచుకుని, తనని తాను హింసించుకుని, వీక్షకులను హింసించి ఏడుపుగొట్టు నవ్వుల్ని రాబట్టుకునేందుకు శతధా ప్రయత్నించే ఎందరి మధ్యనో... అచ్చమైన, స్వచ్ఛమైన హాస్యానికి అసలు సిసలు చిరునామాగా వెలుగొందినవారూ ఉన్నారు. హాస్యమంటే అశ్లీలమని, ద్వందార్థాలేనని, ఎదుటివారిని లోకువ చేసి కించపరచడమేనని, లోపాలు ఎత్తి చూపుతూ ఎద్దేవా చేయడమేనని నమ్మిన హాస్యనటుల మధ్య... హాస్యం అపహాస్యం కారాదని, సున్నితత్వం విడరాదని, ఎవరి మనోభావాలు నొప్పించరాదని... అదే ఆరోగ్యవంతమైన హాస్యమని చాటి చెప్పిన ఎందరో మహానుభావులు సినీ చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందారు. నాటి రేలంగి, రమణారెడ్డిలాంటివారు ఆరోగ్యకర హాస్యాన్ని పెంచి పోషించారు. తాము నవ్వకుండా ప్రేక్షకులను కడుపారా నవ్వించారు. ఆ తర్వాత ఇంకెందరో హాస్య నటులు ఉనికి బలంగా చాటుకున్నా... సుత్తి జంట సృష్టించిన నవ్వుల సునామీ మాత్రం అంటా ఇంతా కాదు. ఎవరైనా నాన్‌ స్టాప్‌గా బోర్‌ కొడుతుంటే....ఒరేయ్‌! సుత్తి ఆపరా! అంటూ అడ్డుకట్ట వేసేయడం ఈ జంటతోనే ఆరంభమైనది. సాధారణంగా ఓ హాస్య నటుడు తన హాస్యంతో నవ్వులు పూయిస్తాడు. కానీ, హాస్య జంట తెలుగు తెరపై ప్రగాఢ ముద్ర వేయడం మాత్రం సుత్తి జంటతోనే సాధ్యమైనది. ఆ జంటలో ఓ సగం సుత్తివేలు అయితే, మరో సగం సుత్తి వీరభద్రరావు. హాస్యబ్రహ్మ జంధ్యాల పుణ్యమాని ఈ జంట ఇంటిపేరు సుత్తిగా మారిపోయింది. సుత్తి వేలు, సుత్తి వీరభద్రరావు అంటేనే.. ఆ ఇద్దరికీ సంపూర్ణత. సుత్తి జంటలోని వీరభద్రరావు ఇంటిపేరు మామిడిపల్లి.


* వ్యక్తిగతం
పశ్చిమ గోదావరి జిల్లా ఆయనపురంలో 1947 జూన్‌ 6న వీరభద్రరావు జన్మించారు. ఆ తల్లి తండ్రులకు వీరభద్రరావు ఒక్కడే కుమారుడు. ఆయనకీ ఇద్దరు చెల్లెల్లు. తండ్రి ఉద్యోగరీత్యా కుటుంబం విజయవాడకు తరలిపోయింది. విజయవాడ ఎకెటిపి స్కూల్లో విద్యని అభ్యసించిన వీరభద్రరావు ఆ తర్వాత ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి నటన పట్ల అభిరుచి గల వీరభద్రరావు వీలు చిక్కినప్పుడల్లా తన ఇష్టాన్ని తీర్చుకునేందుకు ఉత్సాహం చూపించేవారు. స్కూల్, కాలేజ్‌ స్థాయిలోనే రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు. ఆ అభిరుచి విస్తరించి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, వేలిదెండ్ల హనుమంతాచార్య గ్రంధాలయ ప్రాంగణంలో నాటక ప్రదర్శలను వేసేస్థాయిలో ప్రగతి సాధించింది. డిగ్రీలో సహా విద్యార్థి అయిన జంధ్యాలతో కలసి విశ్వవిద్యాలయ స్థాయిలో నాటక పోటీలకు కూడా వీరభద్రరావు సమాయత్తమయ్యారు. డిగ్రీ పూర్తి చేశాక ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉద్యోగిగా వీరభద్రరావు నియమితులయ్యారు. అక్కడ ఆయన లబ్ధ ప్రతిస్థులైన సిఎస్‌ఆర్‌ ఆంజనేయలు, విన్నకోట రామన్న పంతులు, నండూరు సుబ్బారావు, సి, రామ్మోహన రావు, ఉషశ్రీ, విన్నకోట విజయరాం, ఇంద్రకంటి శ్రీకాంత శర్మ, పి. పాండురంగారావు, పేరి కామేశ్వరరావు, కోట సంజీవరావు, ఎ.బి. ఆనంద్‌... తదితరులతో కలసి పనిచేసారు. విజయవాడ ఆకాశవాణిలో వీరభద్రరావు ప్రవేశానికి ప్రత్యక్ష కారకులు బాలాంత్రపు రజనీకాంతారావు. తెలుగు భాషలో ఉన్న 56 అక్షరాలను స్పష్టంగా చెప్పినందుకు ముచ్చటపడి ఆకాశవాణిలో ఉద్యోగిగా ఆయన వీరభద్రరావుని ఎంపిక చేశారు. 1970లో వీరభద్రరావుకి శేఖరితో వివాహమైనది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కూతురు. కూతురు 2013లో కేన్సర్‌తో మరణించింది.


* పుస్తకాలంటే మహా ప్రీతి
వీరభద్రరావుకి పుస్తకాలంటే మహా ప్రీతి. తెలుగు సాహిత్యంలో మహామహులనదగ్గ ఎందరో సాహితీకారుల పుస్తకాలను సేకరించి ఇంట్లోనే సొంత గ్రంథాలయాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు, శ్రీమద్‌ భాగవతం...ఇలా చాలా మంచి పుస్తకాలు ఆయన గ్రంధాలయంలో కొలువున్నాయి.

* జాతరతో సినీ రంగ ప్రవేశం
ధవళ సత్యం దర్శకుడిగా రూపొందిన ‘జాతర’ సినిమా ద్వారా 1981లో వీరభద్రరావు సినీ రంగ ప్రవేశం చేసారు. అయితే, తన దోస్త్‌ జంధ్యాల ద్వారానే తన ఉనికిని బలంగా చాటుకున్నారు. 1982లో ‘నాలుగు స్తంభాలాట’ చిత్రం వీరభద్రరావు సినీ జీవితానికి మేలి మలుపు. ఆ చిత్రంలో ఆయన పండించిన హాస్యం నభూతో నభవిష్యతి అంటారంతా. ఇప్పటికీ మన డ్రాయింగ్‌ రూంలో తిష్ట వేసుక్కూర్చున్న టీవీల్లో ఆ సినిమా ప్రసారమవుతుందంటే వీక్షకులకు నవ్వుల పండగే. ఏ మాత్రం అశ్లీలం ధ్వనించని హాస్యం జంధ్యాల మార్కు హాస్యం. కుటుంబసమేతంగా ఆయన హాస్యాన్ని ప్రతిఒక్కరూ ఆస్వాదించవచ్చు. ఆ హాస్యానికి అసలైన సొగసులద్దుతూ వీరభద్రరావు లాంటి నటులు మరోస్థాయికి తీసుకెళ్లారు. 1982 నుంచి 1988 మధ్య కాలంలో వీరభద్రరావు 200 సినిమాల్లో నటించారంటే... ఎంత బిజీ ఆర్టిస్ట్‌గా వెలుగొందారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. సుదీర్ఘ సంభాషణలను అనర్గళంగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. నరేష్, రాజేంద్రప్రసాద్‌ లాంటి కామెడీ హీరోల సరసన వీరభద్రరావు కూడా చాలా సినిమాల్లో పూర్తి నిడివిగల పాత్రల్ని పోషించారంటే...ఆయన సత్తా ఏమిటో ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు.

* అవిశ్రాంత నటుడికి శాశ్వత నిద్ర
సినీ రంగంలో ప్రవేశించినప్పటినుంచి ఏ మాత్రం విశ్రాంతి ఎరుగకుండా పనిచేసిన హాస్య విదూషకుడు 1988 జూన్‌ 30న తిరిగిరాలేని దూర తీరాలకు తరలిపోయారు. ఇన్నాళ్లూ పంచిన నవ్వుల్ని తన గుర్తుగా ఇక్కడే వదిలేసి ఆయన శాశ్వత నిద్రలోకి జారిపోయారు. కేవలం 41 సంవత్సరాల వయసులోనే ఆయన కన్ను పూశారు. తెరపై ఆయన ఇంకా పండించాల్సిన నవ్వులు ఎన్నో మిగిలి ఉండగానే... ఆదరాబాదరాగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం హాస్య ప్రియులందరికీ మింగుడు పడని చెడువార్తే.


* వీరభద్రరావు చిత్రాలు
సుమారు 200 చిత్రాలకు పైగా వీరభద్రరావు నటించినా... కొన్ని మెచ్చుతునకలనదగ్గ సినిమాలను ప్రస్తావించుకుంటే.. ఎక్కువగా జంధ్యాల చిత్రాలే ముందు వరుసలో ఉంటాయి. ‘నాలుగు స్తంభాలాట’, ‘మూడు ముళ్ళు’, ‘పుత్తడి బొమ్మ’, ‘బాబాయ్‌ అబ్బాయ్‌’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘ఆనంద బైరవి’, ‘రెండు రెళ్ళు ఆరు’, ‘మొగుడు పెళ్ళాలు’, ‘చంటబ్బాయ్‌’, ‘అహ... నా పెళ్ళంట’, ‘చిన్ని కృష్ణుడు’, ‘నీకూ నాకూ పెళ్ళంట’, ‘వివాహ భోజనంబు’, ‘చూపులు కలసిన శుభవేళ’... ఇలా జంధ్యాల సృష్టించిన హాస్య పాత్రలకు ప్రాణం పెట్టిన సహజ నటుడు వీరభద్రరావు. ధవళ సత్యం ‘జాతర’తో పరిచయమైన వీరభద్రరావు ఆయన దర్శకత్వంలోనే మరో సినిమా ‘ఎర్ర మల్లెలు’లో ఓ పాత్ర పోషించారు. ‘బ్రహ్మా... నీ తల రాత తారుమారు’, ‘పల్లెటూరి మొనగాడు’, ‘ముగ్గురమ్మాయిల మొగుడు’, ‘కొంటె కోడళ్ళు’, ‘రుస్తుం’, ‘సుందరి సుబ్బారావు’, ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’, ‘స్వాతి ముత్యం’, ‘చట్టంతో పోరాటం’, ‘శ్రీ షిరిడీ సాయిబాబా మహాత్మ్యం’, ‘పదహారేళ్ళ అమ్మాయి’, ‘జీవన పోరాటం’, ‘డబ్బెవరికి చేదు’, ‘పెళ్లి చేసి చూడు’, ‘సాహసం సేయరా డింభకా’, ‘చిక్కడు దొరకడు’, ‘ఓ తండ్రి తీర్పు’... ఇలా ఎన్నో చిత్రాల్లో వీరభద్రరావు తన పాత్రలకు ప్రాణం పోశారు. చిత్రసీమలో ఎంత బిజీగా ఉన్నా ఎక్కడో అభద్రతా భావం. అందువల్లే, ఆయన కుటుంబాన్ని విజయవాడ నుంచి కదిలించకుండా...తానే చెన్నయ్‌ వెళ్లి హోటల్‌ రూమ్‌లలో ఉండి షూటింగ్‌ పూర్తి చేసుకునేవారు.

* వీరభద్రరావు హాస్య గుళికలు
ఏనుగు మీద ఓ పాట రాసాను. కదన కుతూహల రాగం, రూపక తాళం...మూడున్నర. ఏనుగూ ...ఏనుగూ! ఏనుగు కళ్ళూ చింతాకు... ఏనుగు తొండం చాంతాడు... ఏనుగు చెవులు చేటలూ... ఏనుగు పెద్దది టోటలూ!

* చివరి చిత్రం ‘చూపులు కలసిన శుభవేళ’
వీరభద్రరావు చిట్ట చివరి చిత్రం ‘చూపులు కలసిన శుభవేళ’. షూటింగ్‌ పూర్తి చేసుకుని డబ్బింగ్‌ జరుపుకోవాల్సి ఉండగా వీరభద్రరావు హఠాత్‌ మరణం సంభవించింది. దాంతో... ఆ సినిమాలో దర్శకుడు జంధ్యాల వీరభద్రరావు పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు.


* పుత్తడి బొమ్మ
ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేయమన్నారు. దాంతో, ఏ జబ్బూ నీ జోలికి రాదు కాక రాదు. అసలు సూర్య నమస్కారాల యొక్క ప్రాధాన్యత తెలుసా నీకు? (ఇక అప్పటినుంచి సుత్తి మీద దెబ్బలు పడుతుంటాయి. అదీ దర్శకత్వ ప్రతిభ. ఇదే చిత్రంలో సుత్తి పుట్టుపూర్వోత్తరాలు గురించి సుత్తివేలు ద్వారా ప్రేక్షకులకు తెలియచేస్తారు దర్శకులు. ఈ సినిమాతోనే...వీరభద్రరావు, వేలు సుత్తి జంటగా ప్రసిద్ధులయ్యారు.)

* నాలుగు స్తంభాలాట
మధ్య తరగతి నాయాలా! సినిమా పేరు చెప్పా. పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవుతుందయ్యా! తెర లేవంగానే హీరో ఓ కాఫీ హోటల్‌కి వెడతాడు. సర్వర్‌ రాగానే హీరో ఏమున్నాయి అనడిగాడు. అప్పడు సర్వర్‌ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారే, మసాలా గారే, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మసాలా అట్టు, బాతూ, టమేటా బాతూ, బోండా, బజ్జీ, మైసూర్‌ బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డూ, బండారు లడ్డూ, రవ్వ లడ్డూ, మిఠాయి, పీచు మిఠాయి, బండారు మిఠాయి, బొంబాయి మిఠాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా, హల్వా, మైసూరు పాకూ, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు... ఇక ఆయనేం చెప్పినా ఇలాంటి జాబితా కొనసాగుతూ ఉంటుంది, సినిమా అంతా.


* వివాహభోజనంబు
అరక్షణంలో మంచం దిగగపోతే నీకు అష్టోత్తర పూజ చేస్తా అడ్డగాడిదా! ఏవిటా కంగారు? గుడిమెట్ల మీద ఎండు చేపలు అమ్ముకునేవాడిలా ముఖం నువ్వూనూ! శుబ్బరంగా తెల్లవారుజామునే లేచి చదువుకుందామని లేదు. తెల్లగా తెల్లారేదాకా కూడా మంచం మీద నిగడదన్ని పడుకుని పగటి కలలు కంటావా? కిసయోతికా? అంటే...తెలీదు. మాట బాగుందని వాడాను.
* మొగుడు పెళ్ళాలు
ఇలా...చెప్పుకుంటూ పోతే జంధ్యాల విసిరిన హాస్య గుళికలను తెలుగు నేలంతా పరిచేసి నవ్వుల సేద్యం చేసిన కళాకారుడు వీరభద్రరావు. కేవలం... హాస్యామి కాకుండా కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా ఆయన ప్రదర్శించిన నటన కొన్ని సినిమాల్లో కంట తడి పెట్టిస్తుంది.


- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.