దర్శకులకే మార్గదర్శి... రాఘవ
మూకీ నుంచి డిజిటల్‌ వరకు భారతీయ సినిమా గమనంలో భాగమైన ప్రముఖ నిర్మాత కోటిపల్లి రాఘవ (105) ఇక లేరు. మూకీ సినిమాల కాలంలో... చిత్రీకరణలకి ఉపయోగించే ట్రాలీని తోసే కార్మికుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన అంచలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యారు. ప్రతాప్‌ ఆర్ట్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించి అత్యుత్తమ చిత్రాల్ని రూపొందించారు. శతాధిక చిత్ర దర్శకులు దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణలని తన సంస్థ నుంచే పరిచయం చేశారు కె.రాఘవ. వందేళ్ల పైబడిన భారతీయ సినిమా రంగంతో, తొంభయ్యేళ్లకి పైగా ప్రయాణం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న  కె.రాఘవ సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో మృతిచెందారు. 1913 డిసెంబరు 9న కాకినాడ దగ్గర  కోటిపల్లిలో జన్మించిన కె.రాఘవకి ప్రశాంతి, ప్రతాప్‌ మోహన్‌ సంతానం. భార్య హంసారాణి కొంతకాలం కిందటే మరణించారు.

ఇంట్లో నుంచి పారిపోయి... 
ఎనిమిదేళ్ల వయసులోనే ఇంట్లో నుంచి పారిపోయి కనిపించిన రైలెక్కి   కలకత్తా చేరుకొన్నారు రాఘవ. ఊరు, భాష తెలియక తిరిగిన ఆయన   ఈస్టిండియా ఫిలిం కంపెనీ గేటు దగ్గర ఆకలితో కూలబడ్డారు. సరిగ్గా అదే రోజున ట్రాలీ తోసే ఇద్దరు కుర్రాళ్లలో ఒకరు రాకపోవడంతో  యూనిట్‌లోని ఒకరు స్టూడియో బయటికొచ్చి గేటు ముందున్న రాఘవని చూసి ‘స్టూడియోలో పనిచేస్తావా?’ అని అడగడం, అందుకు ఆయన సరే అనడంతో ఆయనకి ఆ రోజు నుంచి పని దొరికింది. అలా ‘ప్రహ్లాద’ చిత్రంతో ట్రాలీపుల్లర్‌గా సినిమా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మూడేళ్లు గడిచాక, సినిమా పంపిణీదారుల్లో ఒకరైన మోతీలాల్‌ చమ్రియా దగ్గర సహాయకుడిగా చేరారు. ఆ తర్వాత బెజవాడ చేరుకొని మారుతీ టాకీసు అధినేత పోతిన శ్రీనివాసరావు సహాయంతో కస్తూరి శివరావు దగ్గర సహాయకుడిగా చేరారు. మూకీ సినిమా తెరపై ప్రదర్శితమవుతుంటే, వ్యాఖ్యానం చేయడానికి ఒక వ్యక్తి ఉండేవారు. అలా వ్యాఖ్యాతగా కస్తూరి శివరావుకి ఎంతో పేరుండేది అప్పట్లో. అవసరమైనప్పుడు రాఘవ కూడా గొంతు కలిపేవారట. అప్పట్లో శివరావు వ్యాఖ్యాత అంటే సినిమా చూడటం కూడా మానేసి, ప్రేక్షకులు ఆయన్నే చూసేవారని రాఘవ చెబుతుండేవారు. మూకీ చిత్రాలు కనుమరుగవుతూ, టాకీల హవా పెరుగుతుండటంతో కస్తూరి శివరావు కూడా నటుడిగా అవకాశాల కోసం మద్రాసు పయనమయ్యారు. దాంతో కె.రాఘవ కూడా బతుకు తెరువు కోసం మద్రాసు వెళ్లిపోవల్సి వచ్చింది. దర్శకుడు సి.పుల్లయ్య సహకారంతో శోభనాచల స్టూడియోలో ప్రొడక్షన్‌ విభాగంలో పనికి      కుదిరారు. ఆ తర్వాత నటుడిగా వేషాల కోసం  ప్రయత్నించి ‘బాలనాగమ్మ’ చిత్రంలో ఓ పాత్రలో నటించే అవకాశం అందుకొన్నారు. ఏ పని దొరికితే అది చేసే అలవాటున్న కె.రాఘవ ‘చంద్రలేఖ’ చిత్రంలో కథానాయకుడు రంజన్‌కి డూప్‌గా కొన్ని పోరాట సన్నివేశాల్లో నటించారు. కొన్ని చిత్రాల్లో ఫైటర్లలో ఒకరిగా నటించారు. ‘పాతళ భైరవి’, ‘రాజు పేద’ చిత్రాలకి స్టంట్‌ మాస్టర్‌గా కూడా పనిచేశారు. కొన్నాళ్లు రఘుపతి వెంకయ్యనాయుడు కార్యాలయంలో బాయ్‌గా పనిచేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు కారు తుడిచానని చెప్పేవారు కె.రాఘవ. తాను శోభనాచల స్టూడియోలో పనిచేస్తున్నప్పుడే ‘మనదేశం’ నిర్మాణం జరిగిందనీ, ఆ చిత్రంలోని కానిస్టేబుల్‌ పాత్ర కోసం వచ్చిన ఎన్టీఆర్‌ని సెంట్రల్‌ నుంచి తానే బస్సులో తీసుకొచ్చానని, ఆయనకి అద్దె గది చూపించానని గుర్తు చేసుకొనేవారు రాఘవ.

ఆంగ్ల చిత్రంతో మలుపు 
కలకత్తా మొదలుకొని.. పలు ప్రాంతాల్లోనూ, చరిత్ర పరిశ్రమకి చెందిన పలు విభాగాల్లో పనిచేయడం కె.రాఘవకి కలిసొచ్చింది. అప్పట్లో  ఎం.జి.ఎం.స్టూడియో సంస్థ ‘టార్జాన్‌ గోస్‌ ఇండియా’ తీస్తున్నప్పుడు భాషలు తెలిసిన ఓ ప్రొడక్షన్‌ మేనేజర్‌ కావాలని అడగటంతో కె.రాఘవ పేరు సూచించారట. పదిహేను భాషలు ఒంటబట్టించుకొన్న ఆయన ఆ చిత్రానికి పనిచేయడంతో 20 వేల డాలర్ల పారితోషికం లభించింది. ఆ చిత్రం నా జీవితాన్నే మలుపుతిప్పిందని చెప్పేవారు రాఘవ. ఆ చిత్రం కోసం రోమ్‌కి వెళ్లడం, అక్కడ ఉన్న సమయంలోనే ‘షుగర్‌ కోల్ట్‌’, ‘డెత్‌ రైడ్స్‌ హార్స్‌’ వంటి చిత్రాలు నచ్చి వాటి ప్రేరణతో తెలుగు సినిమాలు తీయాలనుకొన్నారు. అప్పటికే 20 వేల డాలర్ల మొత్తం తన దగ్గర ఉండటంతో మరో భాగస్వామిని కలుపుకొని నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకొన్నారు. ఆ క్రమంలో ఏకాంబరేశ్వరరావు, సూర్యచంద్ర అనే ఇద్దరు నిర్మాతల్ని కలుపుకొని ఫల్గుణ ఫిలిమ్స్‌ పతాకంపై ‘జగత్‌ కిలాడీలు’, ‘జగత్‌ జెట్టీలు’ తీశారు. ఆ రెండూ విజయవంతమయ్యాయి. ఆ తర్వాత చేసిన ‘జగత్‌ జెంత్రీలు’ పరాజయాన్ని చవిచూసింది. ఈ మూడు చిత్రాలతో పాటు, రాఘవ నిర్మించిన ‘సుఖ  దుఃఖాలు’లో చిరంజీవి తండ్రి వెంకటరావు నటించారు. ‘జగత్‌ జెట్టీలు’ చిత్రానికి దాసరి నారాయణరావుతో మాటలు రాయించారు. ఆ తర్వాత ప్రతాప్‌ ఆర్ట్స్‌ సంస్థని సొంతంగా నెలకొల్పి దాసరి నారాయణరావుని  దర్శకుడిగా పరిచయంచేస్తూ ‘తాత మనవడు’ చిత్రం తీశారు. ఎస్వీ రంగారావు, రాజబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో కోడి రామ కృష్ణని పరిచయం చేశారు. ఆయనతో పాటు, రచయిత రాజశ్రీ, గుహ   నాథన్‌, కె.ఆదిత్య, కొమ్మినేని కృష్ణమూర్తి, బందెల ఈశ్వరరావు తదితర దర్శకుల్ని పరిచయం చేశారు కె.రాఘవ. సుమన్‌, గొల్లపూడి మారుతిరావు, బాబుమోహన్‌, మాధవి, శ్యామల తదితర నటులు కూడా ఈయన చిత్రాలతోనే పరిచయమయ్యారు. ‘సంసారం సాగరం’,  ‘తూర్పు పడమర’, ‘తరంగిణి’, ‘సూర్యచంద్రులు’, ‘చదువు సంస్కారం’, ‘అంతులేని వింత కథ’, ‘త్రివేణి సంగమం’, ‘ఈ ప్రశ్నకు బదులేది’, ‘యుగకర్తలు’, ‘అంకితం’ తదితర తెలుగు చిత్రాల్ని, హిందీలో ‘ఇత్నీసీ బాత్‌’, తమిళంలో ‘మైనర్‌ మా పిళ్లై’ చిత్రాల్ని నిర్మించారు. రఘుపతి వెంకయ్యనాయుడు దగ్గర సహాయకుడిగా పనిచేసిన కె.రాఘవ, ఆయన పేరుతో ఏర్పాటైన పురస్కారాన్ని కూడా 2009లో అందుకొన్నారు. తెలుగు సినీ నిర్మాతల మండలి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఆయన, 1975 నుంచి 82 వరకు కోశాధికారిగా పనిచేశారు. వందేళ్లు పైబడినా ఆయన ఎంతో చలాకీగా  కనిపించేవారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామమే నా ఆరోగ్య రహస్యం అని చెప్పేవారు. హైదరాబాద్‌లో ప్రతాప్‌ డబ్బింగ్‌ థియేటర్‌ని నెలకొల్పి, తన తనయుడితో కలిసి నిర్వహిస్తూ వచ్చిన ఆయన, చాలా కాలం సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చారు.  పాతికకి పైగా సినిమాలు తీసినా అందులో విజయవంతమైనవి కొన్నే అని చెప్పుకోవడానికి సిగ్గుపడననేవారు. కె.రాఘవ మృతిపట్ల తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి  10.30 వరకు హైదరాబాద్‌లోని చలన చిత్ర వాణిజ్య మండలి ఆవరణంలో కె.రాఘవ పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

బతికి లాభం లేదనుకొని...
‘‘ఎనిమిదేళ్ల వయసులోనే ఇంట్లో నుంచి పారిపోయిన నాకు మా ఇంటి పేరు కూడా తెలియదు. మా అమ్మా నాన్న అన్నదమ్ములూ ఎక్కడున్నారో కూడా తెలియలేద’’ని చెప్పేవారు కె.రాఘవ. నా జీవితంలో ఎన్నికష్టాలు పడినా ఎక్కువగా బాధపెట్టే విషయం అదే అనేవారు. తన జీవితంలో సినిమాని మించిన మలుపులు ఉన్నాయని చెప్పేవారు. విజయవాడ నుంచి మద్రాసు వెళ్లాక ప్రగతి స్టూడియోలో ‘భక్త కబీరు’ అనే కన్నడ చిత్రం జరుగుతుంటే వేషాల కోసం వెళ్లిన కె.రాఘవ అందులో ఎంపికయ్యారు. వారం రోజుల నుంచీ తిండి లేకపోయినా ఆ బాధని దిగమింగుకొని, అందులో నటించారు. చిత్రీకరణ తర్వాత చిత్రబృందం పెట్టిన అన్నం కడుపులో పడగానే కళ్లు తిరిగి పడిపోయారు. మర్నాడు ఉదయానికిగానీ ఆయనకి మెలకువ రాలేదు. పొద్దున్నే లేచి నీరసంతో తూలుకుంటూ బయటికొచ్చి చూస్తే, ఆ సినిమా బృందం జాడే కనిపించలేదు. పైగా స్టూడియో సిబ్బంది ఆయనపై దాడికి ప్రయత్నించారు. దాంతో ఇక బతికి లాభం లేదనుకొని, ఆ స్టూడియోలోనే ఉన్న పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్నా, ఆ బావి గోడ కన్నంలో ఉన్న పాము కాటువేసింది. దాంతో స్పృహ తప్పి  పడిపోవడంతో ఆత్మహత్యాయత్నం కేసు కింద పోలీసులు అరెస్టు చేశారు. జైల్లో వేళకింత తిండయినా దొరుకుతుందిలే అనుకొన్నా, ఆ వెంటనే ఆయన్ని పోలీసులు వదిలేశారట. ఆ చేదు అనుభవం తర్వాత ఆశ చావక మళ్లీ స్టూడియోల చుట్టూ తిరిగానని చెప్పేవారు కె.రాఘవ. 1948లో బొంబాయి వెళ్లి అక్కడ మెహబూబ్‌ ఖాన్‌    స్టూడియోలో చేరి అన్ని రకాల పనులూ చేశారు. జీవితం ఎటు తీసుకెళితే అటు వెళ్లానని గుర్తు చేసుకొనేవారు కె.రాఘవ. తమిళ చిత్రం ‘భలే పాండ్య’, హిందీ చిత్రం ‘దిల్‌ తేరా దీవానా’ వంటి చిత్రాలకి నిర్మాణ బాధ్యతల్ని పర్యవేక్షించిన ఆయన, ‘లవకుశ’కి పంపిణీదారుల నుంచి డబ్బు వసూలు చేసే బాధ్యతని నిర్వర్తించారు. ఈ దశలోనే పాండిచ్చేరికి చెందిన నిర్మాత ఎం.కె.రాధ చెల్లెలు హంసారాణితో     కె.రాఘవకి పెళ్లి జరిగింది. తన కొడుకు ప్రతాప్‌ పేరుతోనే నిర్మాణ సంస్థని ఆరంభించారు. కుటుంబ నియంత్రణ సందేశంతో ‘సంసార సాగరం’ తీసిన ఆయన, తానే ఎక్కువమందిని కని తప్పు చేయకూడదని భావించి అమ్మాయి ప్రశాంతిని పెంచుకొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.