మాస్‌ దర్శకుడు!

వెండితెరపై సుమోలు ఎగిరించి... కథానాయకులతో తొడలు కొట్టించి... మాస్‌ ప్రేక్షకుల్ని మురిపించిన దర్శకుడు వి.వి.వినాయక్‌. మాస్‌ సినిమా అన్న మాటకి అసలు సిసలు అర్థం వినాయక్‌ చిత్రాల్ని చూస్తే తెలుస్తుంది. వి.వి.వినాయక్‌ సినిమా అంటే చాలు... సుమోలతో విన్యాసాల్ని తప్పని సరిగా ఆశిస్తారు ప్రేక్షకులు. ‘ఆది’తో మెగాఫోన్‌ చేతపట్టిన వి.వి.వినాయక్‌ తన చిత్రాలతో సరికొత్త రికార్డుల్ని లిఖించారు. ‘చెన్నకేశవ రెడ్డి’, ‘దిల్‌’, ‘ఠాగూర్‌’... ఇలా వరుసగా ఆయనకి విజయాలే. ‘సాంబ’ పర్వాలేదనిపించినా.. ‘బన్నీ’, ‘లక్ష్మీ’తో మళ్లీ బాక్సాఫీసుని షేక్‌ చేశాడు. ‘కృష్ణ’, ‘అదుర్స్‌’ చిత్రాలో వినాయక్‌లోని మరో కోణం బయటికొచ్చింది. హాస్యానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కించిన ఆ చిత్రాలతో వి.వి.వినాయక్‌ ఘన విజయాల్ని సొంతం చేసుకొన్నారు. ‘బద్రినాథ్‌’తో ఓ భారీ ప్రయత్నం చేసిన ఆయన ‘నాయక్‌’, ‘అల్లుడు శీను’ చిత్రాలతో తన మార్క్‌ని ప్రదర్శించారు. ‘ఖైదీ నంబర్‌ 150’తో మళ్లీ సత్తా చాటారు. అఖిల్‌ అక్కినేనిని కథానాయకుడిగా పరిచయం చేసింది వినాయకే. వినాయక్‌ అసలు పేరు గండ్రోతు వీర వెంకట వినాయక్‌. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు ఆయన సొంతూరు. వి.వి.వినాయక్‌ తీసిన పలు చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్‌ అయ్యాయి. కొన్ని అనువాదాలుగా విడుదలై ఘన విజయాల్ని సొంతం చేసుకొన్నాయి. తొలి చిత్రంతోనే ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు. కమర్షియల్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న వి.వి.వినాయక్‌ ఎప్పుడు సినిమా చేసినా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి. 
ప్రస్తుతం ఎన్‌.నరసింహ దర్శకత్వంలో ‘సీనయ్య’ చిత్రంలో వినాయక్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. వినాయక్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్ర బృందం.  ఈ రోజు వినాయక్‌ పుట్టిన రోజు.

                                   Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.