బాధ్యతగల నిర్మాత ఆయన!

సినిమాల్లో నిర్మాత పనేంటి? ఇప్పుడు ఈ పశ్నకు సులభంగానే సమాధానం దొరికేస్తుంది. ఎందుకంటే ‘డబ్బులు ఇవ్వడం’ తప్ప నిర్మాతకు పెద్ద పనేం ఉండదనేది చాలామంది అభిప్రాయం. నిర్మాత క్యాషియర్‌ అనే ముద్రపడిపోయింది. ఇప్పుడనేంటి? ఓ ఇరవై ఐదేళ్ల క్రింద కూడా ఇలాంటి అభిప్రాయాలే ఉండేవి. ఇప్పుడంటే కథానాయకులు రాజ్యమేలుతున్నారు. అప్పట్లో దర్శకులదే హవా. రెండు హిట్లు చేతిలో ఉన్న దర్శకుల దగ్గర నిర్మాతలు నోరు మెదపలేకపోయేవారు. ఇక దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులాంటి ఉద్దండులుంటే వాళ్ల ముందు ఏం చెప్పగలరు? కానీ కొంతమంది నిర్మాతలు క్యాషియర్‌గా ఉండిపోవడానికి ఎప్పుడూ ఇష్టపడరు. ‘దర్శకుడు కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అయితే నిర్మాత ఓనర్‌ ఆఫ్‌ ది షిప్‌’ అని గర్వంగా నిలబడే నిర్మాతలు అప్పుడప్పుడూ వస్తూనే ఉంటారు. వడ్డే రమేష్‌ కూడా అలాంటి నిర్మాతే! నేడు ఆయన వర్థంతి.సి
నిమా అంటే ఆయనకు ఫ్యాషన్‌ కాదు.. ప్రాణం. డబ్బు సంచి చేతిలో ఉంచుకొని నిర్మాత అయిపోలేదాయన. సినిమా అంటే ఏమిటి? 24 విభాగాలు ఎలా పనిచేస్తాయి? సినిమా నిర్మాణంలో లోటుపాట్లేంటి? వృథా ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయి? ఇలాంటివన్నీ విస్తృతంగా పరిశీలించే రంగంలోకి దిగారు. వడ్డే రమేష్‌ తండ్రి వెంకటేశ్వరరావు సినిమాలకి ఫైనాన్స్‌ చేసేవారు. అలా..సినిమా జ్ఞానం కొంత తండ్రి నుంచి అబ్బింది రమేష్‌కు. నాన్న ఫైనాన్స్‌ చేసిన ‘సతీ అరుంధతి’లాంటి సినిమాలకు వడ్డే రమేష్‌ నిర్మాణ వ్యవహారాలను దగ్గరుండి చూసుకునేవారు. నిర్మాతగా అది ఆయనకు రిహార్సల్స్‌గా ఉపయోగపడింది. ఎ.ఎస్‌.ఆర్‌ ఆంజనేయులు రమేష్‌కు బంధువే. ఆయనతో కలిసి ‘పండంటి కాపురం’ సినిమాని హిందీలో తెరకెక్కించారు. ‘సున్హారా సంసార్‌’ పేరుతో. ఈ సినిమాతోనే నిర్మాతగా రమేష్‌ ప్రయాణం మొదలైంది. ‘సున్హారా..’ ఓ మాదిరి విజయాన్ని నమోదు చేసుకొంది. అయితే రమేష్‌కి చాలా విషయాలే తెలిశాయి. ఏం చేయాలో, ఏం చేయకూడదో అర్థమైంది. తన తరువాతి సినిమాలకు మరింత పకడ్బందీ ప్రణాళికలు వేసుకొన్నారు. వడ్డే రమేష్‌కు దాసరి నారాయణరావుతో మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరి కాంబినేషనలో ఎనిమిది సినిమాలొచ్చాయి. దాసరి, రమేష్‌ని ‘అబ్బాయి..’ అని పిలిచేవారు. ‘పాడవోయి భారతీయుడా’ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా. దక్షిణాదినే కాకుండా..యావత్‌ భారతదేశాన్నే ఓ ఊపు ఊపేసిన శ్రీదేవి ఈ సినిమాతోనే పూర్తిస్థాయి కథానాయికగా తెరముందుకు వచ్చింది. ‘‘రమేష్‌తో నా అనుబంధం ప్రత్యేకమైనది. నా కుటుంబ సభ్యుడిలాంటివాడు. మేం ఎంత సన్నిహితంగా ఉన్నా.. సెట్లో మాత్రం ఆయనో నిర్మాత, నేనో దర్శకుడు. తనకేం కావాలో నిక్కచ్చిగా చెప్పేవాడు. ఫలానా సన్నివేశం బాగోలేదు.. అనుకొంటే అదే విషయం మొహమాటం లేకుండా చెప్పేవాడు. నిర్మాతకు ఆ హక్కు ఉంది. మేమిద్దరం సినిమా గురించి చాలాసార్లు పోట్లాడుకున్నాం. కానీ అది మంచి సినిమా రావడానికే’’ అని దాసరి నారాయణరావు చెబుతుండేవారు. అదే దాసరితో తీసిన ‘బొబ్బిలి పులి’ నిర్మాతగా తనకు తిరుగులేని విజయాన్ని అందివ్వడమే కాకుండా.. తెలుగు చలనచిత్రసీమలో ఓ మరపురాని చిత్రంగా మిగిలిపోయింది.

                                   దాసరి తన వందో చిత్రం ‘లంకేశ్వరుడు’ సినిమా తెరకెక్కించే బాధ్యత కూడా రమేష్‌కే ఇచ్చారు. నిజానికి ఆ సినిమా కోసం కాల్షీట్లు దాసరి దగ్గరే ఉన్నాయి. కానీ ఆ కాల్షీట్లు రమేష్‌కి ఇచ్చారు. ‘కటకటాల రుద్రయ్య’, ‘రంగూన్‌ రౌడీ’ సినిమాలు కూడా మర్చిపోలేనివే. నాగేశ్వరరావు, కృష్ణంరాజు, చిరంజీవి, రాజశేఖర్‌ ఇలా ప్రముఖ కథానాయకులతో సినిమాలు చేశారు రమేష్‌. తనయుడు వడ్డే నవీన్‌ని కథానాయకుడిగా నిలబెట్టడానికి తనవంతు ప్రయత్నాలు చేశారు. ‘‘డబ్బులు సంపాదించడానికి నేను ఈ రంగంలోకి రాలేదు. నాకు కావాల్సినంత సంపద ఉంది. కేవలం సినిమాపై ప్రేమతో ఇక్కడి వచ్చా. డబ్బు సంపాదించడానికి ఇక్కడ కూడా అడ్డదారులు తొక్కితే..ఇక అర్థమేముంది??’’ అంటుండేవారు రమేష్‌. ‘‘నిబద్ధత గల నిర్మాత రమేష్‌. ఆయన సంస్థలో నేను ఎనిమది సినిమాలు చేశాను. నిర్మాతే అయినా అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకొనేవారు. స్క్రిప్టు విషయంలో ఆయన రాజీపడేవారు కాదు. ఆయన సలహాలు సినిమాకి ఎంతో ఉపయోగపడేవి. ఓ సినిమా పూర్తయ్యే వరకూ దాని గురించే ఆలోచించేవారు’’ అని కృష్ణంరాజు ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకొన్నారు. దాదాపు పాతిక సినిమాలు తెరకెక్కించారు రమేష్‌. నిర్మాత ఎలా ఉండాలో.. చూపించారు. ‘బొబ్బిలి పులి’, ‘కటకటాల రుద్రయ్య’లాంటి విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులకు అందించారు.

                                                            Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.