నవ్వుల వేణువు మూగబోయింది
నువ్వెప్పుడు పుట్టావ్‌..?
* 1857 నుంచి స్ట్రగుల్‌ చేస్తే 1947లో పుట్టా సార్‌. సీటిచ్చేత్తారా?

మీ నాన్న పేరేంటి బాబూ..?
* అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్‌.. సీటిచ్చేత్తారా?

అసలు ఈ కాలేజీలో చేరి ఏం చేద్దామనుకుంటున్నావ్‌?
* సిగరెట్లు తాగడం, మందుకొట్టడం, అమ్మాయిలతో తిరగడం.. సీటిచ్చేత్తారా సార్‌?

‘దిల్‌’ సినిమాలో కాలేజీ సీటు కోసం వెళ్తే ఎమ్మెస్‌ నారాయణ అడిగిన ప్రశ్నలకు వేణుమాధవ్‌ ఇచ్చిన సమాధానాలు ఇవి.


తింగరితనం, అతి తెలివి కలిసిన  మేధస్సుతో అనవసరమైన బిల్డప్పులు ఇచ్చి, ఇరుక్కుపోయే ఇలాంటి పాత్రలకు వేణుమాధవ్‌ తప్ప ఇంకెవ్వరూ సూటవ్వరేమో..?


‘సై‘లో ఇంకో టైపు..
పర్మిషనేందిరో.. పొలిటికలోళ్లను పోరగాళ్లేం చేస్తరు.., ‘గోడల మీద పేర్లేందిరా.. గుండెలమీద కునుకు తీస్తా.., మన పేరు చెబితే కాలేజీకి లాంగ్‌ బెల్లు కొట్టాలా.., నల్లబాలు నల్లతాచు లెక్క’ అంటూ కాలేజీ కుర్రాళ్ల ముందు రౌడీయిజం చూపించి, తన్నులు తిన్నప్పుడు...


లక్ష్మీలో..
వద్దక్కా... భయమేస్తోందక్కా.. అలా చూడకక్కా’ అంటూ తెలంగాణ శంకుతలచేతిలో చావు దెబ్బలు తిన్నప్పుడు..


మాస్‌లో..
మాస్‌’లో క్యాన్సర్‌ అని అబద్దం చెప్పి రౌడీలనే ఫూల్‌ చేసినప్పుడు.. ఎన్ని నవ్వులు పండాయో..?  ఏ పాత్ర ఇచ్చినా, ఆ పాత్రలో లీనమై, తానో నవ్వుల వేణువై ఎన్ని కితకితల రాగాలు ఆలపించాడో..? ఆ ‘వేణు’వు ఇప్పుడు మూగబోయింది. వేణుమాధవ్‌ నవ్వులు ప్రయాణం ఇప్పుడో కన్నీటి జ్ఞాపకంగా మిగిలిపోయింది.


టైటిల్స్‌లోనూ చమక్కులు
‘ముమైత్‌ఖాన్‌ వాకిట్లో ములక్కాడ చెట్టు’, ‘సాగర సంగమం - వీడికి డ్యాన్స్‌ రాదు’, ‘ఇంద్ర - వీడికి మీసం లేదు’ అనే తమాషా టైటిళ్లని తన కోసం రిజిస్టర్‌ చేయించుకున్నారు వేణుమాధవ్‌. కానీ అవి పట్టాలెక్కలేదు. కొన్నాళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు.
అన్నగారికి నచ్చిన ‘బొమ్మగారు...
’వేణుమాధవ్‌ స్వస్థలం సూర్యాపేట జిల్లాలోని కోదాడ. నాన్న ప్రభాకర్‌ టెలిఫోన్‌ శాఖలో పనిచేసేవారు. ఎం.కామ్‌ వరకూ చదివిన వేణుమాధవ్‌కి కళలంటే చాలా ఇష్టం. ఉపాధ్యాయుల గొంతుల్ని మిమిక్రీ చేసి నవ్వించేవారు. నేరేళ్ల వేణుమాధవ్‌ స్ఫూర్తితో వెంట్రిలాక్విజం (బొమ్మతో మాట్లాడించడం) నేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించే ‘మహానాడు’లో ప్రదర్శనలు ఇచ్చారు. అప్పుడే నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడింది. తన ప్రతిభతో ఎన్టీఆర్‌ అభిమానాన్ని చూరగొన్నారు. అప్పట్లో వేణుమాధవ్‌ను ఎన్టీఆర్‌ ‘బొమ్మగారూ’ అని ఆప్యాయంగా పిలిచేవారు. కొంతకాలం అసెంబ్లీలో లైబ్రేరియన్‌గానూ ఉన్నారు. ఆ తరవాత టీడీపీ కార్యాలయంలో టెలిఫోన్‌ ఆపరేటర్‌గా పనిచేశారు. అప్పుడు రవీంద్రభారతిలో నాటకాలు చూడడం అలవాటు చేసుకున్నారు. ఓసారి ‘ఈడ్లు లాడ్లు’ అనే నాటికలో నటించారు. అది చూసి దర్శకనిర్మాతలు ఎస్వీకృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ‘సంప్రదాయం’లో తొలి అవకాశం ఇచ్చారు. ‘తొలిప్రేమ’ నటుడిగా గుర్తింపు తెచ్చింది.


ఛత్రపతి’లో మహేష్‌నందగా చేసిన సందడి, అపరిచితుడిలా చేసిన అల్లరిని మర్చిపోలేం. ఎన్నో చిత్రాల్లో పేరడీ సన్నివేశాలతో వినోదాలు పంచి చెరగని ముద్ర వేశారు. వేణుమాధవ్‌ మృతిపట్ల తెలుగు చిత్రసీమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.
అచ్చొచ్చిన కృష్ణ నిలయం
వేణుమాధవ్‌ సినీ ప్రయాణంలో కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిల పాత్ర మర్చిపోలేనిది. తొలి అవకాశం ఇవ్వడమే కాదు, కథానాయకుడిగానూ వాళ్లే మార్చారు. ‘హంగామా’తో వేణుమాధవ్‌ హీరో అయ్యారు. ఆ చిత్రం మంచి  విజయాన్ని అందుకుంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ప్రతి చిత్రంలోనూ వేణుమాధవ్‌కి మంచి పాత్రలు దొరికాయి. అందుకు కృతజ్ఞతగా వేణు మాధవ్‌ తన ఇంటికి ‘అచ్చొచ్చిన కృష్ణనిలయం’ అని పేరు పెట్టుకున్నారు. ‘నన్ను తొలిసారి విదేశాలకు తీసుకెళ్లింది కూడా ఎస్వీ కృష్ణారెడ్డి గారే. ఆయన తీసిన ‘అభిషేకం’ చిత్రం కోసం తొలిసారి సింగపూర్‌ వెళ్లాను. ఇక అక్కడి నుంచి విమానం పట్టుకుని విదేశాలు తిరుగుతూనే ఉన్నాన’ని చెప్పుకునేవారు వేణుమాధవ్‌. తన పేరు మీద ఓ ట్రస్ట్‌ని కూడా ఏర్పాటు చేసి, సొంతూరులో కొన్ని సేవా కార్యక్రమాల్ని నిర్వహించేవారాయన.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.