అసమాన ప్రతిభ విజయనిర్మల సొంతం
మలయాళ సినిమాలు సాధారణంగా వాస్తవిక ధోరణికి అద్దం పడుతూ వుంటాయి. అందుకే ఆ మహిళా దర్శకురాలు మెగాఫోన్‌ చేపట్టి తన తొలి ప్రయత్నంగా మళయాళ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు నిర్ణయం తీసుకుంది. 13 ఏప్రిల్‌ 1973న విడుదలైన ఆ మళయాళ చిత్రం పేరు ‘కవిత’. తల్లితో లైంగిక సంబంధం పెంచుకున్న ఒక వ్యక్తి ఆమె కూతురితో కూడా ఆనందం పొందాలనే కోరిక ఇతివృత్తంగా నడిచే ఈ సినిమా కథ తెలుగులో తీస్తే మన ప్రేక్షకులు చీదరిస్తారు. కానీ ఈ యాంటీ సెంటిమెంట్‌ గల ఇతివృత్తాన్ని మలయాళీ ప్రేక్షకులు ఆదరించారు. దర్శకురాలిని అభినందించారు. ఆ సాహసిక దర్శకురాలు తదనంతర కాలంలో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్‌ రికార్డులకెక్కింది. ఆమే ‘నీరజ’గా తెలుగు చలనచిత్ర రంగప్రవేశం చేసి విజయనిర్మలగా వినీలాకాశంలో రెపరెపలాడిన సహజనటి. ఆమె ఏకంగా 42 సినిమాలకు దర్శకత్వం వహించి అప్పటిదాకా 27 చిత్రాల రికార్డు కలిగిన ఇటలీ దర్శకురాలి పేరు చెరిపేసి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది. తెలుగులో బాలనటిగా ‘పాండురంగమహాత్మ్యం’ (1957)లో బాలకృష్ణుడుగా నర్తించి అరవయ్యేళ్ళుగా సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని అందుకున్న నటి, దర్శకురాలు విజయనిర్మల. తన జీవిత భాగస్వామి కృష్ణతో 50 చిత్రాల్లో నటించి రికార్డు నెలకొల్పిన విజయనిర్మల జయంతి (ఫిబ్రవరి 20, 1944) ఈరోజు.  ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు...


తమిళ చిత్రాల్లోలో బాలనటిగా...
విజయనిర్మల పుట్టింది మద్రాసులో. ఆమె పుట్టిన రోజు 20 ఫిబ్రవరి 1944. సమర్ది శకుంతలాదేవి, రామమోహనరావు ఆమె తల్లిదండ్రులు. ఆమెకు ఒక అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్లు. తండ్రి వాహినీ స్టూడియోలో చీఫ్‌ ఆపరేటర్‌గా పనిచేసేవారు. ప్రముఖ గాయని రావు బాలసరస్వతిదేవి విజయనిర్మల మేనత్త కూతురే. మరో నటి జయసుధ విజయనిర్మల పెదనాన మనవరాలు. ఆమెది సినిమా కుటుంబమే. వీరి మకాం తొలుత మౌంట్‌ రోడ్డులో వుంటూ తరువాత ట్రిప్లికేన్‌లో మెరీనా బీచ్‌ సమీపంలోకి మారింది. ఆమెకు నాట్యం మీద అభిరుచి వుండటం గమనించిన తండ్రి తిరు వెంకట ముదలియార్‌ వద్ద భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. నేషనల్‌ హైస్కూలులో చదువుకుంటూ నాట్యశిక్షణ తీసుకుంది. ఆమె నాట్యం చేయడం గమనించిన విజయ నిర్మల స్నేహితుడు ఒక తమిళ చిత్రంలో నటించే అవకాశాన్ని కలిపించాడు. ఆ సినిమా పేరు ‘మచ్చరేకై’ (1953). ఆ చిత్ర దర్శకుడు పి.పుల్లయ్య. అందులో బాల హీరోపాత్రలో విజయనిర్మల నటించింది. తరువాత మరొక తమిళ చిత్రం ‘సింగారి’లో చిన్ననాటి హీరోయిన్‌ పద్మిని పాత్ర పోషించింది. టి.ఆర్‌.రఘునాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టి.ఆర్‌.రామచంద్రన్, తిరువాన్కూరు సోదరిలు లలిత, పద్మిని, రాగిణి, తంగవేలు, సహస్రనామం, ముఖ్య తారలు. విజయనిర్మల బాలతారగా నటించిన మూడవ చిత్రం ‘మనంపోల్‌ మాంగల్యం’. ఈ చిత్రానికి కూడా పి.పుల్లయ్యే దర్శకుడు. అప్పటికి జెమిని గణేశన్‌ పేరు ఆర్‌.గణేశన్‌ అనే వుండేది. అతని సరసన సావిత్రి హీరోయిన్‌గా నటించింది. అందులో విజయనిర్మలది ఒక రైలులో బిచ్చమెత్తుకునే అమ్మాయి పాత్ర. ఆమెకు ఒక పాట కూడా పెట్టారు. విజయనిర్మల నటన చూసిన సావిత్రి ఆమెను దగ్గరకు తీసుకొని ఆశీర్వదించింది. తరువాత వీరిద్దరూ ఎంతో సఖ్యతగా మెలిగారు. తరవాత ఎ.వి.ఎం.వారు 1957లో నిర్మించిన హిందీ చిత్రం ‘హమ్‌ పంఛి ఏక్‌ డాల్‌ కే’ సినిమాలో బాలనటిగా నటించింది. ఈ సినిమా నిర్మాణమంతా మద్రాసు ఎ.వి.ఎం స్టూడియోలోనే జరిగింది. తరువాత విజయా వారు తెలుగులో విజయవంతమైన ‘గుణసుందరి కథ’ను తమిళంలో నిర్మిస్తూ అందులో చిన్ననాటి హేమసుందరి పాత్రలో నటింపజేశారు. అప్పుడే ఈమె పేరుకి ముందు ‘విజయ’ చేర్చడం జరిగింది. అయితే ఈ సినిమా తమిళంలో ఫ్లాప్‌ అయింది.


పాండురంగ మహాత్మ్యం సినిమాలో బాలనటిగా ...
మహారాష్ట్రకు చెందిన భక్త పుండరీకాక్షుని కథ ఆధారంగా ఎన్‌.ఎ.టి సంస్థ ‘పాండురంగ మహాత్మ్యం’ (1957) చిత్రాన్ని నిర్మించింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్టీఆర్, అంజలీదేవి, బి.సరోజాదేవి, నాగయ్య ముఖ్య తారాగణంగా నిర్మించిన ఈ చిత్రం సంగీతపరంగా కూడా అద్భుత విజయాన్ని సాధించింది. ఇందులో బాలకృష్ణుని వేషం కోసం కొంతమంది పిల్లల్ని స్టూడియోకి పిలిపించి స్కీన్ర్‌ టెస్టులు నిర్వహించారు. విజయనిర్మల కూడా తండ్రితో సెలక్షన్‌ కోసం వెళ్ళింది. విజయనిర్మల గతంలో బాలనటిగా నటించిన ‘మచ్చరేకై’ సినిమాను రామారావు చూసి ఉండడంతో విజయనిర్మలను ఎంపికచేసి ‘జయకృష్ణా ముకుందా మురారి’ పాటలో బాలకృష్ణుని వేషం ఆమెచేత వేయించారు. ఈ పాట చిత్రీకరణ పదిరోజులపాటు జరిగింది. ఆ సమయంలో విజయనిర్మల కళ్లుతిరిగి పడిపోగా రామారావు షూటింగు ఆపి ఆమెకు గుమ్మడికాయ తెప్పించి స్వయంగా దిష్టితీశారు. తరువాత పాట చిత్రీకరణ పూర్తిచేశారు. తరువాత ‘భూకైలాస్‌’ (1958) చిత్రంలో ‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం’ అనే పాటలో సీత పాత్రలో కనిపించింది. బాలనటిగా ఇదే విజయనిర్మలకు ఆఖరి చిత్రం. తరువాత విజయనిర్మల చదువుమీద ధ్యాస పెట్టింది. దానితోబాటు నాట్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి భరతనాట్యం బాగా నేర్చుకుంది. అప్పుడే వాణీమహల్‌లో నాట్యప్రదర్శన ఇచ్చింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్‌.టి.రామారావు విజయనిర్మలకు బహుమతి అందజేసి ఆశీర్వదించారు. స్కూల్‌ ఫైనల్‌ పూర్తిచేశాక విజయనిర్మల చదువుకు స్వస్తి చెప్పింది.


మళయాళ చిత్రంలో హీరోయిన్‌గా...
1964 మళయాళ నిర్మాత పారీకుట్టి ప్రముఖ చాయాగ్రాహకుడు విన్సెంట్‌ దర్శకత్వంలో ‘భార్గవి నిలయం’ అనే సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడు, కొత్త తారను హీరో ప్రీమ్‌ నజీర్‌ సరసన నటింపజేయాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఒకానొక కార్యక్రమంలో విజయనిర్మల విన్సెంట్‌ కంట పడడంతో ఆమె గురించి ఆరా తీస్తే, విజయనిర్మల తన స్నేహితుని కుమార్తె అని తెలిసింది. వెంటనే విన్సెంట్‌ విజయనిర్మల తండ్రిని సంప్రదించి ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేశారు. అటు విజయనిర్మలకే కాకుండా విన్సెంట్‌కి కూడా దర్శకునిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అంతేకాదు... మలయాళంలో రూపుదిద్దుకున్న తొలి హార్రర్‌ చిత్రం కూడా ఇదే. ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచి విజయనిర్మలకు మంచి పేరు ఆర్జించి పెట్టింది. ఈ చిత్ర విజయంతో విజయనిర్మల ’నిశాగంధి’ (1965) అనే మరొక హార్రర్‌ సినిమాలో నటించింది. తరువాత ‘కళ్యాణ ఫోటో’, ‘కళ్యాన్‌ రాత్రియిల్‌’, ‘పూచక్కణ్ణి’, ‘అన్వేషిచ్చు కండదిల్లా’, ‘పూజ’, ‘రోసీ’, ‘కరుత్త పౌర్ణమి’, ‘వివాహం స్వర్గత్తిల్‌’ వంటి మళయాళ చిత్రాల్లో హీరోయిన్‌ పాత్రలు పోషించింది.


రంగారావునే మార్చేసిన ‘ఎంగవీట్టు పెణ్ణ్‌’ చిత్రం...
1965లో విజయా వారు తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘షావుకారు’ (1950) చిత్రాన్ని తమిళంలో ‘ఎంగవీట్టు పెణ్ణ్‌’గా పునర్నిర్మించారు. కాలానికి అనుగుణంగా కథలో చక్రపాణి కొన్ని మార్పులు చేశారు. తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోగా జయశంకర్, ఇతర పాత్రల్లో ఎ.వి.ఎం.రాజన్, ఎం.ఆర్‌.రాధా, తంగవేలు, నాగేష్, నాగయ్య, వసంత, మనోరమ, మాధవి నటించగా హీరోయిన్‌ పాత్రను విజయనిర్మలకు ఇచ్చారు. ఇక్కడ ఒక ఊహించని సంఘటన జరిగింది. తొలిరోజు షూటింగులో విజయనిర్మలకు ఎస్‌.వి.రంగారావు తారసపడ్డారు. ఆమెకు రంగారావుని చూడడం అదే తొలిసారి. ఆయన భారీ విగ్రహం చూసి తొలుత కాస్త భయపడినా విజయనిర్మల రంగారావుకు నమస్కరించింది. విజయనిర్మలను రంగారావుకి పరిచయం చేస్తూ ‘ఈ అమ్మాయే హీరోయిన్‌’ అని చెప్పారు ప్రొడక్షన్‌ సిబ్బంది. రంగారావు తన సహజమైన ధోరణిలో ‘ఎలుక పిల్లలా పీలగా వున్న ఈ అమ్మాయి హీరోయినా? సినిమా అంతా ఈమె ఎలా లాక్కొస్తుంది. ఈమెను తీసేసి కె.ఆర్‌.విజయను పెట్టండి’ అని సలహా ఇస్తూ వెళ్ళిపోయారు. విజయనిర్మల డీలాపడింది. తనకు అవకాశం చేజారినట్లే అని భావిస్తూ ఇంటికి వెళ్ళింది. మరుసటిరోజు విజయనిర్మల కోసం కారొచ్చింది. ‘షూటింగుకి రమ్మంటున్నారు’ అని మేనేజరు ఆమెకు ఫోన్‌ చేశారు. విజయనిర్మల రెడీ అయి స్టూడియోకి వెళ్ళింది. సెట్లో ఎదురుగా తమిళనటుడు ఎస్‌.వి.సుబ్బయ్య దర్శనమిచ్చాడు. రంగారావు జాడ లేదు. విజయనిర్మలను తీసెయ్యమని సలహా ఇచ్చిన రంగారావునే మార్చి ఎస్‌.వి.సుబ్బయ్యను అతని స్థానంలో నియమించి ఆశ్చర్యపరచారు నిర్మాత చక్రపాణి.


రంగులరాట్నంతో తెలుగులో...

1966లో ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్‌.రెడ్డి ‘రంగులరాట్నం’ చిత్రాన్ని ప్రారంభిస్తూ చంద్రమోహన్‌ని హీరోగా తీసుకున్నారు. అతని చెల్లెలు పాత్రను విజయనిర్మలకు ఆఫర్‌ చేశారు బి.ఎన్‌.రెడ్డి. ఈ చిత్రానికి జాతీయ బహుమతితో బాటు రాష్ట్ర నంది బహుమతి కూడా లభించింది. చంద్రమోహన్‌తోబాటు విజయనిర్మల, వాణిశ్రీ, రేఖ(భానురేఖ) ఈ సినిమాకు కొత్తే! విజయనిర్మలకు జోడిగా నాగరాజారావు అనే కొత్త నటుడు నటించాడు. ఈ చిత్రంలో విజయనిర్మల పేరుని బి.ఎన్‌.రెడ్డి ‘నీరజ’గా మార్చారు. ఆ తరువాత నటించిన ‘పిన్ని’ చిత్రంలో కూడా విజయనిర్మల పేరు నీరజగానే వ్యవహరించారు. అయితే అంతకుముందు విజయనిర్మల నిర్మల మళయాళ, తమిళ సినిమాల్లో ‘నిర్మల’ పేరుతో నటించడం వలన ఆమెను అదే పేరుతో పిలిచేవారు. అప్పటికే తమిళ చిత్రసీమలో ‘వెన్నిరాడై నిర్మల’ కూడా ఉండడంతో విజయనిర్మల మార్పు కోరుకుంది. అంతకుముందు విజయా సంస్థలో పని చేసి ఉండడంతో తనపేరును ‘విజయనిర్మల’గా మార్పు చేసుకుంది. కట్‌ చేస్తే... విజయనిర్మల రంగులరాట్నం చిత్రంలో ‘కనరాని దేవుడే కనిపించినాడే...కనిపించి అంతలో కన్నుమరుగాయె’ అనే పాటను విజయనిర్మల పియానో వాయిస్తూ పాడుతుండగా చిత్రీకరించారు. అలాగే ‘కోయిల కోయని పిలిచినది... ఓ యని నామది పలికినది’ అనే పాట కూడా విజయనిర్మల మీదే చిత్రీకరించారు. అందులో చివర్న వీణ వాయించే సన్నివేశం కోసం ఆమెకు బి.ఎన్‌.రెడ్డి పక్షం రోజులు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించడం విశేషం. ఈ చిత్రం తరువాత విజయనిర్మలకు తెలుగులో అవకాశాలు మెరుగవడంతో మళయాళ చిత్రాల్లో నటించడం దాదాపు మానుకుంది. అడపాదడపా ‘సిత్తి’, ‘పణమా పాశమా’ వంటి చిత్రాల్లో నటిస్తూ తన పయనాన్ని తెలుగు చిత్రసీమ వైపు నడిపించింది.


మీసాల కృష్ణుడు సాక్షిగా కృష్ణకు దగ్గరై...
బాపు దర్శకునిగా తొలిసారి మెగాఫోన్‌ పట్టుకున్న సినిమా నందనా ఫిలిమ్స్‌ బ్యానర్‌ మీద నిర్మించిన ‘సాక్షి’. అందులో కృష్ణ, విజయనిర్మల హీరో, హీరోయిన్లు. ఈ సినిమా కృష్ణకు ఐదవ సినిమా కాగా విజయనిర్మలకు మూడోది. ‘సాక్షి’ సినిమా తొలి సన్నివేశ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు రాజబాబు కల్పించుకొని ‘ఇది మీసాల కృష్ణుడి గుడి. చాలా శక్తివంతమైనది. ఈ గుడిలో మీకు, కృష్ణకు జరిగే పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. నిజజీవితంలో కూడా మీరిద్దరూ తప్పక భార్యాభర్తలవుతారు’ అంటూ విజయనిర్మలను కవ్విస్తే ఆమె ‘ఛా! ఏమిటా పిచ్చిమాటలు’ అన్నారు. ఆ దేవుని మహిమేమో కాని, వారిద్దరూ కలిసి మూడు నాలుగు సినిమాలు చెయ్యగానే పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నారు. ‘ఆ క్రెడిట్‌ బాపు గారికే’ అంటారు విజయనిర్మల. 1969 మార్చి 24న తిరుపతిలో ఇద్దరూ పెళ్లి చేసుకుని, పులిదిండి వెళ్లి మరలా గుడిలో దండలు మార్చుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత ఆమె కెరీర్‌కు ఫుల్‌ స్టాప్‌ పడినట్లే అని అందరూ భావించారు. కానీ విజయనిర్మల విషయంలో ఆ సూత్రం తప్పని తేలింది. వారిద్దరూ కలిసి యాభైకి పైగా సినిమాల్లో జంటగా నటించి రికార్డు సృష్టించారు. ఆమెకు దర్శకత్వం వహించాలనే కోరిక ‘సాక్షి’ సినిమాలో నటిస్తున్నప్పుడే అంకురించింది. ‘వంద సినిమాలు పూర్తయ్యాకే దర్శకత్వం గురించి ఆలోచించు. లేకుంటే రెంటికీ చెడినట్లవుతుంది’ అని కృష్ణ ఇచ్చిన సలహాను విజయనిర్మల ఆచరణలో పెట్టింది. అలా దర్శకురాలిగా 1973లో శ్రీకారం చుట్టింది. అది కూడా ‘కవిత’ అనే మళయాళ చిత్రంతో. ఆ చిత్రం విజయాన్ని సాధించడంతో విజయనిర్మలకు ఆత్మస్థైర్యం పెరిగింది. తరువాత తెలుగులో ‘మీనా’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించింది. ‘మీనా’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచి విజయనిర్మలకు దర్శకురాలిగా నీరాజనాలు పలికింది. తరువాత మలయాళం లో నిర్మించిన ‘కవిత’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మించారు. విజయనిర్మలకు టెక్నికల్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చిన చిత్రం ‘దేవుడే గెలిచాడు’ సినిమా. తరువాత నుంచి ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించింది విజయనిర్మల. అక్కినేని-కృష్ణ కాంబినేషన్లో ‘హేమాహేమీలు’, శివాజి గణేశన్‌-కృష్ణ కాంబినేషన్లోలో ‘బెజవాడ బెబ్బులి’, రజనీకాంత్‌-కృష్ణ కాంబినేషన్లో ‘రామ్-రాబర్ట్‌-రహీమ్’ చిత్రాలను డైరెక్ట్‌ చెయ్యడం విజయనిర్మల చేసిన ప్రయోగాలు. మంచి వేగం గల దర్శకురాలిగా పేరుతెచ్చుకున్న విజయనిర్మల తీసిన చిత్రాల్లో అద్భుత విజయాలతోబాటు కొన్ని పరాజయాలు కూడా లేకపోలేదు.


మరిన్ని విశేషాలు...
తన సినీప్రస్థానంలో 42 సినిమాలకు దర్శకత్వం వహించి అంతకు ముందు ఇటలీ దర్శకురాలు పేరిట వున్న 27 సినిమాల మహిళా దర్శకత్వ రికార్డును తిరగరాసి విజయనిర్మల గిన్నిస్‌ రికార్డును అందుకోవడం గొప్పవిషయం. ఇది కేవలం ఒక తెలుగు మహిళకే సాధ్యమైన విశేషం. ఆమెకు ప్రతిష్టాత్మక ‘రఘుపతి వెంకయ్య’ రాష్ట్ర అవార్డుని ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గౌరవించింది. మద్రాసులో విజయకృష్ణ పేరుతో ఒక డబ్బింగ్‌ థియేటర్‌ కూడా ఆమె నెలకొల్పారు. అలాగే ఒక అవుట్‌ డోర్‌ యూనిట్‌ కూడా ఆమె నిర్వహించారు. విజయకృష్ణ బ్యానర్‌ మీద ఎన్నో సినిమాలు నిర్మించారు. వాటికి తన సోదరులు రవికుమార్, రమానంద్, రఘునాథ్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. ఆమె తనయుడు నరేష్‌ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో విజయనిర్మల వందకు పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో బంగారు గాజులు, టక్కరిదొంగ-చక్కనిచుక్క, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, అమ్మకోసం, విచిత్ర దాంపత్యం, మోసగాళ్ళకు మోసగాడు, బుల్లోడు బుల్లెమ్మ, పండంటికాపురం, తాత- మనవడు, మీనా, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, కురుక్షేత్రం, హేమాహేమీలు, కలక్టర్‌ విజయ, గండిపేట రహస్యం, నేరము-శిక్ష కొన్ని మాత్రమే.  

- ఇంతటి గొప్ప నటి, దర్శకరాలు జూన్ 27, 2019న కన్నుమూశారు. 

- ఆచారం 

విజయ నిర్మలకు సినీ ప్రముఖ నివాళి
చిత్రమాలిక కోసం క్లిక్‌ చేయండిసంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.