కన్నడ చిత్ర సీమ ‘ఆప్తమిత్ర’
ఎందరో తమని తాము వెండి తెరపై చూసుకోవాలని ఎన్నో కలలతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెడుతుంటారు. అలా కొందరు సినీ పరిశ్రమలోకి రావడమే కాదు, తమ నటనతో ఇతరుల్లో.. సినిమాల్లోకి వెళ్లాలనే తపన పుట్టిస్తారు. ఇలా చిత్రరంగంలోకి వచ్చిన నటులకు ఆరాధ్య దైవంగా నిలుస్తుంటారు. వెండి తెరపై ఓ వెలుగు వెలగటమే కాకుండా వ్యక్తిగతంగా ప్రజా సమస్యల్ని పట్టించుకుని అశేష అభిమానాన్ని సొంతం చేసుకుంటారు. ఇలాంటి వారు ఒక్కో చిత్ర పరిశ్రమకు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. కానీ కన్నడ చిత్ర పరిశ్రమకు విష్ణు వర్ధన్‌ ఒక్కరే అంటే అతిశయోక్తి కాదేమో.


విష్ణు వర్ధన్‌.. కన్నడ కథానాయకుడు అయినా తెలుగు ప్రేక్షకులకూ ఈయన సుపరిచితుడు. 1987లో ‘సర్ధార్‌ ధర్మన్న’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన విష్ణు ఆ తర్వాత ‘ఒక్కడు చాలు’ సినిమాతో మెప్పించాడు. ఈయన నటించిన ‘ఆప్తమిత్ర’ చిత్రమే తెలుగులో రజనీకాంత్‌ హీరోగా వచ్చిన ‘చంద్రముఖి’. ఇందులో విష్ణు నటన అత్యద్భుతం. ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘రాజా విజయ రాజేంద్ర బహదూర్‌’తో తెలుగు ప్రేక్షకులకు మళ్లీ దగ్గరయ్యారు. కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, తెలుగు అన్ని భాషలు కలిపి సుమారు 220 చిత్రాల్లో నటించిన ఘనత ఆయన సొంతం. విష్ణు కేవలం కథానాయకుడు మాత్రమే కాదు కథా రచయిత, గాయకుడు, నిర్మాత కూడా. ఆల్‌ రౌండర్‌గా అభిమానుల్ని అలరించిన విష్ణు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు..
బాల్యం, కుటుంబం:
విష్ణు మైసూర్‌లో నివాసం ఉండే నారాయణరావు, కామాక్షమ్మ దంపతులకు 1950 సెప్టెంబరు 18న జన్మించారు. విష్ణు వర్ధన్‌ అసలు పేరు సంపత్‌ కుమార్‌. ఆయన తండ్రి నటుడు, సంగీత దర్శకుడు,రచయిత. విష్ణుకు 6గురు తోబుట్టువులు. కళా నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో వారిలో ఓ సోదరి కథక్‌ నృత్య కళాకారిణిగా స్థిరపడ్డారు. ఓ సోదరుడు తమిళ, కన్నడలో విడుదలైన ‘మొదల తెడి’ చిత్రంలో బాల నటుడిగా చేశాడు.


విద్యాభ్యాసం:
మైసూరులోని గోపాలస్వామి పాఠశాలలో, బెంగళూరులోని కన్నడ మోడల్‌ హైస్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన బసవన్‌ గుడిలోని నేషనల్‌ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు.
సినీ ప్రయాణం:
కన్నడలో 1972లో వచ్చిన ‘వంశవృక్ష’ సినిమాతో సహాయ నటుడుగా వెండితెరకు పరిమైన విష్ణు అదే ఏడాది ‘నాగరహావు’ చిత్రంతో కథానాయకుడుగా మారాడు. అప్పటి నుంచి ఆయన వెను తిరిగి చూడలేదు. అంతేకాదు ఒకే ఏడాది 15 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. అభిమానుల్ని అలరించేందుకు ఇతర నటుల సినిమాల్లో అతిథి పాత్రలు పోషించారు. 4 హిందీ, 6 తమిళ, 2 మలయాళం, 2 తెలుగు చిత్రాల్లో కథానాయకుడుగా మెరిశారు విష్ణు.

వైవాహిక జీవితం:
1975 ఫిబ్రవరి 17న నటి భారతిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు ఇద్దరు అమ్మాల్ని దత్తత తీసుకుని తమ ఉదారత చాటుకున్నారు. వారే కీర్తి, చందన. బుల్లి తెరపై: వెండితెరపైనే కాకుండా 1980లో తొలిసారి బుల్లి తెర ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో ప్రాచుర్యం పొందిన ‘మాల్గుడి డేస్‌’ సీరియల్‌(రూపీస్‌ ఫార్టీ ఫైవ్‌ ఎ మంత్‌ ఎపిసోడ్‌) లో ప్రధాన పాత్ర పోషించారు విష్ణు.


సేవా కార్యక్రమాలు:
అప్పట్లో బెంగళూరులో వచ్చిన వరదలకు ఎందరో నిరాశ్రయులవడంతో చలించిన విష్ణు వర్థన్‌ ‘స్నేహలోక ఆర్గనైజేషన్‌’ స్థాపించి సహాయం అందించారు. అంతేకాదు స్వయంగా తానే పాదయాత్ర చేసి విరాళాలు సేకరించేవారు. అంతటితో ఆగిపోకుండా మాంద్య అనే జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.


అవార్డులు:
ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7 సినిమాలకుగాను 7 అవార్డులు, 6 ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు.
బిరుదులు:
అభిమానులు ఆయన్ను సాహస సింహ, అభినవ భార్గవ అని పిలిచేవారు. కన్నడ చిత్ర సీమ ‘యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌’గా గుర్తించింది.
గౌరవ సత్కారాలు:


*2013లో తపాలా శాఖ విష్ణు వర్ధన్‌ పేరు మీద పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసింది.
* 2008లో సి.ఎన్‌.ఎన్‌- ఐ.బి.ఎన్‌ నిర్వహించిన పోల్‌లో కన్నడ సినీ రంగంలో ప్రముఖుడు విష్ణు వర్ధన్‌ అని పేర్కొంది.
* ఆయనపై ఉన్న అభిమానంతో బెంగళూరులోని బన్‌ శంకరీ ఆలయం నుంచి కంగేరీ వరకు 14.5 కిలోమీటర్ల రోడ్డుకు విష్ణు వర్ధన్‌ రోడ్డు అని పేరు పెట్టారు. ఓ సెలబ్రటీ పేరు మీద ఉన్న అతి పెద్ద రోడ్డు ఇదే కావడం విశేషం.
- ఇంతటి నటన పరంగా, సామాజిక సేవా కార్యక్రమాలతో అశేషమైన ప్రేక్షకాధరణ పొందిన విష్ణువర్థన్‌ 2009 డిసెంబరు 30న తుదిశ్వాస విడిచారు.


మరణానంతరం విష్ణుతో కోడి రామకృష్ణ ప్రయోగం:టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ గ్రాఫిక్స్‌తో ఎలాంటి మాయ చేస్తారో తెలిసిన విషయమే. ‘నాగభరణం’ చిత్రంతో అంతకు మించిన ప్రయోగం చేశారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఏకంగా విష్ణు వర్దన్‌ను క్రియేట్‌ చేశారు. విష్ణు అంటే ఎంతటి క్రేజ్‌ ఉండేదో ఈ విషయంతో అర్థమవుతుంది.

                                                                                                                                            
     - రవిసారథి రంగోజు,  ఈనాడు డిజిటల్‌  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.