బుల్లితెర నుంచి వెండితెరకొచ్చిన ఈ తార ఎవరు?
ముద్దు బంతి పువ్వులాంటి ముద్దులొలికే మోముతో.. చందమామలా చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చక్కని చుక్క ఎంత బాగుందో కదా. ఆ చూడచక్కని గౌనులో బేబీ కటింగ్‌ హెయిర్‌ స్టైల్‌తో గడ్డం కింద చెయ్యి పెట్టుకోని ఎంత స్టైలిష్‌గా కెమెరాకు ఫోజిచ్చిందో. ఆమెలోనే ఓ కళా సరస్వతి కొలువుదీరినట్లుగా కనిపిస్తోంది కాబోలు.. చిన్న వయసులోనే బుల్లితెర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఉత్తరాది.. దక్షిణాది వంటి ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఇంటికీ చేరువైంది. ‘మార్నింగ్‌ వాక్‌’ అనే చిత్రంతో బాలనటిగా వెండితెరపై మెరిసిన ఈ బుల్లితెర సుందరి.. 2013లో విరించి వర్మ దర్శకత్వంలో వచ్చిన ఓ హిట్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇందులో ఉమాదేవిగా ఆ ముద్దుగుమ్మ చేసిన అల్లరికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ఈ చిత్ర హీరోతోనే చేసిన రెండో సినిమాలో పరిణీత అనే ఇంటర్‌ విద్యార్థిగా తన అమాయకమైన నటనతో మరోసారి కుర్రాళ్ల గుండెలను పిండి చేసింది. ఈ భామకు తెలుగులో మంచి హిట్లు పడినప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో క్రమంగా తెరమరుగైంది. ప్రస్తుతం ఓ క్రేజీ టాలీవుడ్‌ హిట్‌ సిరీస్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇంతకీ ఈ కథానాయిక పేరేంటో చెప్పుకోండి చూద్దాం..

క్లూ: ఈ బాలికా వధు ఇప్పుడు రాజుగారి గదిలో దూరి భయపెట్టబోతుందట..Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.