రాఖీ వేడుకలకు కలిసొచ్చిన ఈ అక్కాతమ్ముళ్లు ఎవరు?
క్కా.. తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌. ఈరోజు దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందడితో దేశ భక్తి పరిమళిస్తుండగా.. మరోవైపు ప్రతి ఇంటా రాఖీ పౌర్ణమి వేడుకలతో అనురాగాలు, ఆప్యాయతలు వెల్లివిరుస్తున్నాయి. ప్రతి అక్కా- చెల్లి.. తమ తమ సోదరుల రక్షను కాంక్షిస్తూ వారి ప్రేమ నిండిన రక్షలను సోదరుల చేతులకు కడుతూ ప్రేమను పంచుతున్నారు. ఇక సినీప్రముఖులు కూడా తమ తమ సోదరీమణులతో ఉన్న తమ అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో కూడా అలా బయటకు వచ్చిందే. ఇక్కడ తన సోదరి ఒడిలో కూర్చోని చిరునవ్వులు చిందిస్తున్న బాబు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ స్టార్‌ హీరో. దాదాపు పదేళ్లు ప్లాపులు వెంటాడినా.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి వరుస విజయాలు దక్కించుకున్నాడు. తోటి యువ హీరోలకు తన పోరాటాన్ని స్ఫూర్తి పాఠంగా అందించాడు. అన్నట్లు మరో విషయం ఏంటంటే.. ఇతను పవన్‌ కల్యాణ్‌కు అరవీర భయంకరమైన భక్తుడు. ఈ విషయాన్ని పలు వేదికలపై అతనే వెల్లడించాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. అభిమానులందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్టార్‌ హీరో తన చిన్నప్పుడు సోదరితో కలిసి దిగిన ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నాడు. ఇంతకీ ఈ బుడతడు ఎవరు.. అతని సోదరి ఎవరో గుర్తుపట్టారా?


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.