బాలీవుడ్‌ను వదలనంటోన్న ఈ స్టార్‌ నాయిక ఎవరు?
చిత్రసీమలో ఇంటగెలిచి రచ్చగెలిచిన ముద్దుగుమ్మలు కొందరుంటే.. రచ్చగెలిచి ఇంటగెలిచిన వారు మరికొందరుంటారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న పాలరాతి సుందరి మాత్రం వీరికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉత్తరాదినే పుట్టి, హిందీ చిత్ర సీమ నుంచే వెండితెరపై కాలుమోపినా.. నటిగా స్టార్‌డమ్‌ను అందుకుంది మాత్రం దక్షిణాది చిత్రసీమల నుంచే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోని అగ్ర కథానాయకులు, కుర్ర హీరోలందరితోనూ ఆడిపాడి మెప్పించిన ఈ భామ ఇంతవరకు తన ఇంట మాత్రం సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది. ఇప్పటికే ‘హిమ్మత్‌ వాలా’, ‘తుటాక్‌ తుటాక్‌’, ‘ఖామోషి’ చిత్రాలతో బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందు అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ ప్రతిసారి వారి నుంచి ఆదరణ కరువైంది. కానీ, ఈ సొగసుల చిన్నది మాత్రం మరోసారి పట్టువదలని విక్రమార్కురాలిలా వారిని అలరించేందుకు ముస్తాబవుతోంది. నవాజుద్దీన్‌ సిద్దిఖీ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రంలో ఆమె నాయికగా ఎంపికైందట. ఓ సరికొత్త రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో షమాస్‌ నవాబ్‌ సిద్దిఖీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతుండటం మరో విశేషం. ఇప్పుడీ సినిమాపై బొలెడన్ని ఆశలు పెట్టుకుంది ఈ అందాల తార. బాలీవుడ్‌లో ఓ హిట్‌ కోసం ఎంతో తపిస్తున్న ఈ దక్షిణాది స్టార్‌ నాయిక ఎవరో గుర్తుపట్టారా?

క్లూ: ఈ భామ నాగచైతన్యతో కలిసి ఓ హిట్‌ మూవీలో నటించింది. ఇప్పుడా సినిమాలోని తన పాత్ర పేరుతోనే ఓ నాయికా ప్రాధాన్య చిత్రంలో నటించింది.
 
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.