రివ్యూ: బద్లా
రివ్యూ: బద్లా
సినిమా పేరు: బద్లా (హిందీ)
నటీనటులు: అమితాబ్‌ బచ్చన్‌, తాప్సి, అమృతా సింగ్‌, టోనీ ల్యూక్‌, మానవ్‌ కౌల్‌ తదితరులు
సంగీతం: అమాల్‌ మాలిక్‌
సినిమాటోగ్రఫీ: అవిక్‌ ముఖోపాధ్యాయ్‌
కూర్పు: మోనిషా ఆర్‌ బాల్దవా
నిర్మాణ సంస్థ: రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అజ్యూర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
కథ: ఓరియోల్‌ పౌలో
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సుజాయ్‌ ఘోష్‌
విడుదల తేదీ: 8-03-2019


బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, కథానాయిక తాప్సి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బద్లా’. ‘పింక్‌’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన రెండో చిత్రమిది. ‘పింక్‌’ చిత్రంలోలాగే ‘బద్లా’లోనూ అమితాబ్‌ న్యాయవాది పాత్రలో నటించారు. 2017లో వచ్చిన స్పానిష్‌ చిత్రం ‘ది ఇన్విజిబుల్‌ గెస్ట్‌’ సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో చూద్దాం.

* కథేంటంటే..
నైనా(తాప్సి)పై తన ప్రియుడైన అర్జున్‌ (మానవ్‌ కౌల్‌)ను హత్యచేసినట్లు నిందపడుతుంది. కానీ తాను అర్జున్‌తో ఓ హోటల్‌లో ఉన్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తి తమపై దాడి చేశాడని, ఆ దాడిలోనే అర్జున్‌ చనిపోయాడని పోలీసులకు చెప్తుంది నైనా. కానీ వీరిద్దరూ ఉంటున్న గదిలోకి మూడో వ్యక్తి వచ్చినట్లు కానీ దాడిచేసినట్లు కానీ పోలీసులకు ఎక్కడా ఆధారాలు లభించవు. దాంతో నైనానే హంతకురాలిగా భావిస్తారు. దాంతో నైనా.. బాదల్‌ గుప్తా (అమితాబ్‌) అనే న్యాయవాదిని ఆశ్రయిస్తుంది. ఆయన దేశంలోనే గొప్ప న్యాయవాదుల్లో ఒకరు. ఎలాంటి క్లిష్టమైన కేసునైనా సమర్థంగా డీల్‌ చేయగల వ్యక్తి. నైనా కేసు గురించి తెలిసి అసలేం జరిగిందో చెప్పమని నైనాకు కేవలం మూడు గంటలు సమయం ఇస్తారు బాదల్. అసలు నైనా ఇంట్లో ఏం జరిగింది? ఆమె బద్లా (పగ) ఎవరిపై? బాదల్‌ ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారా? తదితర విషయాలు తెరపైనే చూడాలి.

* ఎలా ఉందంటే..
సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ఒరిజినల్‌ చిత్రమైన ‘ది ఇన్విజిబుల్‌ గెస్ట్’ సినిమాను ఉన్నది ఉన్నట్లుగానే తెరకెక్కించేశారు దర్శకుడు సుజాయ్‌ ఘోష్‌. సినిమా మొత్తం తాప్సి, అమితాబ్‌ల చుట్టూనే తిరుగుతుంది. ప్రధమార్ధంలోనే అసలు సినిమా ఏంటో చెప్పేశారు. అమితాబ్‌, తాప్సి మధ్య జరిగే సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. సహాయ పాత్రల్లో నటించిన అమృతా సింగ్‌, టోనీ ల్యూక్‌ పాత్రలు కూడా సినిమాకు కీలకం. ఈ కేసును అమితాబ్‌ ఎలా ఛేదించారన్న విషయాలు మాత్రం ద్వితీయార్ధంలో చూపించారు. దాంతో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పాటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రెడ్‌ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తగ్గట్టు నిర్మాణ విలువలు రిచ్‌గానే ఉన్నాయి.

* ఎవరెలా చేశారంటే..
సినిమాకు తాప్సి, అమితాబ్‌ పాత్రలే ప్రాణం. హత్యకేసు తన మెడకు చుట్టుకుందని తెలిసినప్పుడు తాప్సి నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఇక అమితాబ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయవాది పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. నిజంగానే ఓ న్యాయవాది కేసును వాదిస్తున్నట్లు, పరిశోధన చేస్తున్నట్లు ఉంటుంది ఆయన పాత్ర. మిగతావారంతా తమ పాత్రల పరిధి మేర చక్కగానే నటించారు.

బలాలు:
+ అమితాబ్‌, తాప్సి నటన
+ నిర్మాణ విలువలు

బలహీనతలు:
- సాగదీతగా కొన్ని సన్నివేశాలు

* చివరగా..
ఓ యువతి ‘బద్లా’


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.