రివ్యూ: బాట్లా హౌస్‌
రివ్యూ: బాట్లా హౌస్‌
చిత్రం: బాట్లా హౌస్‌
నటీనటులు: జాన్‌ అబ్రహాం, మృణాల్‌ ఠాకూర్‌, నోరా ఫతేహీ, రవి కిషన్‌, సోనమ్‌ అరోరా తదితరులు
దర్శకుడు: నిఖిల్‌ అడ్వాణీ
నిర్మాణ సంస్థ: టీ-సిరీస్‌, ఎమ్మా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జాన్‌ అబ్రహం ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నేపథ్య సంగీతం: జాన్‌ స్టీవర్ట్‌
విడుదల తేదీ: 15-08-2019


దేశ రాజధాని దిల్లీలోని బాట్లా హౌస్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ కేసు ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘బాట్లా హౌస్‌’. 2008 సెప్టెంబరు 18న ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఒక పోలీసు అధికారి సహా ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఈ ఆపరేషన్‌ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కొందరు స్థానికుల్ని కూడా పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని దిల్లీ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిసింది. బూటకపు ఎన్‌కౌంటర్‌ అయితే పోలీసు అధికారి ఎలా చనిపోతారని అధికారులు వివరణ ఇచ్చారు. ఈ కేసులో అధికారులు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ నిజ సంఘటన ఆధారంగా ‘బాట్లా హౌస్’ సినిమాను రూపొందించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? జాన్‌ అబ్రహాం కెరీర్‌లో హిట్‌గా నిలిచిందా?

* కథేంటంటే..
ఏసీపీ సంజయ్‌ కుమార్ (జాన్‌ అబ్రహాం) తన బృందంతో కలిసి దిల్లీలోని బాట్లా హౌస్‌లో ఎన్‌కౌంటర్‌లో పాల్గొంటాడు. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకుని, పారిపోతారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని మీడియా, రాజకీయ నాయకులు, కొందరు కార్యకర్తలు ఆరోపణలు చేస్తారు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి. ఆ తర్వాత ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ కాదని సంజయ్‌ కుమార్‌ నిరూపించగలిగాడా? లేదా?.. అనేది తెరపై చూడాలి.

* ఎలా ఉందంటే..
2008 సెప్టెంబరు 13న వరుస బాంబు దాడులతో దిల్లీ నగరం వణికిపోయింది. ఈ దాడుల్లో 26 మంది మృతి చెందగా, 100 మందికిపైగా గాయపడ్డారు. ఇది జరిగిన వారం రోజులకు నగరంలోని జమియా నగర్‌లోని బాట్లా హౌస్‌పై పోలీసు అధికారులు దాడి జరిపి, ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చారు. వివాదంతో కూడిన ఈ కథతో రూపొందిన ‘బాట్లా హౌస్‌’లో పోలీసు అధికారి సంజయ్‌ కుమార్‌ పాత్రలో జాన్‌ అబ్రహాం చక్కగా సరిపోయారు. దేశభక్తి, నిజాయితీ ఉన్న అధికారిగా ఆకట్టుకుంటారు. దర్శకుడు ఎటువంటి తడబాటు లేకుండా కథను స్పష్టంగా తెరపై చూపించారు. సినిమాలో చోటుచేసుకునే మలుపులు ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురి చేస్తాయి. దీని తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠను కలిగిస్తాయి.

కానీ, రెండో భాగంలో కథలో వేగం తగ్గుతుంది. న్యాయస్థానం చుట్టూ సాగే సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. కోర్టులో చెప్పే కొన్ని డైలాగ్‌లు బాగుంటాయి. నోరా ఫతేహీ ప్రత్యేక గీతం కథకు కాస్త బ్రేక్ ఇస్తుంది, ఆమె నటన నచ్చుతుంది. పాటను మినహా ఇస్తే.. కథ మొత్తం సీరియస్‌ ట్రాక్‌పైనే నడుస్తుంది.

* ఎవరెలా చేశారంటే..
నిబద్ధత కలిగిన పోలీసు అధికారిగా జాన్‌ అబ్రహాం తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇది ఆయన కెరీర్‌లోనే ఓ ఉత్తమ నటన. భార్య నందితా (మృణాల్‌ ఠాకూర్‌) నుంచి మానసికంగా సమస్యలు ఎదురైనా, ఆమెతో బంధం బాధపెడుతున్నప్పటికీ.. సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ కుమార్‌ వర్మగా రవి కిషన్‌, న్యాయవాదిగా రాజేష్‌ శర్మ పాత్రల పరిధి మేరకు నటించారు. నందితా పాత్రను మృణాల్‌ ఠాకూర్ చక్కగా పోషించారు.


బలాలు
+ కథ, కథనం
+జాన్‌ అబ్రహాం నటన
+ డైలాగ్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు

బలహీనతలు
- రెండో భాగంలో నెమ్మదిగా నడిచే కథ

* చివరిగా..
ఉత్కంఠకు గురిచేసే ‘బాట్లా హౌస్‌’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.