రివ్యూ: భారత్‌
రివ్యూ: భారత్‌
నటీనటులు: సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, దిశా పటానీ, సునీల్‌ గ్రోవర్‌, టబు, జాకీ ష్రాఫ్‌ తదితరులు
సంగీతం: విశాల్‌, శేఖర్‌
సినిమాటోగ్రఫీ: మార్సిన్‌ లాస్కావీక్‌
కూర్పు: రామేశ్వర్‌ భగత్‌
నిర్మాణ సంస్థ: రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్స్‌, సల్మాన్‌ ఖాన్‌ ఫిలింస్‌, టీ సిరీస్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అలీ అబ్బాస్‌ జాఫర్‌
విడుదల తేదీ: 05-06-2019


ఈ రోజు రంజాన్‌ పండుగ. రంజాన్‌ అంటే ముస్లింలకే కాదు సల్మాన్‌ ఖాన్‌ అభిమానులకూ పండగే. ఎందుకంటే రంజాన్‌ రోజే సల్లూ భాయ్‌ నటించే సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఈరోజు ఆయన కథానాయకుడిగా నటించిన ‘భారత్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండు ఫ్లాప్‌ చిత్రాల తర్వాత సల్మాన్‌ నటించిన సినిమా ఇది. ఇందులో సల్మాన్‌కు జోడీగా మరోసారి కత్రినా కైఫ్‌ నటించారు. వీరిద్దరి జోడీ చాలు.. అభిమానులు థియేటర్ల వైపు పరుగులు తీయడానికి. కలెక్షన్లు వస్తున్నప్పటికీ సరైన హిట్‌ లేక సతమతమవుతున్న సల్మాన్.. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారా?చూద్దాం.


కథేంటంటే:
భారత దేశం, భారత్‌ (సల్మాన్‌) కలిసి చేసిన ప్రయాణమే ఈ సినిమా కథ. స్వాతంత్య్రం, దేశ విభజన, నిరుద్యోగం, ఎమర్జెన్సీ, ఆర్థిక మాంద్యం.. ఇలా ప్రతి దశనూ దాటుకుంటూ, ప్రతి సవాల్‌నూ ఎదుర్కొంటూ, ప్రతి గాయాన్నీ తట్టుకుంటూ భారత్‌ ఎలా ఎదిగారన్నది ఈ సినిమాలో చూపించారు. అయితే భారత్‌ జీవితంలో కనిపించని ఓ విషాదముంటుంది. బాల్యంలో తండ్రికి (జాకీ ష్రాఫ్‌)కి ఇచ్చిన మాటే అతణ్ని బతికిస్తుంటుంది. ఆ విషాదమేంటి? తండ్రికిచ్చిన మాటను భారత్‌ నిలబెట్టుకున్నాడా? భారత్‌ జీవితంలో కుముద్‌ (కత్రినా కైఫ్‌) పోషించిన పాత్రేంటి? తదితర విషయాలు తెరపై చూడాలి.


ఎలా ఉందంటే
:
‘ఓడ్‌ టు మై ఫాదర్’ అనే కొరియన్‌ సినిమాకు ఇది రీమేక్‌గా వచ్చింది. సినిమాలో భారతీయ హంగులు జోడించి దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ బాగానే తెరకెక్కించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో జరిగిన ముఖ్యమైన విషయాలను చక్కగా ప్రస్తావించారు. సల్మాన్‌ను 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు ఐదు విభిన్నమైన గెటప్స్‌లో చూపించారు కాబట్టి ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్‌ చేస్తారు. సల్మాన్‌ భావోద్వేగపు సంభాషణలు సింపుల్‌గా, షార్ప్‌గా ఉంటాయి. కానీ కొన్ని సీరియస్‌ సందర్భాల్లోనూ కామెడీని జొప్పించాలని చూశారు దర్శకుడు. దాంతో అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో లాజిక్‌ లోపించినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. విశాల్‌, శేఖర్‌ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. కెమెరా టేకింగ్‌ బాగుంది.ఎవరెలా చేశారంటే
:
విభిన్నమైన గెటప్స్‌లో సల్మాన్‌ ఎప్పటిలాగే అదరగొట్టేశారు. వయసుకు తగ్గట్టుగా హావభావాలు పలికించడంలో సఫలమయ్యారు. సల్మాన్‌కు మొదటి ప్రేయసిగా నటించిన దిశా పటానీ తన అందం, డ్యాన్స్‌తో ఆకట్టుకుంటారు. ఇక కత్రినా, సల్మాన్‌ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, డైలాగులు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సల్మాన్‌ స్నేహితుడిగా నటించిన సునీల్‌ గ్రోవర్‌ తన కామెడీతో నవ్వులు పూయించారు. మిగతా వారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.

బలాలు బలహీనతలు
+ కథ, కథనం
+ సల్మాన్‌, కత్రినా కెమిస్ట్రీ
+ డైలాగులు
+ పాటలు
+ నిర్మాణ విలువలు - అక్కడక్కడా మిస్సయిన లాజిక్‌

చివరగా
:
‘భారత్’..ఓ బాధితుడి ప్రయాణం!

గమనిక
:
ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.