రివ్యూ: దబంగ్‌ 3
చిత్రం: దబంగ్‌ 3

నటీనటులు: సల్మాన్‌ ఖాన్‌, సోనాక్షి సిన్హా, సుదీప్‌, సయీ మంజ్రేకర్‌.

దర్శకత్వం : ప్రభుదేవా

నిర్మాతలు: సల్మాన్‌ఖాన్‌, అర్బజ్‌ ఖాన్‌, నిఖిల్‌ దివేది

సంగీతం: సుదీప్‌ శిరోద్కర్‌

విడుదల తేదీ: 20-12-2019


బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ ‘దబంగ్‌’, ‘దబంగ్‌ 2’ చిత్రాల్లో పోలీస్‌ పాత్రలో నటించి ఎందరో యాక్షన్‌ అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన ‘దబంగ్‌’ ప్రాంఛైజీని కొనసాగిస్తూ ‘దబంగ్‌ 3’ చిత్రంలో మరోసారి పోలీస్‌ గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తొలి రెండు సినిమాల్లాగానే ‘దబంగ్‌ 3’ చిత్రంలో యాక్షన్‌, లవ్‌, రొమాన్స్‌, కామెడీ మెండుగా ఉంటాయని చిత్రబృందం ప్రమోషన్స్‌లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘దబంగ్‌’, ‘దబంగ్‌2’ చిత్రాల్లో చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ అలరించారు. అయితే ధాకడ్‌ అనే ఓ సాధారణ యువకుడి నుంచి చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ ఎలా మారాడో తెలియచేసే కథతో ‘దబంగ్‌ 3’ సినిమా తెరకెక్కింది. ఖుషీ ప్రేమను ఎలా దూరం చేసుకున్నాడు? విలన్స్‌పై ఎలా పోరాటం చేశాడు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!

* కథేంటంటే..
చుల్‌బుల్‌ పాండే (సల్మాన్‌ఖాన్‌) ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌. తన భార్య రాజో (సోనాక్షి సిన్హా), సోదరుడు మక్కీ (అర్బజ్‌ఖాన్‌)తో ఎంతో సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సల్మాన్‌ తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసి ఎందరో అమ్మాయిలను రక్షిస్తాడు. ఈ విషయం ధనవంతుడైన బల్లి (సుదీప్‌)కు కోపం తెప్పిస్తుంది. దీంతో సల్మాన్‌ ఖాన్‌ గతం ప్రారంభమవుతుంది. అసలు ఓ సాధారణ యువకుడి నుంచి చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ ఎందుకు మారాడు. తనకి ఖుషీకి (సయీ) మధ్య ఉన్న ప్రేమ. ఎంతగానో ప్రేమించిన ఖుషీ, చుల్‌బుల్‌ పాండేకు ఎందుకు దూరమైంది..? అనే విషయాలు తెలియాలంటే ‘దబంగ్‌ 3’ని చూడాల్సిందే..


* ఎలా ఉందంటే..
‘దబంగ్‌’ ప్రాంఛైజీగా తెరకెక్కడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌లోని సల్మాన్‌ యాక్షన్‌, పాటలు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సల్మాన్‌పై చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్, ఆయన ఎంట్రీ సీన్‌తో పాటు పలు సన్నివేశాలు సల్మాన్‌ అభిమానులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. చుల్‌బుల్‌ పాండేగా ఆయన చెప్పిన డైలాగులు మాస్‌కు నచ్చేలా ఉన్నాయి. ఒక పక్క కథలో ప్రేక్షకుడిని లీనం చేస్తూనే, సల్మాన్‌ఖాన్‌ స్టైల్‌, యాక్షన్‌ను దానికి తగ్గట్టుగా దర్శకుడు చిత్రీకరించిన విధానం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పేలా చేస్తుంది. కొన్ని సన్నివేశాల్లో కామెడీని బలవంతంగా జోడీంచేందుకు దర్శకుడు ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది.

* ఎవరెలా చేశారంటే..
‘దబంగ్‌’, ‘దబంగ్‌ 2’ సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా సల్మాన్‌ యాక్షన్‌ ఆకట్టుకునేలా ఉంది. తనదైన శైలిలో సంభాషణలు చెప్పి అలరించారు ఆయనపై చిత్రీకరించిన షర్ట్‌ లెస్‌ యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ప్రతినాయకుడు బల్లి పాత్రలో సుదీప్‌ నటన చాలా బాగుంది. సల్మాన్‌ యాక్షన్‌ తగ్గట్టుగా సుదీప్‌ నటన ప్రేక్షకులను అలరించేలా ఉంది. సల్మాన్‌ భార్య రాజీ పాత్రలో కనిపించిన సోనాక్షిసిన్హా పాత్ర పరిధి మేరకు నటించారు. ఇంతకుముందు వచ్చిన ‘దబంగ్‌’, ‘దబంగ్‌ 2’ సినిమాల్లో పూర్తి స్థాయిలో ఆకట్టుకున్న సోనాక్షి ఈ సినిమాలో ఆమె పాత్ర అంత కీలకంగా లేదనే చెప్పొచ్చు. సల్మాన్‌ ప్రియురాలు ఖుషీ పాత్రలో సయీ మెప్పించారు. పాత్ర పరిధి మేరకు ఆమె అలరించారు. కాకపోతే కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఇంకా బాగా నటించి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ‘మున్నీ బాద్నామ్‌ హూయీ’ పాటతో పాటు టైటిల్‌ సాంగ్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా అలరించింది.

బలాలు
+ సల్మాన్‌

+ యాక్షన్‌ సన్నివేశాలు

+ సుదీప్‌

బలహీనతలు
- అతికి అతకని కామెడీ సన్నివేశాలు
- నెమ్మదించిన కథనం

* చివరిగా..
అన్నీ రుచులు ఉన్న ఓ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.