రివ్యూ: దే దే ప్యార్‌ దే
నటీనటులు: అజయ్‌ దేవగణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, టబు, జావేద్‌ జఫ్రే, జిమ్మీ షేర్గిల్‌, అలోక్‌నాథ్‌ తదితరులు
సంగీతం: అమాల్‌ మాలిక్‌
సినిమాటోగ్రాఫీ: సుధీర్‌ కే చౌదరి
కూర్పు: అకీవ్‌ అలీ
కథ: లవ్‌ రంజన్‌
నిర్మాణ సంస్థ: లవ్‌ ఫిలింస్‌, టీ సిరీస్‌
స్క్రీన్‌ ప్లే: లవ్‌ రంజన్‌, తరుణ్‌ జైన్‌, సురభి భట్నాగర్‌
దర్శకత్వం: అకీవ్‌ అలీ
విడుదల తేదీ: 17-05-2019


గతేడాది ‘టోటల్‌ ధమాల్‌’ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు అజయ్‌ దేవగణ్‌. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘దే దే ప్యార్‌ దే’ చిత్రంతో ప్రేక్షకలు ముందుకు వచ్చారు. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, టబు కథానాయికలు. ఎడిటర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన అకివ్‌ అలీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విడుదలకు నెల రోజుల ముందు ఈ సినిమా వివాదాల్లో చిక్కకుంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్‌ నటుడు అలోక్‌నాథ్‌ ఈ సినిమాలో ఓ పాత్రలో నటించడమే ఇందుకు కారణం. దీనిపై గతంలో పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. మరి శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో చూద్దాం.

కథేంటంటే:
ఆశిష్‌ మెహ్రా (అజయ్‌ దేవగణ్‌) తన భార్య మంజు (టబు)తో 18 ఏళ్ల క్రితమే విడిపోయి వేరుగా ఉంటాడు. అతనికి పాతికేళ్ల వయసుండే కూతురు, 20 ఏళ్ల ఓ కుమారుడు ఉంటారు. ఇప్పుడు తన కూతురు వయసుండే అయేషా ఖురానా (రకుల్‌)ను ఇష్టపడతాడు ఆశిష్‌. ఆమెను తన కుటుంబానికి పరిచయం చేసేందుకు ఇంటికి తీసుకొస్తాడు. అయితే తన మాజీ భార్య, పిల్లలు అయేషాను అస్సలు అంగీకరించరు. వారి నుంచి ఆశిష్‌కు చేదు అనుభవాలు ఎదురవుతాయి. కానీ అయేషాను పెళ్లి చేసుకోవాలంటే వాళ్లందరినీ ఒప్పించాల్సిన పరిస్థితి. దానికోసం ఆశిష్‌ ఏం చేశాడు? అటు ప్రియురాలు ఇటు మాజీ భార్య మధ్య ఎలా నలిగిపోయాడు? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.


ఎలా ఉందంటే:
దర్శకుడు అకీవ్‌ అలీ కథలోకి తీసుకెళ్లడంతోనే లాజిక్‌ మిస్సయ్యారు. ఓ బ్యాచిలర్స్‌ పార్టీకి వెళ్లిన అయేషా తాగి చిందులేస్తూ కాబోయే పెళ్లికొడుకుని టార్గెట్‌ చేయాలని చూస్తుంది. అసలు ఆ పార్టీలోని వ్యక్తులకు, అయేషాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయం తెలిసి కాబోయే వధువు ఆమెతో గొడవపడుతుంది. ఆ తర్వాత అయేషా తాను గొడవపడిన అమ్మాయి పెళ్లిలోనే ఆశిష్‌ని కలవడం అతనితో కలిసి డ్యాన్స్‌ చేసే సన్నివేశాలతో ప్రధమార్ధం మొదలవుతుంది. ఇదంతా కేవలం ఐదు నిమిషాల్లోనే జరిగిపోతుంది. ఈ సన్నివేశం ప్రేక్షకుడికి అంతగా మింగుడు పడదు. కథలాగే స్క్రీన్‌ప్లే కూడా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. పాటలు, నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఎవరెలా చేశారంటే:
ఇందులో 50 ఏళ్ల వ్యక్తి పాత్రలో అజయ్‌ దేవగణ్‌ హ్యాండ్సమ్‌గా కనిపించారు. తనకంటే సగం వయసు చిన్నదైన రకుల్‌తో ప్రేమలో పడే సన్నివేశాల్లో కూడా అజయ్‌ ఆకట్టుకుంటారు. రకుల్‌ గ్లామర్‌ డోస్‌ పెంచినట్లు అనిపిస్తుంది. ఎప్పటిలాగే టబు తన ఎవర్‌గ్రీన్‌ నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా మొత్తాన్ని టబు, జిమ్మీ షేర్గిల్‌ పాత్రలు మాత్రమే నడిపించాయని చెప్పొచ్చు. టబు కంటే అజయ్‌, రకుల్‌ల పాత్రలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. కానీ రకుల్‌ పాత్ర గురించి చెప్పుకోదగ్గ అంశమేమీ కనిపించదు. ఇందుకు కారణం ఆమె పాత్రను బలంగా తీర్చిదిద్దకపోవడమే. తెరపై కాసేపు కనిపించినప్పటికీ టబు తన పాత్రతో మెప్పిస్తారు. టబుని ఇష్టపడే వ్యక్తిగా జిమ్మీ షేర్గిల్‌ నవ్వులు పండించారు. మిగతావారంతా తమ పాత్రల పరిధి మేర నటించారు.బలాలు 
+ అజయ్‌, టబు
+ సంగీతం
+ నిర్మాణ విలువలు
+ కామెడీ - కథ, స్క్రీన్‌ప్లే

బలహీనతలు
- లాజిక్‌ లేని సన్నివేశాలు
చివరగా: ‘దే దే ప్యార్‌ దే’.. కాసేపు నవ్వుకోవచ్చు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.