రివ్యూ: ఛపాక్‌

చిత్రం
: ఛపాక్‌
నటీనటులు: దీపిక పదుకొణె, విక్రాంత్‌ మస్సీ, మధురజీత్‌ సర్గి, అంకిత్‌ బిషత్‌ తదితరులు
సంగీతం: శంకర్‌-ఎహెషాన్‌-లాయ్‌
సినిమాటోగ్రఫీ: మాలే ప్రకాష్‌
ఎడిటింగ్‌: నితిన్‌ బైదీ
నిర్మాత: దీపిక పదుకొణె, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, గోవింద సింగ్‌ సంధు, మేఘనా గుల్జర్‌
దర్శకత్వం: మేఘనా గుల్జర్‌
బ్యానర్‌: ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌, కేఏ ప్రొడక్షన్స్‌, మిర్గా ఫిల్మ్స్‌
విడుదల తేదీ
: 10-01-2020

గత కొంతకాలంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. అగ్ర కథానాయకుల నుంచి యువ కథానాయకుల వరకూ ఈ జోనర్‌లో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు కథానాయికలు అదే బాటలో పయనిస్తున్నారు. ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలతో పాటు ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’లాంటి చారిత్రక కథా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించి మెప్పించింది దీపిక పదుకొణె. ఇప్పుడు యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛపాక్‌’లో ప్రధాన పాత్ర పోషించింది. మేఘనా గుల్జర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉంది? యాసిడి దాడి బాధితురాలిగా దీపిక ఎలా నటించింది?

కథేంటంటే:
‘మాలతి‘(దీపికా పదుకొణె) అందరు యువతుల్లాగానే తనకూ కొన్ని కలలు ఉంటాయి. జీవితంలో గాయని కావాలని అనుకుంటుంది. తన కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలని తపిస్తుంటుంది. చదువుతో హాయిగా, ఆనందంగా సాగిపోతున్న మాలతిపై యాసిడ్‌ దాడి జరుగుతుంది. అంతే, అప్పటి వరకూ ఆమె కన్న కలలు ఆవిరవుతాయి. ఫలితంగా ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. జీవితంలో తీవ్ర నిరాశతో ఉన్న మాలతికి అమోల్ (విక్రాంత్ మెస్సీ) అనే విలేకరి పరిచయం అవుతాడు. ఆమె అమోల్ అనే ఒక స్వచ్ఛంద నిర్వహిస్తుంటాడు. యాసిడ్ బాధితులకు చికిత్సనందిస్తూ, సాయం చేస్తుంటాడు. ఈ సంస్థలో చేరిన మాలతి.. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం ప్రారంభిస్తుంది. మాలతికి చేస్తున్న న్యాయ పోరాటంలో ఆమెకు ప్రజల నుంచి కూడా సహకారం లభిస్తుంది. తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో మాలతి వెల్లడిస్తుంది. అసలు మాలతిపై యాసిడ్‌ దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? మాలతి ఏవిధంగా న్యాయ పోరాటం చేసింది? చివరకు యాసిడ్‌ దాడి నుంచి కోలుకుని జీవితంలో విజయంవైపు ఎలా అడుగులు వేసిందన్నది తెరపై చూడాలి.


ఎలా ఉందంటే:
ఇది ఒక బయోపిక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా మేఘనా గుల్జర్‌ దీనిని తెరకెక్కించారు. ముఖ్యంగా మహిళా శక్తిని, స్ఫూర్తిని ఇతర మహిళల్లో నింపే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. దిల్లీ గ్యాంగ్‌ రేప్‌ను నిరసిస్తూ యువత ఆందోళన చేస్తున్న సీన్‌తో ఈ సినిమాను ప్రారంభమవుతుంది. దేశంలో మహిళల రక్షణను ప్రశ్నిస్తూ నెమ్మదిగా యాసిడ్‌ దాడి బాధితురాలి కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది దర్శకురాలు.. ఒక అందమైన అమ్మాయి.. అందమైన జీవితం.. అలాంటి అమ్మాయిపై యాసిడ్‌ దాడి జరిగితే ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. ప్రథమార్ధంలో యాసిడ్‌ దాడి, ఆ తర్వాత ఘటనలను వరుసగా చూపించిన దర్శకురాలు.. యాసిడి దాడులపై మాలతి చేసే పోరాటానికి ద్వితీయార్ధంలో పెద్దపీట వేశారు.


యాసిడ్‌ దాడి తర్వాత ఆ బాధితులు ఎలాంటి నరకం అనుభవిస్తారు? సమాజంలో వాళ్లకి ఎదురయ్యే పరిస్థితులు.. ఇవన్నీ తెరపై చూస్తుంటే సగటు ప్రేక్షకుడికి కన్నీళ్లు ఆగవు. ఉద్యోగం కోసం మాలతి చేసే ప్రయత్నం అక్కడ ఎదురయ్యే అవమానాలు.. సమాజంలో తోటి వారి నుంచి ఎదురయ్యే ఈసడింపులు ఇవన్నీ భావోద్వేగాన్ని కలిగిస్తాయి. యాసిడ్‌ దాడికి గురైన బాధితులు ఎలా న్యాయం పొందాలి? న్యాయపరంగా ఎలా ముందుకు సాగాలన్న అంశాలను ఇందులో చక్కగా చూపించారు. అయితే, సన్నివేశాలన్నీ యాసిడ్‌దాడి, న్యాయ పోరాటం వీటి చుట్టూనే తిరగడంతో ద్వితీయార్ధంలో సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే:
ఈ సినిమా మొత్తాన్ని దీపిక పదుకొణె తన భుజాలపై వేసుకుని మోసింది. దీపిక అందానికి ఫిదా కాని అభిమానులు ఎవరూ లేరు. అలాంటి దీపికను యాసిడ్‌ దాడి బాధితురాలిగా తెరపై చూడటం సగటు అభిమాని జీర్ణించుకోలేడు. కానీ, దీపిక నటన అది పెద్ద విషయంగా అనిపించలేదు. ముఖ్యంగా దాడి అనంతరం తొలిసారి అద్దంలో తన ముఖం చూసుకునే సన్నివేశం మనతోనూ కన్నీళ్లు పెట్టిస్తుంది. దాడి జరిగినా, ఆత్మ విశ్వాసం చెదరని యువతి మాలతి పాత్రలో దీపిక జీవించింది. ఇక యాసిడ్‌ దాడి బాధితురాలిగా ఆమె మేకప్‌ కోసం ఎంత కష్టపడిందీ మనం తెరపై చూడవచ్చు. మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి వరకూ దీపికనే కనిపిస్తుంది. ‘వాడు నా ముఖాన్ని మార్చేశాడు... నా మనసును మార్చలేదు’ అన్న డైలాగ్‌ ‘ఛపాక్’ సినిమా పూర్తయ్యే వరకూ ప్రేక్షకుల హృదయాన్ని తాకుతూనే ఉంటుంది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. లక్ష్మీ అగర్వాల్‌ జీవితాన్ని ఆధారంగా సినిమాను తెరకెక్కించడంలో దర్శకురాలు మేఘనా గుల్జర్‌ సఫలమయ్యారు. ఏమాత్రం తేడా వచ్చిన సినిమా డ్యాకుమెంటరీ అయిపోయేది. అదే సమయంలో కమర్షియల్‌ హంగుల జోలికి పోలేదు. తాము చెప్పాలనుకున్నది 123 నిమిషాల్లో చెప్పేశారు. అయితే, కథనాన్ని పరుగులు పెట్టించలేకపోయారు. సాంకేతికంగా అన్ని విభాగాలు బాగా పనిచేశాయి. శంకర్‌-ఎహెసాన్‌-లాయ్‌ నేపథ్య సంగీతం సినిమాలకు బలాన్నిచ్చింది. మాలే ప్రకాష్‌ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది.


బలాలు
+ దీపిక పదుకొణె
+ ఎమోషనల్‌ సన్నివేశాలు
+ సందేశం

బలహీనతలు

- ద్వితీయార్ధం సాగదీత

చివరిగా: యాసిడ్‌ దాడులపై సందేశాన్ని ఇచ్చే ‘ఛపాక్‌’!


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.