చిత్రం: దిల్ బెచరా
నటీనటులు: సుశాంత్ సింగ్ రాజ్‌పూత్, సంజనా సంఘీ, సైఫ్ అలీ ఖాన్, షాహిల్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: సేతు
ఎడిటింగ్: ఆరిఫ్ షేక్
నిర్మాణ సంస్థ: ఫాక్స్ స్టార్ స్టూడియోస్
స్క్రీన్‌ప్లే: శశాంక్ ఖైతాన్,సుప్రోటిమ్ సేన్‌గుప్తా
దర్శకత్వం: ముఖేశ్ చబ్రా
విడుదల: డిస్నీ+ హాట్‌స్టార్
అనతికాలంలోనే నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్. ఉవ్వెత్తున ఎగసి పడిన కెరటంలా ఆయన సినీ, జీవిత ప్రస్థానం ముగిసిపోయింది. ఉత్సాహవంతుడైన ఒక యువ నటుడిని చిత్ర పరిశ్రమ కోల్పోయింది. కారణమేదైనా సుశాంత్ తీసుకున్న నిర్ణయం అందరినీ కలచి వేసింది. ముఖేశ్ చబ్రా దర్శకత్వంలో సుశాంత్ నటించిన చిత్రం ‘దిల్ బెచరా’. జాన్ గ్రీన్ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. దీంతో డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు. మరి సుశాంత్ నటించిన చివరి చిత్రం ఎలా ఉంది? ఉషారైన తన నటనతో ప్రేక్షకులను అలరించారా? సుశాంత్ బతికి ఉంటే ఆయన కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రం అయ్యేదా?
కథేంటంటే:
కిజి బసు(సంజనా సంఘీ) థైరాయిడ్ క్యాన్సర్స్‌తో బాధపడుతుంటుంది. ఎప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ వెంట ఉండాల్సిందే. చుట్టుపక్కల ఎవరు చనిపోయినా వారి కుటుంబాలను పరామర్శిస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు తానూ చనిపోతానని అందుకే వారి బాధను పంచుకుంటుటానని చెబుతుంటుంది. అదే సమయంలో ఇమ్మాన్యుయేల్ రాజ్ కుమార్ జూనియర్ అలియాస్ మ్యానీ (సుశాంత్ సింగ్ రాజ్‌పూత్)తో పరిచయం ఏర్పడుతుంది. మ్యానీ కూడా గతంలో ఓస్టియోసర్కోమాతో బాధపడి చికిత్స పొందుతాడు. తొలుత మ్యానీకి దూరంగా ఉన్న కిజి ఆ తర్వాత ఇద్దరి అభిరుచులు కలవడంతో దగ్గరవుతారు. వారి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. అదే సమయంలో కిజి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. చనిపోయేలోపు పారిస్ నగరాన్ని ఒక్కసారైనా చూడాలన్న ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఇద్దరూ అక్కడకు వెళ్తారు. పారిస్ వెళ్లిన కిజి, మ్యానీలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. చివరికి వారి కోరిక తీరిందా? చివరి క్షణాలను ఎలా గడిపారు అన్నదే మిగిలిన కథ.
ఎలా ఉందంటే:
జీవితం చాలా చిన్నది. ఎప్పుడు పుడతామో.. ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కానీ కొందరికి మాత్రం మరణం గురించి ముందే తెలిసిపోతుంది. అలాంటి వ్యక్తులు బాధతో కుంగిపోకుండా చివరి క్షణాలను ఎలా ఆస్వాదించాలి? అన్న అంశంపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. నాటి ‘దేవదాసు’ నుంచి నేటి ‘ఆర్ఎక్స్ 100’ వరకూ విషాద ప్రేమ కథలది ఒక్కో తీరు. కేవలం టాలీవుడ్‌లోనూ కాదు బాలీవుడ్‌లోనూ ఈ కథలకు కొదవ లేదు. అయితే, కథ తెలిసినదే అయినా, ఎంత హృద్యంగా తీర్చిదిద్దామన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ‘దిల్ బెచరా’ దర్శకుడు ముఖేశ్ సులువైన దారిని ఎంచుకున్నాడు. జాన్ గ్రీన్ రాసిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు. అయితే, నవలలోని ఆత్మను తీసుకుని, నేటి యువతకు అనుగుణంగా కథ, కథనాలను తీర్చిదిద్దుకోవాల్సిన ముఖేశ్ ఆ పని చేయకుండా చాలా సన్నివేశాలను నవలలో ఉన్నట్లే తెరకెక్కించాడు.

ప్రథమార్ధమంతా కిజి-మ్యానీల మధ్య పరిచయం, స్నేహం.. అది ప్రేమగా మారడం తదితర సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. ఈ క్రమంలో కిజి చివరి కోరికలు మ్యానీకి తెలియడం వాటిని నెరవేర్చేందుకు అతడు చేసే ప్రయత్నాలు ప్రేక్షకుడికి చక్కని ఫీల్‌ని పంచుతాయి. కిజి చివరి కోరికల్లో ఒకటి అభిమన్యు వేద్ అనే సంగీత కళాకారుడిని కలవడం. అతడిని కలిసిన సమయంలో భౌతిక ప్రపంచంలోని విషయాలను మర్చిపోయి, కిజి పడే సంతోషం వెలకట్టలేదనిగా దర్శకుడు చూపించాడు. తనకు మరణం సమీపిస్తోందన్న విషయాన్ని కూడా కిజీ ఆ సమయంలో మర్చిపోతుంది. ఇలా ప్రతి సన్నివేశం ఒక్కో రకమైన భావోద్వేగాన్ని ఇస్తుంది. అదే సమయంలో నవలలో బాగున్నాయని అనిపించిన కొన్ని సన్నివేశాలు వెండితెరపైకి వచ్చే సరికి అంతగా అతకలేదు. వాటిని కూడా ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే:
ఈ సినిమాను ప్రేక్షకులు సుశాంత్ కోసమే చూస్తారు. ఈ విషయంలో సుశాంత్ అందరి హృదయాలను దోచుకుంటాడు. ఇందులో మ్యానీ పాత్ర బలమైనది. ఆ పాత్రను తన హుషారైన నటనతో అద్భుతంగా రక్తికట్టించాడు సుశాంత్. ప్రతి ఫ్రేమ్‌లోనూ హుషారుగా కనిపించాడు. నవలలోని పాత్రకు సుశాంత్ తన నటనతో స్క్రీన్‌పై జీవం పోశాడు. సుశాంత్ మాత్రమే ఇలాంటి పాత్రలు చేయగలడన్న వాటిలో ఇదీ ఒకటి. సంజనా సంఘీకి ఇదే తొలి చిత్రం. ప్రతి సన్నివేశంలోనూ బలమైన ముద్రవేసింది. ఇక ఇందులో మరో ప్రత్యేకమైన పాత్ర సైఫ్ అలీ ఖాన్. అతిథి పాత్రలో ఆయన మెప్పించారు. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు.

ఏఆర్ రెహమాన్ వంటి గొప్ప సంగీత దర్శకుడిని చిత్ర బృందం సరిగ్గా ఉపయోగించుకోలేదు. పాటలు పర్వాలేదనిపిస్తాయంతే. సేతు సినిమాటోగ్రఫీ బాగుంది. కిజి-మ్యానీల మధ్య వచ్చేసన్నివేశాలను చక్కగా చూపించాడు. సినిమా నిడివి చాలా తక్కువ. దర్శకుడు ముఖేశ్ చబ్రా బలమైన భావోద్వేగాలు కలిగిన చిత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో అక్కడక్కడా తడబడినా, భావోద్వేగ సన్నివేశాలు మాత్రం మనతోనూ కంటతడి పెట్టాయి. సప్రోటిమ్ సేన్ గుప్తా, శశాంక్ ఖైతాన్‌లతో కలిసి ఆయన రాసుకున్న స్క్రిప్ట్ బాగానే ఉంది. అయితే, చాలా సన్నివేశాలు నవలలో ఉన్న విధంగా యథాతథంగా తీర్చిదిద్దడమే ఇబ్బందికరంగా అనిపిస్తుంది.
బలాలు
+ సుశాంత్ సింగ్ రాజ్‌పూత్
+ ప్రథమార్ధం
+ భావోద్వేగ సన్నివేశాలు
బలహీనతలు
- నవలను యథాతథంగా తీయడం
- ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
చివరిగా: సుశాంత్ చివరిసారి నటన కోసం ‘దిల్ బెచరా’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!