రివ్యూ: డ్రీమ్‌గర్ల్‌
చిత్రం: ‘డ్రీమ్‌గర్ల్‌’
నటీనటులు: ఆయుష్మాన్‌ ఖురానా, అన్నూ కపూర్‌, నుష్రత్ బరూచా, మన్‌జోత్‌ సింగ్‌, విజయ్‌ రాజ్‌ తదితరులు
దర్శకత్వం: రాజ్‌ శాండిల్యా
నిర్మాతలు: ఏక్తా కపూర్‌, శోభా కపూర్‌
విడుదల తేదీ: 13-09-2019


హీరోలు చీర కట్టి అమ్మాయిలా మారడం కొత్తేం కాదు. ఇలాంటి కథాంశాలతో ఇప్పటికే అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి... ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాయి. ఇప్పుడు ఇలాంటి తరహా కథతోనే హిందీలో వినోదాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘డ్రీమ్‌గర్ల్‌’. కంటెంట్‌ ఉన్న కథలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయుష్మాన్‌ ఖురానా నటించిన సినిమా ఇది. ‘ఆర్టికల్‌ 15’ తర్వాత ఆయన ఇందులో నటించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అలరించగలిగిందా?, ఆయుష్మాన్‌ కెరీర్‌లో మరో హిట్‌గా నిలిచిందా?
* కథేంటంటే..
కరణ్‌ (ఆయుష్మాన్‌ ఖురానా) స్థానికంగా నిర్వహించే మహాభారతం, రామాయణం నాటకాల్లో రాధ, సీత పాత్రల్ని పోషిస్తుంటాడు. మహిళ గొంతుతో మాట్లాడటం అతడి ప్రత్యేకత. ఆయనలోని ఈ ప్రత్యేకతే అనేక ఇబ్బందుల్లోకి నెడుతుంది. కరణ్‌ తండ్రి జగ్జిత్ (అన్నూ కపూర్) ఓ దుకాణాన్ని నడుపుతుంటాడు. కుమారుడు నాటకాలు వేయడం జగ్జిత్‌కు ఇష్టం ఉండదు. చివరికి తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి ఉద్యోగం వెతుక్కుంటాడు కరణ్‌. అలా చిన్న ఎలక్ట్రానిక్‌ స్టోర్‌లో ఉద్యోగం సంపాదిస్తాడు. యజమాని (రాజేష్‌ శర్మ) రహస్యంగా కాల్‌ సెంటర్‌ను నడుపుతుంటాడు. ఈ కాల్‌ సెంటర్‌లో కరణ్‌.. పూజ అనే అమ్మాయిగా గొంతు మార్చి మగవారికి ఫోన్‌కాల్స్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో కరణ్‌కు కథానాయిక మహీ (నుష్రత్ బరూచా) పరిచయమవుతుంది. కానీ ఆమె సోదరుడు మహేంద్ర (అభిషేక్‌ శర్మ) పూజతో ప్రేమలో పడతాడు. అదే కథలో మొదటి ట్విస్ట్‌. అలాగే రాజ్‌పాల్‌ (విజయ్‌ రాజ్‌) అనే కానిస్టేబుల్‌ కూడా పూజను ప్రేమిస్తాడు. రోమా (నిధి బిస్త్‌), టోటో (రాజ్‌ భన్సాలీ) అనే ఇద్దరు యువకులు కూడా ఆమెను ఇష్టపడతారు. పూజను కలవాలని, ఆమెను పెళ్లి చేసుకోవాలని వీరంతా వెతకటం మొదలుపెడతారు. దీంతో కరణ్‌కు తిప్పలు మొదలవుతాయి. వీటిని కరణ్‌ ఎలా అధిగమించాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


* ఎలా ఉందంటే..
వాణిజ్య విలువలకు పెద్ద పీట వేయకుండా కంటెంట్‌కు మాత్రమే విలువిచ్చే ఆయుష్మాన్‌ నటించిన సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి. అలాంటి కథల్లో ప్రాణం పెట్టి నటించి మెప్పిస్తుంటాడు. ఎప్పటిలాగే ఆయన మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు కథను స్క్రీన్‌పైకి వినోదాత్మకంగా చూపించి, కడుపుబ్బా నవ్వించారు. కుటుంబమంతా కలిసి చూసేలా చిత్రాన్ని రూపొందించారు. స్క్రీన్‌ప్లే నచ్చుతుంది. కానీ కొన్ని సన్నివేశాలు పునరావృతమైనట్లు అనిపిస్తుంది. చూపించిందే మళ్లీ చూపించడంతో ప్రేక్షకులు కాస్త విసుగు చెందుతారు.
* ఎవరెలాచేశారు..
ఆయుష్మాన్‌.. కరణ్‌, పూజ పాత్రల్లో ఒదిగిపోయాడు. ఫోన్‌లో పూజగా మగవారితో ఆయన మాట్లాడిన తీరు నవ్వులు పూయిస్తుంది. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఓ విధంగా సినిమా ఆయన భుజాలపైనే నడిచిందనడంలో ఆశ్చర్యం లేదు. మిగిలిన నటీనటులూ పోటాపోటీగా నటించి, మెప్పించారు. దర్శకుడిగా రాజ్‌ శాండిల్యా తీసిన తొలి సినిమా ఇదే అయినప్పటికీ.. అనుకున్న కథను స్పష్టంగా తెరపై చూపించారు. దర్శకత్వంపరంగా మంచి మార్కులు అందుకున్నారు. నిర్మాన్ డి సింగ్‌ రచన ఆకట్టుకుంటుంది. మనసునుతాకే ఓ చక్కటి సందేశంతో సినిమా ముగుస్తుంది.


+ బలాలు
* ఆయుష్మాన్‌ నటన
* కథ, కథనం
* వినోదం పండించిన విధానం

- బలహీనతలు
* కొన్ని సీన్లు పునరావృతమవ్వడం

* చివరిగా: ‘డ్రీమ్‌ గర్ల్‌’ బాగా నవ్విస్తుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.