రివ్యూ: ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా
రివ్యూ: ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా
సినిమా పేరు: ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా (హిందీ)
నటీనటులు: సోనమ్‌ కపూర్‌, అనిల్‌ కపూర్‌, రెజీనా, జూహీ చావ్లా, రాజ్‌కుమార్ ‌రావు, అక్షయ్‌ ఒబెరాయ్‌ తదితరులు
సంగీతం: రోచక్‌ కోహ్లీ
సినిమాటోగ్రఫీ: హిమన్‌ ధమీజా, రంగరాజన్‌ రాంభద్రన్‌
కూర్పు: ఆశిష్‌ సూర్యవంశీ
నిర్మాణ సంస్థ: వినోద్‌ చోప్రా ఫిలింస్‌
కథ: గజల్‌ ధలివాల్‌, షెల్లీ చోప్రా ధర్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: షెల్లీ చోప్రా ధర్‌
విడుదల తేదీ: 01-02-2019


‘నీర్జా’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపికచేసుకుంటున్నారు. ఆమె నటించిన ‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రం కూడా ఊహించని స్థాయిలో మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ‘ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ చిత్రంలో కథానాయికగా నటించారు. అనిల్‌ కపూర్‌ నటించిన ‘1942: ఎ లవ్‌స్టోరీ’ సినిమాలోని పాటే టైటిల్‌ కావడం, సినిమాలో అనిల్‌, సోనమ్‌ రీల్‌ లైఫ్‌ తండ్రీ కూతుళ్ల పాత్రల్లో నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.


* కథేంటంటే..
స్వీటీ (సోనమ్‌ కపూర్‌) పెద్దయ్యాక ఓ వేడుకలా తన పెళ్లి జరగాలని ఊహించుకుంటున్న సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. చూస్తుండగానే స్వీటీకి పెళ్లీడు వస్తుంది. ఈ నేపథ్యంలో బల్బీర్‌ చౌదరి (అనిల్‌ కపూర్) కుమారుడు (అక్షయ్‌ ఒబెరాయ్‌) స్వీటీకి త్వరగా పెళ్లిచేసేద్దామని ప్రస్తావన తెస్తాడు. ఇందుకు ఇంట్లో వారంతా ఒప్పుకొంటారు. కానీ పెళ్లి గురించి స్వీటీ అభిప్రాయం మాత్రం ఎవ్వరూ తెలుసుకునేందుకు ప్రయత్నించరు. ఓ రోజు స్వీటీని షహీల్‌ మీర్జా (రాజ్‌కుమార్‌ రావు) అనే వ్యక్తి కలుస్తాడు. స్వీటీ షహీల్‌పై ఇష్టం పెంచుకుంటుంది. వీరి ప్రేమకు ఇంట్లో వారు ఒప్పుకోవడంతో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. ఇంతలో తనలోనే దాచుకున్న నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటుంది స్వీటీ. కానీ సమాజం, ఇంట్లోవారు ఏమనుకుంటారోనని కేవలం తాను ఇష్టపడిన షహీల్‌తోనే ఆ రహస్యాన్ని చెబుతుంది. ఇంతకీ ఏంటా రహస్యం? షహీల్‌కి మాత్రమే ఎందుకు చెప్పాలనుకుంది? షహీల్‌, స్వీటీల పెళ్లి జరిగిందా? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.

* ఎలా ఉందంటే..
స్వలింగ సంపర్కం అనే అంశంతో ఈ సినిమా కథను రాసుకున్నారు దర్శకురాలు షెల్లీ చోప్రా. సోనమ్‌ కపూర్‌లాంటి నటి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడం సాహసమనే చెప్పాలి. సినిమా మొదలైనప్పటి నుంచి వచ్చే ప్రతి సన్నివేశం ఆలోచింపజేసేలా ఉంటుంది. ప్రధమార్ధంలో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ద్వితీయార్ధంలోనే అసలు కథ ఉంటుంది. సినిమాలో రాజ్‌కుమార్‌ రావు, సోనమ్‌ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. జూహీ చావ్లా, అనిల్‌ కపూర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. పాటలు మరింత ఆకట్టుకుంటాయి.

* ఎవరెలా చేశారంటే..
సినిమాలో అనిల్‌, సోనమ్‌ల పాత్రలే కీలకం. సోనమ్‌ అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. అనిల్‌ కపూర్‌ ఎప్పటిలాగే తన హాస్యచతురతతో నవ్విస్తూనే.. భావోద్వేగపు సన్నివేశాల్లో నటనతో అదరగొట్టేశారు. జూహీ చావ్లా కూడా తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. రాజ్‌కుమార్‌ రావు పాత్ర చాలా సహజంగా ఉంటుంది. రెజీనాది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినా సినిమాకు కీలకం. మిగతా వారంతా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.


బలాలు:

+ సోనమ్‌, అనిల్‌, రాజ్‌కుమార్‌ రావు నటన
+ పాటలు
+ నిర్మాణ విలువలు
+ కాన్సెప్ట్‌

బలహీనతలు:
- ప్రధమార్ధంలో సాగదీతగా అనిపించే సన్నివేశాలు

* చివరగా..
ఓ ‘లడ్కీ’ వింత లవ్‌స్టోరీ..!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.