రివ్యూ: ఫిరంగి
article imageనటీనటులు: కపిల్‌శర్మ.. ఇషిత దత్తా.. మోనికా గిల్‌.. ఎడ్వర్డ్‌ సోనీబ్లిక్‌.. కౌముద్‌ మిశ్రా తదితరులు
సంగీతం: జతీందర్‌ షా
సినిమాటోగ్రఫీ: నవనీత్‌ మిస్సర్‌
ఎడిటింగ్‌: ఓంకార్‌నాథ్‌ బక్రీ
నిర్మాత: కపిల్‌శర్మ
కథ, దర్శకత్వం: రాజీవ్‌ దింగ్రా
విడుదల తేదీ: 01-12-2017

కపిల్‌శర్మ.. హిందీలో ప్రసారమయ్యే ఓ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. అంతేకాదు ఏ కమెడీయన్‌కు లేనంత క్రేజ్‌.. హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో 2015 ‘కిస్‌ కిస్కో ప్యార్‌ కరూ’ చిత్రంతో బుల్లితెర నుంచి బాలీవుడ్‌ వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ.. కపిల్‌కు ఆ సినిమా నిరాశ మిగిల్చింది. సినిమా పెద్దగా ఆడకపోవడంతో కొన్నాళ్లు సినిమా జోలికి పోలేదు. అయితే తాజాగా మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ‘ఫిరంగి’లా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారైనా కపిల్‌ హిట్‌ కొడతాడా? హీరోగా నిలబడతాడా?

కథేంటంటే: బ్రిటీష్‌వాళ్లు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి. పంజాబ్‌లోని ఓ గ్రామంలో మాంగత్‌రామ్‌(కపిల్‌శర్మ) ఉద్యోగం చేయకుండా బలాదూర్‌గా తిరుగుతుంటాడు. అయితే ఆ గ్రామంలో ఎవరైనా వెన్ను నొప్పితో బాధపడితే మాంగ తన కాలుతో తన్నగానే నయమవుతుంది. ఈ విషయం స్థానిక బిట్రిష్‌ అధికారి మార్క్‌ డానియల్‌(ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లింక్‌)కు తెలుస్తుంది. అతడికి కూడా వెన్ను నొప్పి ఉండటంతో మాంగను తన వద్దకు పిలిపించుకొని కాలితో తన్నించుకోగానే నొప్పి నయమవుతుంది. ప్రతిఫలంగా మార్క్‌.. మాంగకు ఉద్యోగం ఇప్పిస్తాడు. దీంతో మాంగ సంతోషపడిపోతాడు. మార్క్‌ అతడిని ఆదరించడం చూసి బ్రిటీష్‌ వాళ్లు మంచి వారేనని భావిస్తాడు. మరోవైపు గ్రామంలో ఉండే సర్గి(ఇషితా దత్‌)తో మాంగ ప్రేమలో పడతాడు. కానీ, సర్గి తండ్రి వీరి ప్రేమను అంగీకరించడు. ఉన్నఫళంగా సర్గి ఉంటున్న గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు మార్క్‌ ప్రయత్నిస్తాడు. ఈ విషయం మాంగకి తెలుస్తుంది. మరి మాంగ తన ప్రియురాలు.. గ్రామ ప్రజల వైపు నిలబడ్డాడా? తనకు ఉద్యోగం ఇచ్చిన బ్రిటీష్‌ వారికి మద్దతిచ్చాడా? ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
article imageఎలా ఉందంటే?: స్వాతంత్య్రం రాకముందు పంజాబ్‌లోని ఓ గ్రామం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఒక కమెడియన్‌ విభిన్న జోనర్‌లో నటించాలనుకోవడం సాహసమే. అయితే కథను కపిల్‌శర్మకు తగినట్టు మలిచారు. దీంతో కథ ఇటు సీరియస్‌ జోనర్‌లోకి.. అటు కామెడీ జోనర్‌లోకి వెళ్లకుండా దారి తప్పింది. అప్పటి పరిస్థితుల్ని యథాతథంగా చూపించేందుకు వేసిన గ్రామం సెట్‌ అసహజంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. ఆమీర్‌ఖాన్‌ నటించిన ‘లగాన్‌’ చిత్రం గుర్తుకు వస్తుంది. కొన్ని పాత్రలు కూడా ఆ సినిమాలో ఉన్నట్టుగానే ఉంటాయి. అనవసరమైన సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. మధ్యలో వచ్చే పంజాబీ ఫ్లేవర్‌ సంగీతం మాత్రం ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. కానీ సర్గి.. మాంగ మధ్య జరిగే రొమాన్స్‌ కృతకంగా ఉంటుంది. ప్రథమార్ధంలో మాంగ చేసే అల్లరి, సర్గితో ప్రేమాయణంతో.. ద్వితీయార్ధం బ్రిటీష్‌వారి నుంచి మాంగ తన గ్రామాన్ని కాపాడుకునేందుకు చేసే పోరాటంతో సాగిపోతుంది.

ఎవరెలా చేశారంటే?: ఈ సినిమాకి కపిల్‌శర్మే పెద్ద బలహీనత. సినిమా ఆసాంతం కపిల్‌ ఒకే రకమైన హావభావాలను పలికించాడు. ఏదో నటించాలన్నట్టుగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇషితా దత్‌, మిగతా నటీనటులు సైతం ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేకపోయారు. అయితే మార్క్‌ పాత్రలో నటించిన ఎడ్వర్డ్‌, గాంధీ భక్తుడిగా నటించిన అంజన్‌ శ్రీవాస్తవ్‌ మాత్రం వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా.. దర్శకుడు రాజీవ్‌ దంగ్రా కథను పక్కాగా రాసుకొన్నా, తెరపై వచ్చేసరికి తడబడ్డాడు. సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించడంలో చిత్ర బృందం పెద్దగా హోమ్‌వర్క్‌ చేయలేదు. దుస్తులు.. సినిమా నేపథ్యం అంతా ప్రస్తుత కాలానికి దగ్గరగా ఉంది. నిర్మాణ విలువలు అంతంత మాత్రమే.

బలాలు
+ కథ
+ ఎడ్వర్డ్‌ సొనెన్‌ బ్లింట్‌ నటన

బలహీనతలు
- దర్శకత్వం
- కపిల్‌శర్మ నటన
- సన్నివేశాల సాగతీత

చివరగా: పేలని కపిల్‌ ‘ఫిరంగి’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.