రివ్యూ: ఫుక్‌రే రిటర్న్స్‌
article imageతారాగణం: పుల్కిత్‌ సామ్రాట్‌.. మంజోత్‌ సింగ్‌.. అలీ ఫజల్‌.. వరుణ్‌ శర్మ.. ప్రియా ఆనంద్‌.. రిచా చద్దా తదితరులు
కథ: విపుల్‌ విగ్‌
సినిమాటోగ్రఫీ: ఆండ్రే మెనెజెస్‌
సంగీతం: సమీర్‌ ఉద్దీన్‌.. రామ్‌ సంపత్‌.. ప్రేమ్‌-హర్దీప్‌.. సుమీట్‌ బెల్లరీ
నిర్మాణం: ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
దర్శకత్వం: మృగ్‌దీప్‌ సింగ్‌ లంబా
విడుదల తేదీ: 08-12-2017

బాలీవుడ్‌లో కామెడీ జోనర్‌ సినిమాలకు మాత్రం కొదవ లేదు. ఎలాంటి కథతో వచ్చినా, ఆ తరహా సినిమాలు బాగా ఆడతాయి. అందుకే కామెడీ సినిమాలకు సీక్వెల్స్‌ ఎక్కువగా వస్తుంటాయి. ‘ఫుక్‌రే రిటర్న్స్‌’ కూడా అలాంటిదే. 2013లో విడుదలైన ‘ఫుక్‌రే’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. నలుగురు యువకుల జీవితాల్లో జరిగే సంఘటనలే కథగా మలిచిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఫుక్‌రే రిటర్న్స్‌’ తెరకెక్కించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో? మొదటి చిత్రం స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
article imageకథేంటంటే: హన్నీ (పుల్కిత్‌ సామ్రాట్‌), చూచా (వరుణ్‌ శర్మ), లాలి (మంజోత్‌ సింగ్‌), జాఫర్‌ (అలీ ఫజల్‌) నలుగురు కుర్రాళ్లు సంతోషంగా జీవిస్తుంటారు. చూచాకి వచ్చే కలలు నిజమవుతుంటాయి. దీంతో లాటరీలు కొని సొమ్ము చేసుకుంటుంటాడు. అయితే తొలి భాగం (ఫుక్‌రే)లో భోలి పంజాబన్‌ (రిచా చద్దా) జైలుపాలు కావడానికి వీరే కారణమవుతారు. ఏడాది జైలు శిక్ష అనంతరం ఓ రాజకీయ నాయకుడి సహాయంతో భోలి జైలు నుంచి బయటకు వస్తుంది. అయితే ఆమెను బయటకు తీసుకొచ్చినందుకు ఫలితంగా రూ.10 కోట్లు కావాలని కోరతాడు. దీంతో భోలి తనను జైలు పంపించిన హన్నీ, చూచా, లాలి, జాఫర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని, వారిని అడ్డం పెట్టుకునే డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఆ నలుగురిని భోలి అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. మరి చివరికి ఏమైంది? భోలి పన్నిన పన్నాగాలు ఏంటీ? వాటి నుంచి ఆ నలుగురు యువకులు ఎలా బయటపడ్డారు తదితర విషయాలు తెరపై చూడాలి.

ఎలా ఉందంటే?: సాధారణంగా సీక్వెల్‌ అంటే.. కథలోని పాత్రలను తీసుకొని మరో చిత్రంగా తెరకెక్కిస్తుంటారు. కానీ.. ఇందులో తొలి భాగం కథను కొనసాగించారు. సినిమా ప్రారంభంలోనే తొలి భాగం (ఫుక్‌రే)లో జరిగిన సంఘటనలు చెప్పి ఆ చిత్రం చూడకపోయినా కథలో లీనమయ్యేలా చేయగలిగాడు దర్శకుడు. ఫుక్‌రేలో ఏయే పాత్రలు ఉన్నాయో వాటినే ఈ చిత్రంలోనూ సక్రమంగా ఉపయోగించుకున్నాడు. అయితే కథలో కొన్ని తడబాట్లు ఉన్నా.. సన్నివేశాల్లో పండే కామెడీ వాటిని కవర్‌ చేస్తుంది. అతి లేకుండా చక్కటి సంభాషణలు, కామెడీ ప్రేక్షకులను హాయిగా నవ్విస్తాయి. భోలి వేసే పన్నాగాలను తప్పించుకునేందుకు ఆ నాలుగు పాత్రలు చేసే సాహసాలు ఆకట్టుకుంటాయి. కథ ఆసాంతం ఆసక్తికరంగా సాగేలా దర్శకుడు స్క్రీన్‌ప్లేని మలచడంలో సఫలమయ్యాడు.

ఎవరెలా చేశారంటే?: పుల్కిత్‌, వరుణ్‌, అలీ, మజోంత్‌, రిచా పోటీ పడి నటించారు. అందరు వారి పాత్రలకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. ముఖ్యంగా వరుణ్‌ శర్మ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తాడు. తనకే సాధ్యమైన హావభావాలతో కడుపుబ్బా నవ్వించాడు. రిచా నెగిటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో తొలి భాగంలో కంటే ఈ చిత్రంలో బాగా నటించిందనే చెప్పాలి. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా.. దర్శకుడు మృగదీప్‌సింగ్‌ లంబా కథను పకడ్బందీగా రాసుకున్నాడు. అయితే తెరకెక్కించడంలో కొంత తడబడినా కామెడీతో కవర్‌ చేయగలిగాడు. సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు
+ నటీనటులు
+ వరుణ్‌ హావభావాలు
+ సంభాషణలు

బలహీనతలు
- కథ
- అనవసరమైన సన్నివేశాలు

చివరగా: ఫుక్‌రేతోపాటు నవ్వులు కూడా రిటర్న్స్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.