రివ్యూ: గల్లీ బాయ్‌
రివ్యూ: గల్లీ బాయ్‌
సినిమా పేరు: గల్లీ బాయ్‌ (హిందీ)
నటీనటులు: రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌, కల్కీ కొచ్లిన్‌, విజయ్‌ రాజ్‌, విజయ్‌ వర్మ తదితరులు
కూర్పు: నితిన్‌ బైద్‌
సినిమాటోగ్రఫీ: జే ఓజా
కథ: విజయ్‌ మౌర్య
నిర్మాణ సంస్థ: ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, టైగర్‌ బేబీ ప్రొడక్షన్స్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జోయా అక్తర్‌
విడుదల తేదీ: 14-02-2019

రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్.. ఇద్దరూ టాలెంట్‌ ఉన్న నటులు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం ‘గల్లీ బాయ్‌’. పోస్టర్‌, టైటిల్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ర్యాప్‌ సంగీతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జోయా అక్తర్‌ దర్శకత్వం వహించారు. ముంబయిలో గల్లీ గ్యాంగ్‌ అనే ర్యాప్‌ బృందాన్ని నిర్వహిస్తున్న గాయకులు డివైన్‌, నేజీల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించింది జోయా. ఫరాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వాని నిర్మాతలుగా వ్యవహరించారు. కల్కి కొచ్లిన్‌ కీలక పాత్రలో నటించారు. బెర్లిన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా?

* కథేంటంటే..
మురాద్‌ (రణ్‌వీర్ సింగ్‌) ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని మురాద్‌ తండ్రి (విజయ్‌ రాజ్‌) కలలు కంటుంటాడు. కానీ మురాద్‌కు ర్యాప్‌ సంగీతం అంటే చాలా ఇష్టం. ఇందుకోసం ర్యాప్‌ బ్యాండ్స్‌తో కలిసి తన టాలెంట్‌ను నిరూపించుకోవాలనుకుంటాడు. కానీ అతని వేషధారణ చూసి ఎవ్వరూ దగ్గరికి కూడా రానివ్వరు. ఈ నేపథ్యంలో మురాద్‌కు.. సఫీనా(ఆలియా భట్‌) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. మురాద్‌కు అన్ని విషయాల్లో సపోర్ట్‌ చేస్తుంటుంది సఫీనా. మరి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? ర్యాపర్‌గా పేరు తెచ్చుకోవాలన్న మురాద్‌ కల నెరవేరిందా? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే.


* ఎలా ఉందంటే..
ర్యాప్‌ సంగీతం నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి బాలీవుడ్‌ చిత్రమిది. అందులోనూ రణ్‌వీర్‌, ఆలియా జంటగా నటిస్తున్నారనగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే జోయా అక్తర్ సినిమాను తెరకెక్కించారు. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిన కథ ఏమీ లేదు. సినిమా మొత్తం ర్యాప్‌ సంగీతం చుట్టూ తిరుగుతుంది. అది కూడా సంగీతం పట్ల ఆసక్తి ఉన్నవారికే సినిమా రుచిస్తుందని చెప్పొచ్చు. సినిమాలో ఆలియా, రణ్‌వీర్‌ పాత్రలను సహజంగా చూపించారు. వీరి నటనే సినిమాను గట్టెక్కించిందని చెప్పాలి. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఇందులో ‘అప్నా టైం ఆయేగా’ అన్న పాటనే ఎక్కువగా చూపించారు. ఈ పాట ఇప్పటికే ఎంతో వైరల్‌గా మారింది.

* ఎవరెలా చేశారంటే..
సినిమాలో రణ్‌వీర్‌ పాత్ర ప్రధానం. మురాద్‌ పాత్రలో ఒదిగిపోయాడు. అసలు తెరపై రణ్‌వీర్‌ సింగ్‌ని చూస్తున్నట్లు అనిపించదు. ఇక సఫీనా పాత్రలో ఆలియా భట్‌ చాలా చక్కగా నటించారు. రణ్‌వీర్‌ని ఆటపట్టిస్తూ, తన బాయ్‌ఫ్రెండ్‌ని ఎవరైనా ఏడిపిస్తే వారికి వార్నింగ్‌లు ఇస్తూ ఆలియా చేసే అల్లరి మెప్పిస్తుంది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా చూడటానికి చాలా బాగుంది. మిగిలినవారంతా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.


బలాలు:

+ ఆలియా, రణ్‌వీర్‌ నటన
+ నిర్మాణ విలువలు

బలహీనతలు:

- చెప్పుకోదగ్గ కథలేకపోవడం

* చివరగా..
సంగీత ప్రియులను మెప్పించే ‘గల్లీ బాయ్’

                       Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.