రివ్యూ: కబీర్ సింగ్‌
నటీనటులు: షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ, అర్జన్‌ బాజ్వా, సురేశ్‌ ఒబెరాయ్‌, కామినీ కౌశల్‌, అదిల్‌ హుస్సేన్‌ తదితరులు
సంగీతం: మిథూన్‌
సినిమాటోగ్రఫీ: సంతాన కృష్ణన్‌, రవిచంద్రన్
కూర్పు: ఆరిఫ్‌ షేక్‌
నిర్మాణ సంస్థ: సినీ 1 స్టూడియోస్‌, టీ సిరీస్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సందీప్‌ రెడ్డి వంగా

ఇటీవల కాలంలో ప్రకటించిన రీమేక్‌ సినిమాల్లో ‘కబీర్‌ సింగ్’ చిత్రం ఎక్కువగా ఆకట్టుకుంది. విజయ్‌ దేవరకొండ-సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘అర్జున్‌రెడ్డి’కి ఇది రీమేక్‌. ఈ సినిమాకు కూడా సందీప్‌ రెడ్డినే దర్శకత్వం వహించడం విశేషం. షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ రికార్డు సృష్టించినట్లు.. బాలీవుడ్‌లోనూ క్రియేట్‌ చేస్తుందా? చూద్దాం.


* కథేంటంటే..
కబీర్‌ రాజ్‌ధీర్‌ సింగ్‌ (షాహిద్‌ కపూర్‌) ఓ వైద్య విద్యార్థి. అతను చదువుతున్న కాలేజ్‌లోనే చేరుతుంది ప్రీతి శర్మా (కియారా అడ్వాణీ). ప్రీతిని చూడగానే ఇష్టపడతాడు కబీర్‌. ప్రీతి కూడా కబీర్‌ను ప్రేమిస్తుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇంతలో ప్రీతికి ఇంట్లో వారు సంబంధాలు చూస్తారు. ఈ విషయం కబీర్‌కు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కబీర్‌, ప్రీతి ఒక్కటయ్యారా? తదితర విషయాలు తెరపై చూడాలి.


* ఎలా ఉందంటే..
‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూసినవారికి ఈ చిత్రం చూడాల్సిన అవసరం ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతీ సన్నివేశాన్ని మాతృక నుంచే కాపీ కొట్టారు దర్శకుడు సందీప్‌ రెడ్డి. రీమేక్‌ సినిమా కావడంతో చిన్న చిన్న మార్పులు చేశారే తప్ప మిగతావన్నీ తెలిసిన సన్నివేశాలే. అయితే హీరో తల్లి పాత్రను మాత్రం కొంచెం మార్చారు. ఆమెను సినిమాలోనూ ఓ నటిగా చూపించారు. మితిమీరిన ముద్దు సన్నివేశాలు ప్రేక్షకుడిని కాస్త ఇబ్బందికి గురిచేస్తాయి. మిథూన్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సంస్థలకు తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.


* ఎవరెలా చేశారంటే..

సినిమాలో షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. షాహిద్‌ తన నటనతో బాలీవుడ్‌ విజయ్‌ దేవరకొండ అని నిరూపించుకున్నారు. కియారా అడ్వాణీ ప్రతి సన్నివేశంలో అందంగా కనిపించారు. చక్కటి హావభావాలు పలికించారు. షాహిద్‌కు సోదరుడిగా నటించిన అర్జన్‌ బాజ్వా తన పాత్రకు నూరు శాతం న్యాయం చేశారు. సొంత తమ్ముడ్ని కోల్పోతున్నట్లుగా ఆయన నటించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా వారంతా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.


బలాలు

+ షాహిద్‌, కియారా కెమిస్ట్రీ
+ పాటలు
+ నిర్మాణ విలువలు

బలహీనతలు
- మితిమీరిన ముద్దు సన్నివేశాలు

* చివరగా..
‘అర్జున్‌రెడ్డి’ని చూడని వారికి మాత్రమే!Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.