రివ్యూ: కళంక్‌

రివ్యూ: కళంక్‌
నటీనటులు
: ఆలియా భట్‌, వరుణ్‌ ధావన్‌, మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్‌, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌ కపూర్‌, కునాల్‌ ఖేము, కియారా అడ్వాణీ, కృతి సనన్‌ తదితరులు
సంగీతం: ప్రీతమ్‌
కూర్పు: శ్వేతా వెంకట్‌
రచన: హుస్సేన్‌ దలాల్‌
సినిమాటోగ్రఫీ: వినోద్‌ ప్రధాన్
నిర్మాణ సంస్థ: ఫాక్స్‌ స్టార్ స్టూడియోస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్‌ వర్మన్
విడుదల తేదీ: 17-04-2019

బాలీవుడ్‌ నటులు ఆలియా భట్‌, వరుణ్‌ ధావన్‌లది సూపర్‌హిట్‌ జంట. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు మూడు చిత్రాలు వచ్చాయి. అవన్నీ బ్లాక్‌బస్టర్‌ విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు నాలుగో చిత్రంగా ‘కళంక్‌’ తెరకెక్కింది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం.. స్టార్‌ నటీనటులు.. అందులోనూ దాదాపు పాతికేళ్ల తర్వాత మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్‌ కలిసి నటించారు. ఇన్ని ఆసక్తికరమైన అంశాలున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందంటే..
కథేంటంటే: యువరాణి రూప్‌ చౌదరి (ఆలియా), జఫర్‌ (వరుణ్‌ ధావన్‌) అనే స్వర్ణకారుడు ప్రేమించుకుంటారు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ వారిద్దరి కుటుంబాల మధ్య జరిగిన మోసాలు, సమాధి అయిపోయిన భయంకరమైన నిజాలు బయటపడతాయి. దాంతో రూప్‌ను దేవ్‌ చౌదరి (ఆదిత్య రాయ్‌ కపూర్‌)కి ఇచ్చి పెళ్లి చేస్తారు. దేవ్‌కు సత్య (సోనాక్షి సిన్హా)తో వివాహమై ఉంటుంది. దేవ్‌తో పెళ్లయినప్పటికీ రూప్‌.. జఫర్‌ను మర్చిపోలేకపోతుంది. అసలు రూప్‌, జఫర్‌ ఎందుకు పెళ్లి చేసుకోలేదు. ఓ వివాహితుడికి ఇచ్చి రూప్‌ పెళ్లి ఎందుకు చేయాల్సి వచ్చింది. అసలు బహార్‌ బేగమ్‌ (మాధురీ దీక్షిత్‌), బల్‌రాజ్‌ (సంజయ్‌ దత్‌)ల కుటుంబాల మధ్య ఏం జరిగింది? తదితర విషయాలు తెరపైనే చూడాలి.


ఎలా ఉందంటే
: స్వాతంత్య్రానికి పూర్వం 1945 నేపథ్యంలో ‘కళంక్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అభిషేక్‌ వర్మన్‌. చారిత్రక చిత్రాలంటే ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అందులోనూ మల్టీస్టారర్‌ చిత్రంగా ‘కళంక్’ తెరకెక్కడంతో సినిమాకు మరింత బలం చేకూరింది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్‌ జోహార్‌ తండ్రి యశ్‌ జోహార్‌ ఆలోచన ఇది. ఈ కథకు మంచి రచన తోడవడంతో తెరపై బాగా పండింది. డ్యాన్స్‌, డ్రామా, సంగీతం, భావోద్వేగాలు అన్నీ కుదిరాయి. అయితే రూప్‌, జఫర్‌, దేవ్‌ మధ్యలో వచ్చే సన్నివేశాల్లో కొన్ని చోట్ల లాజిక్‌ లోపించినట్లు ఉంటుంది.

ఎవరెలా చేశారంటే: సినిమాలో ఉన్నవారంతా ఒకరికి ఒకరు గట్టి పోటీనిస్తూ చాలా చక్కగా నటించారు. రూప్‌ అనే యువరాణి పాత్రలో ఆలియా భట్‌ ఒదిగిపోయారు. నిజంగానే ఆమెలో ఓ యువరాణిని చూడవచ్చు. అద్భుతమైన నటన, యాక్షన్‌ సన్నివేశాలతో జఫర్‌ ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. డ్యాన్స్‌తో మాధురీ దీక్షిత్‌, భావోద్వేగాలు పండించడంలో సోనాక్షి, ఆదిత్య రాయ్‌ కపూర్‌, సంజయ్‌ దత్‌ నటన కూడా మెప్పిస్తుంది. కియారా అడ్వాణీ, కృతి సనన్‌ రెండు ప్రత్యేక గీతాల్లో మెరిశారు. సెట్‌ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రీతమ్‌ అందించిన సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

బలాలు
+ నటీనటులు
+ కథ, కథనం
+ పాటలు
+ నిర్మాణ విలువలు


బలహీనతలు

- కొన్ని చోట్ల లోపించిన లాజిక్‌

చివరగా:  ‘కళంక్’.. అందమైన మల్టీస్టారర్‌!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.