రివ్యూ: కేసరి
రివ్యూ: కేసరి
సినిమా: కేసరి
నటీనటులు: అక్షయ్‌కుమార్‌, పరిణీతి చోప్రా, గోవింద్‌ నామ్‌దేవ్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌, మీర్‌ సర్వార్‌ తదితరులు
కూర్పు: మనీశ్‌ మోర్‌
సంగీతం: తనిష్క్‌ బాగ్చి
సినిమాటోగ్రఫీ: అన్షుల్‌ చోబే
నిర్మాణ సంస్థ: ధర్మ ప్రొడక్షన్స్‌, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిలింస్‌, అజ్యూర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనురాగ్‌ సింగ్‌
విడుదల తేదీ: 21-03-2019

                                     

గతేడాది ‘ప్యాడ్‌మ్యాన్‌’, ‘గోల్డ్‌’ చిత్రాలతో విజయాలను అందుకున్నారు అక్షయ్‌ కుమార్‌. ‘2.ఓ’లో ప్రతినాయకుడిగానూ మెప్పించారు. సామాజిక అంశాలను, దేశభక్తి నేపథ్య కథలను ప్రేక్షకుల చెంతకు చేర్చాలన్నది అక్షయ్‌ కోరిక. అందుకే ఈ ఏడాది ‘కేసరి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1897లో జరిగిన సారాగడి యుద్ధం ఆధారంగా తెరకెక్కిన చారిత్రక నేపథ్య చిత్రమిది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో చూద్దాం.

* కథేంటంటే..
మన దేశం బ్రిటిష్‌ పాలనలో ఉండగా ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి సుమారు పది వేల మంది సైనికులు దండెత్తి వచ్చారు. వారిని భారత సైన్యంలోని సిక్కు విభాగానికి చెందిన 21 మంది సైనికులు నిలువరించారు. రెండు సేనల మధ్య భీకర పోరు జరిగింది. అంత పెద్ద బలగాన్ని చూసి భారత సైనికులు బెదిరిపోలేదు. వెనకడుగు వేసి పారిపోలేదు. తమ గుండె బలాన్నే ఆయుధంగా చేసుకుని ముందుకెళ్లారు. చొరబాటుదారులను నరకడం మొదలుపెట్టారు. శత్రువులను ఏరిపారేస్తూనే వీరమరణం పొందారు. 1897 సెప్టెంబరు 12న జరిగిన ఈ సంగ్రామం హవల్దార్‌ ఇషార్‌ సింగ్‌ (అక్షయ్‌కుమార్‌) నేతృత్వంలోని సిక్కు సైనికుల దళం చూపిన పరాక్రమానికి ప్రతీకగా నిలిచింది. యుద్ధం తర్వాత, ముందు జరిగిన సన్నివేశాలను తెరపైనే చూడాలి.


* ఎలా ఉందంటే..
కథను చాలా చక్కగా, ప్రేక్షకులకు అర్థమమ్యేలా తెరకెక్కించారు అనురాగ్‌ సింగ్‌. యుద్ధ సన్నివేశాలను భారీగా తెరకెక్కించారు. వాటి కోసం మూడు వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులను వినియోగించారు. నిర్మాణం పరంగా ఎక్కడా రాజీపడలేదు. పాటలు కూడా బాగానే ఉన్నాయి. సారాగడి యుద్ధం గురించి చాలా మందికి తెలీదు కాబట్టి ప్రతి సన్నివేశం తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని కలిగించేలా ఉంది. అయితే సినిమా మొదలయ్యేటప్పుడే నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే అయినా అన్నీ ఫిక్షనల్‌ సన్నివేశాలు ఉంటాయని డిస్‌క్లైమర్‌ ద్వారా చెప్పారు. అలాగని కొన్ని సన్నివేశాలు మరీ లాజిక్‌కు దూరంగా తెరకెక్కించే ప్రయత్నిం చేశారు దర్శకుడు అనురాగ్‌. ఇదొక్కటే సినిమాకు ప్రతికూలంగా మారింది.

ఎవరెలా చేశారంటే:
అక్షయ్‌ సినిమాలో వన్‌ మ్యాన్‌ ఆర్మీగా నిలిచారు. మామూలుగానే ఆయనకు ఇలాంటి దేశభక్తిని చాటిచెప్పే నిజ జీవిత సంఘటనలంటే మక్కువ. అందుకే పాత్రలో జీవించేశారు. సినిమా మొత్తంలో అక్షయ్‌ తలపాగా ధరించి ఉండాలి. చిత్రీకరణ సమయంలో తలపాగా వల్ల చెమట పడుతూ ఇబ్బందిగా ఉందని ఆయన సినిమా కోసం ఏకంగా గుండుచేయించేసుకున్నారు. దీనిని బట్టే అర్థమవుతోంది అక్షయ్‌ ఈ సినిమాను ఎంత నిబద్ధతతో చేశారో. ఇందులో అక్షయ్‌కు జోడీగా పరిణీతి చోప్రా నటించారు. ఆమె పాత్ర కేవలం ఓ పాటకే పరిమితమైంది. అసలు డైలాగులు కూడా లేవు.


బలాలు
+ అక్షయ్‌ నటన
+ కథనం
+ నిర్మాణ విలువలు
+ పాటలు

బలహీనతలు
- అక్కడకక్కడా లాజిక్‌కి దూరంగా కొన్ని సన్నివేశాలు

* చివరగా..
‘కేసరి’.. అక్షయ్‌ వన్‌ మ్యన్‌ షో!Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.