రివ్యూ: లాల్‌ కప్టాన్‌
చిత్రం: లాల్‌ కప్టాన్‌
నటీనటులు: సైఫ్‌ అలీఖాన్‌, సోనాక్షి సిన్హా, దీపక్‌ దోబ్రియల్‌, జోయా హుస్సేన్‌
దర్శకత్వం: నవదీప్‌ సింగ్‌
నిర్మాత: ఆనంద్‌ ఎల్‌ రాయ్‌
విడుదల తేదీ: 18-10-2019సైఫ్‌ అలీఖాన్‌కు కొంతకాలంగా సరైన విజయాలు లేవు. ఆ మధ్య ఆయన నుంచి వచ్చిన ‘బజార్‌’, ‘కాలాకండి’ చిత్రాలు అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో ఈసారి కాస్త విభిన్నంగా సైఫ్‌ ‘లాల్‌ కప్టాన్‌’తో ముందుకువచ్చాడు. నాగ సాధువుగా గుబురు గడ్డం, పొడవాటి జుట్టు, నుదుట సింధూరం, ముఖానికి విబూదితో ఉన్న సైఫ్‌ గెటప్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రతీకార నేపథ్యంలో యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించిందా? సైఫ్‌ అలీఖాన్‌కు మంచి విజయాన్ని అందించిందా?

కథేంటంటే..
శాంతికి చిహ్నంగా ఉండాల్సిన ఓ నాగసాధువు(సైఫ్‌) ప్రతీకారంతో రగిలిపోతుంటాడు. తన పగకు కారణమైన వ్యక్తి కోసం 20 ఏళ్లుగా అన్వేషిస్తుంటాడు. ఆయుధం చేతపట్టి తన శత్రువును వేటాడడానికి తహతహలాడుతుంటాడు. అతడి ఆచూకీ కనిపెట్టడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. మరి ఆ సాధువు అన్వేషణ ఫలించిందా? తన శత్రువు మీద ప్రతీకారం తీర్చుకున్నాడా? పగ చల్లార్చుకున్నాడా? ఇంతకీ ఆ సాధువు సాయుధుడిగా మారడానికి కారణమైన వ్యక్తి ఎవరు? అతడు చేసిన దుర్మార్గమేంటి.. సాధువుకు, నూర్‌ బాయికి(సోనాక్షి) ఉన్న సంబంధమేంటి అనే విషయాలను తెలుసుకోవాలంటే తెరపై ‘లాల్‌ కప్టాన్’ చూడాల్సిందే.


ఎలా ఉందంటే:
‘మనోరమ సిక్స్ ఫీట్‌ అండర్‌’, ‘ఎన్‌హెచ్‌ 10’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నవదీప్‌ సింగ్‌. ప్రతీకార నేపథ్యంలో సాగే కథలో పాత్రలే కీలకంగా ఆయన తెరకెక్కించిన సినిమా ‘లాల్‌ కప్టాన్‌’. ఆయన ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ దాన్ని తెరకెక్కిచడంలో కొన్ని తప్పులు దొర్లాయనే చెప్పొచ్చు. కొన్నిచోట్ల ఈ సినిమాని బాగా సాగదీశారని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. నటీనటులు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారనే భావనా కొన్ని సన్నివేశాల్లో కలుగుతుంది. కొన్ని పాత్రలను అనవసరంగా సృష్టించారనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 18వ శతాబ్దపు సెట్‌ను చాలా బాగా తీర్చిదిద్దారు. సినిమాటోగ్రాఫర్‌ శంకర్‌ రామన్‌ పలు సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. హింసతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుడిని ఇబ్బందికి గురిచేస్తాయి.


ఎవరెలా చేశారంటే..
తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సైఫ్‌. ‘లాల్‌ కప్టాన్‌’ సినిమాలో నాగసాధువు పాత్రలో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నారు. ఆ పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని సన్నివేశాల్లో సైఫ్‌ గెటప్‌ ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌’లో జానీ డెప్‌ నటించిన జాక్‌ స్పారో పాత్రను పోలిన్నట్లు అనిపిస్తుంది. మరోవైపు కీలక పాత్రలో నటించిన దీపక్‌ దోబ్రియల్‌ కొంతసేపు మాత్రమే తెరపై కనిపిస్తాడు. సోనాక్షి సిన్హా కీలక సన్నివేశాల్లో నటించినప్పటికీ.. ప్రేక్షకులు కళ్లు మూసి తెరిచేలోపే ఆమె పాత్ర అయిపోతుంది. జోయా హుస్సేన్‌ తన పాత్ర మేరకు నటించారు.బలాలు:

+ సైఫ్‌ అలీఖాన్‌
+ సినిమాటోగ్రఫీ
+ 18 శతాబ్దపు సెట్‌
బలహీనతలు
- సాగతీతగా ఉండే సన్నివేశాలు
- పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం
* చివరిగా: మెప్పించని ‘లాల్‌ కప్టాన్‌’Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.