రివ్యూ: లుకా చుప్పి
రివ్యూ: లుకా చుప్పి
సినిమా పేరు: లుకా చుప్పి (హిందీ)
నటీనటులు: కార్తిక్ ఆర్యన్‌, కృతి సనన్‌, పంకజ్‌ త్రిపాఠి, అపరశక్తి ఖురానా తదితరులు
సంగీతం: తనిష్క్‌ బాగ్చి
సినిమాటోగ్రఫీ: మిలింద్‌ జోగ్‌
కూర్పు: మనీశ్‌ ప్రధాన్‌
నిర్మాణ సంస్థ: మ్యాడాక్‌ ఫిలింస్‌, జియో సినిమా
రచన: రోహన్‌ శంకర్‌
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్‌ ఉతేకర్‌
విడుదల తేదీ: 01-03-2019


‘ప్యార్‌ కా పంచ్‌నామా’, ‘సోనూ కే టిట్టూ కీ స్వీటీ’ చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ నటుడు కార్తిక్ ఆర్యన్‌. ‘సోనూ కే టిట్టూ కీ స్వీటీ’ చిత్రం ఎవ్వరూ ఊహించని స్థాయిలో రూ.100 కోట్లు రాబట్టింది. దాంతో కార్తిక్‌కు బాలీవుడ్‌లో డిమాండ్‌ పెరిగిపోయింది. ఇక తన అందంతో కుర్రకారు మనసులు దోచుకున్న కథానాయిక కృతి సనన్‌. ఆమె బాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘లుకా చుప్పి’. సహజీనవం చేస్తున్న ఓ యువతీ, యువకుడి ఇంట్లోకి అబ్బాయి కుటుంబం వచ్చి చేరితే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? అన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని లక్ష్మణ్‌ ఉతేకర్‌ తెరకెక్కించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో చూద్దాం.


* కథేంటంటే..
వినోద్‌ శుక్లా అలియాస్‌ గుడ్డూ (కార్తిక్‌) టీవీ రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు. పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతుంటాడు. రష్మి త్రివేది(కృతి)ని అనే మరో రిపోర్టర్‌ను చూసి ఇష్టపడతాడు. రష్మి కూడా గుడ్డూను ఇష్టపడుతుంది. పెళ్లి చేసుకుందామని గుడ్డూ.. రష్మిని అడుగుతాడు. కానీ రష్మి పెళ్లి కన్నా ముందు సహజీవనం చేద్దామని చెబుతుంది. ఈ రోజుల్లో సహజీవనం అనేది ఓ ట్రెండ్‌ అని, ఆ అనుభూతిని ఆస్వాదిద్దామని అంటుంది. దీంతో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి కలిసి జీవిస్తుంటారు. అయితే ఆనందంగా గడిచిపోతున్న వారి జీవితాల్లోకి గుడ్డూ కుటుంబ సభ్యుల నుంచి అనుకోని షాక్‌ ఎదురవుతుంది. గుడ్డూను విడిచి ఉండలేమంటూ అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతనింట్లోనే మకాం పెట్టేస్తారు. తాము పెళ్లి చేసుకోలేదని, సహజీవనం చేస్తున్నామన్న విషయం ఎక్కడ బయటపడుతుందో అని గుడ్డూ భయపడుతుంటాడు. చివరకు రష్మి, గుడ్డూ పెళ్లి చేసుకున్నారా? వీరి రహస్యం ఇంట్లో వారికి తెలిసిపోయిందా? తదితర విషయాలు తెరపైనే చూడాలి.


* ఎలా ఉందంటే..
ఓ లవ్‌స్టోరీకి సహజీవనం అనే కాన్సెప్ట్‌ను జోడించి కామెడీ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. కానీ ప్రతీ సన్నివేశం అంతగా నవ్వు తెప్పించదు. సహజీవనం అనే కాన్సెప్ట్‌ను కామెడీ రూపంలో చూపించాలనుకున్నారు. కానీ దాని వల్ల సమాజంలో ఎదురయ్యే పరిణామాలను చూపించకపోవడంతో సన్నివేశాల్లో లాజిక్‌ మిస్సయినట్లు అనిపిస్తుంది. ప్రథమార్ధంలో రష్మి, గుడ్డూల ప్రేమ కథ, పాటలతోనే సరిపెట్టాడు దర్శకుడు. అసలు కథ వీరిద్దరూ సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడే మొదలవుతుంది. ఎక్కడ తమకు పెళ్లి కాలేదన్న విషయం బయట తెలిసిపోతుందోనని వీరిద్దరూ చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. ‘లుకా చుప్పి’ అంటే దాగుడుమూతలు. తమ రహస్యం ఇంట్లోవారికి, సమాజానికి తెలీకుండా వీరిద్దరూ దాగుడుమూతలు ఆడుతుంటారు. పాటలు సినిమాకు మంచి జోష్‌నిచ్చాయి. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.


* ఎవరెలా చేశారంటే..
సినిమాలో కార్తిక్‌, కృతిల కెమిస్ట్రీ చాలా బాగా పండింది. వీరి జోడీ చూడముచ్చటగా ఉంది. అయితే సినిమాలో వీరిద్దరిదీ చిన్న పట్టణానికి చెందిన యువతీ యవకుల పాత్ర. కానీ వారి వేషధారణ, మాట తీరు అలా అనిపించదు. దాంతో వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. కార్తిక్‌ స్నేహితుడి పాత్రలో నటించిన అపరశక్తి ఖురానా కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అతడి కామెడీ టైమింగ్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. సినిమాలో గుడ్డూకు బావగా నటించిన పంకజ్‌ త్రిపాఠికి మాత్రం సరైన పాత్ర ఇవ్వలేదేమో అనిపిస్తుంది. మిగతా వారంతా తమ పాత్రల పరిధి మేర చక్కగానే నటించారు.


బలాలు
+ కాన్సెప్ట్‌
+ కృతి, కార్తిక్‌ కెమిస్ట్రీ
+ పాటలు

బలహీనతలు
- కొన్ని సన్నివేశాల్లో లోపించిన లాజిక్‌

* చివరగా..
ఓ జంట ఆడే దాగుడుమూతలాట..!


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.