రివ్యూ: మేరే ప్యారే ప్రైమ్‌మినిస్టర్‌
సినిమా: మేరే ప్యారే ప్రైమ్‌ మినిస్టర్‌

నటీనటులు
: అంజలి పాటిల్‌, ఓం కనోజియా, అతుల్‌ కులకర్ణి, మకరంద్‌ దేశ్‌పాండే

సంగీతం
: శంకర్‌-ఎహసాన్-లాయ్‌

సినిమాటోగ్రఫీ
: పావెల్‌ డైలస్‌

కూర్పు:
మేఘన్‌ సేన్

నిర్మాణ సంస్థ
: ఆర్‌ఓఎంపీ పిక్చర్స్‌, అహం బ్రహ్మాస్మి ఎంటర్‌టైన్‌మెంట్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
: రాకేశ్ ఓం ప్రకాశ్‌మెహ్రా

విడుదల తేదీ
: 15-03-2019


సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను వెండితెరపైకి తీసుకురావడంలో రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా దిట్ట. ఆయన తీసే సినిమాల్లో మహిళల పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరే ప్యారే ప్రైమ్‌మినిస్టర్‌’. టైటిల్‌తో, ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రోమ్‌ చిత్రోత్సవంలో ప్రదర్శితమైన తొలి ఆసియా చిత్రంగా నిలిచిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఈ సినిమా కథేంటో, ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో చూద్దాం.
కథేంటంటే: ముంబయిలోని ఓ మురికివాడలో నివసించే కన్హు (ఓం కనోజియా) అనే ఎనిమిదేళ్ల బాలుడి తల్లి సర్గం (అంజలి పాటిల్‌)పై అత్యాచారం జరుగుతుంది. దాంతో కన్హు న్యాయం కావాలని ప్రధానికి లేఖ రాస్తాడు. ఆ లేఖకు ప్రధాని స్పందించాడా? కన్హు ప్రయత్నం ఎంతవరకు సఫలమైంది? అన్న వివరాలు తెరపైనే చూడాలి.


ఎలా ఉందంటే
: ముందుగా చెప్పినట్లు మెహ్రా చిత్రంలో మహిళల పాత్రలు కీలకంగా ఉంటాయి. ఇది కూడా అలాంటి సినిమానే. మురికివాడల్లో నివసించే స్త్రీలకు రక్షణ ఉండదు. జరగరానిది ఏదన్నా జరిగితే స్పందించేవారూ తక్కువే.. అన్న విషయాలను తెరపై స్పష్టంగా చూపించాడు మెహ్రా. అయితే సినిమాలో కన్హు పాత్రే ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రధమార్ధంలో శృంగారం, ప్రత్యేక గీతాలు, ద్వంద్వార్ధ సంభాషణలను ఎక్కువగా చొప్పించాడు దర్శకుడు. అలాంటి సన్నివేశాల్లో పిల్లల్ని చూపించడం సబబుగా అనిపించదు. ఇందులో ఎనిమిదేళ్ల బాలుడిదే కీలక పాత్రే కావడంతో పిల్లలతో కలిసి సినిమా చూడొచ్చు అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ప్రధమార్ధంలో అడల్ట్‌ సన్నివేశాలు చూపించడం సినిమాకు మైనస్‌ పాయింట్‌గా మారింది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. పాటలూ ఆకట్టుకుంటాయి.

ఎవరెలా చేశారంటే: ఓం కనోజియా, అంజలి పాటిల్‌ సినిమాకు ప్రాణం పోశారు. కనోజియా చాలా చక్కగా సంభాషణలు అర్ధంచేసుకుని తన పాత్రలో ఒదిగిపోయాడు. అంజలి పాత్ర కన్నీరుపెట్టిస్తుంది. ఆమె పలికే హావభావాలు, సంభాషణలు ఆలోచింపజేసేలా ఉంటాయి. మిగతా వారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగానే నటించారు.

బలాలు
+ కాన్సెప్ట్‌
+ నిర్మాణ విలువలు
+ కనోజీయా నటన
+ సంభాషణలు

బలహీనతలు
- ప్రధమార్ధంలో మితిమీరిన అడల్ట్‌ సన్నివేశాలు
చివరిగా: తల్లి కోసం ఓ బాలుడి న్యాయపోరాటం!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.