రివ్యూ: ప‌ద్మావ‌త్‌
న‌టీన‌టులు: దీపికా ప‌దుకొణె.. షాహిద్ క‌పూర్‌.. ర‌ణ్‌వీర్ సింగ్ త‌దిత‌రులు
సంగీతం: స‌ంజ‌య్ లీలా భ‌న్సాలి, సంచిత్ బ‌ల్హారా
ఎడిటింగ్‌: జ‌యంత్ జాద‌ర్‌.. సంజ‌య్ లీలా భ‌న్సాలి.. అఖివ్ అలీ
ఛాయాగ్రహణం: సుదీప్ ఛ‌ట‌ర్జీ
దర్శకత్వం: సంజ‌య్ లీలా భ‌న్సాలి
నిర్మాత: సంజ‌య్ లీలా భ‌న్సాలి.. సుధాన్సు వాట్స్‌.. అజిత్
బ్యానర్‌: భ‌న్సాలీ పిక్చ‌ర్స్‌.. వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌
విడుద‌ల తేదీ: 25-01-2018

article image
ఈమ‌ధ్య కాలంలో... బాలీవుడ్‌నే కాదు, యావ‌త్ సినీ ప్ర‌పంచాన్నీ కుదిపేసిన పేరు.... ప‌ద్మావ‌త్‌! వివాదాలు, విమ‌ర్శ‌లతో ప‌ద్మావ‌త్ పేరు మార్మోగిపోయింది. చిత్ర బృందాన్ని `చంపేస్తాం` అని ఓ వ‌ర్గం బెదిరించేంత వ‌ర‌కూ వెళ్లిందంటే... `ప‌ద్మావ‌త్` రేపిన ప్ర‌కంప‌న‌లేంటో అర్థం చేసుకోవ‌చ్చు. చ‌రిత్ర‌ని చ‌రిత్ర‌గానే చూపిస్తున్నాం.. క‌ల్పితాలు లేవు.. అని ద‌ర్శ‌కుడు హామీ ఇచ్చేంత వ‌ర‌కూ `ప‌ద్మావ‌త్‌` వివాదం రేగుతూనే ఉంది. సెన్సార్ త‌న క‌త్తెర‌కు మ‌రింత ప‌దును పెట్టి, అణువ‌ణువూ గాలించి, విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌కుండా సెన్సార్ చేసి.. విడుద‌ల‌కు అనుమ‌తులు ఇచ్చింది. దాంతో `ప‌ద్మావ‌త్‌` వ‌చ్చేసింది. ఈనెల 25న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతోంది. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో ప్రీమియ‌ర్ షోలు ప‌డిపోయాయి. మ‌రి `ప‌ద్మావ‌త్‌` ఎలా ఉంది? టాక్ ఏమిటి?

క‌థేంటంటే...?: చ‌రిత్ర‌పై అవ‌గాహ‌న ఉన్న‌వాళ్ల‌కు, అల్లావుద్దీన్ ఖిల్జీ ప‌రిపాల‌న గురించి తెలిసిన వాళ్ల‌కు `ప‌ద్మావ‌త్‌` క‌థ ప‌రిచ‌య‌మే. అల్లావుద్దీన్ ఖిల్జీ (ర‌ణ‌వీర్ సింగ్‌) అడ్డ‌దారుల్లో సింహాస‌నం అధిష్టిస్తాడు. త‌నో కామ పిపాసి. ప్ర‌పంచంలో అంద‌మైన‌వీ, అద్భుత‌మైన‌వ‌న్నీ త‌న ద‌గ్గ‌రే ఉండాల‌ని ఆశ ప‌డ‌తాడు. అందుకోసం ఎంత‌టి దుర్మార్గ‌మైనా చేసేస్తాడు. ఈ ప్ర‌పంచంలోనే అత్యంత అంద‌గ‌త్తె `ప‌ద్మావ‌తి` గురించి ఖిల్జీకి తెలుస్తుంది. త‌నో రాజ్‌పుత్‌ వంశానికి చెందిన వీర‌నారి. అప్ప‌టికే ఓ రాజ్ పుత్‌కు అర్థాంగి. అయినా స‌రే.. ప‌ద్మావ‌తిని ద‌క్కించుకోవాల‌ని కుట్ర ప‌న్నుతాడు. రాజ‌పుత్‌ల‌పై యుద్ధం ప్ర‌క‌టిస్తాడు. మ‌రి ఖిల్జీ ప‌ద్మావ‌తిని ద‌క్కించుకున్నాడా? లేదంటే ప‌ద్మావ‌తి వీర‌త్వం ముందు త‌లవంచాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే...?: చారిత్ర‌క గాథ‌ల్ని వెండి తెర‌పైకి క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల‌తో, అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా తెర‌కెక్కించ‌డం సామాన్య‌మైన విష‌యం కాదు. చ‌రిత్ర‌ని వ‌క్రీక‌రించ‌కూడ‌దు. అలాగ‌ని ప్రేక్ష‌కుడికి అదేదో చ‌రిత్ర పాఠం బోధిస్తున్న‌ట్టు ఉండ‌కూడ‌దు. రెండింటి మ‌ధ్య స‌మ‌తుల్యం పాటించాలి. ఆ కోల‌త‌లు, తూనిక‌లు బాగా తెలిసిన ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ. `ప‌ద్మావ‌త్‌` క‌థ‌లో కావ‌ల్సినంత ఎమోష‌న్ ఉంది. డ్రామా ఉంది. రోమాలు నిక్క‌బొడిచే భావోద్వేగాలున్నాయి. వీట‌న్నింటినీ త‌న‌దైన శైలిలో వెండి తెర‌పై ఆవిష్క‌రించాడు భ‌న్సాలీ. సాధార‌ణంగా రాజ్‌పుత్‌ క‌థ‌, యుద్దాలు అంటే... ఎక్కువ‌గా యాక్ష‌న్ ఘ‌ట్టాల‌పై మొగ్గు చూపిస్తారు. క‌త్తి యుద్దాలు, గుర్ర‌పు స్వారీలు, ఎత్తుగ‌డ‌లు, యుద్ధ నైపుణ్యాలు చూపించ‌డానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ భ‌న్సాలీ దాన్ని ప‌క్క‌న పెట్టాడు. తన‌కు డ్రామాపై ప‌ట్టు ఎక్కువ‌. అందుకే... వీలైనంత డ్రామా ఎలివేట్ చేయ‌డానికి చూశాడు. ఖిల్జీ అరాచ‌క‌త్వం, అత‌ని ఆలోచ‌న‌లు, సింహాస‌నాన్ని అడ్డ‌దారిలో అందుకున్న విధానం.. వీటితో క‌థ ఆస‌క్తిక‌రంగా మొద‌ల‌వుతుంది.

article image
చ‌రిత్ర పాఠం కాబ‌ట్టి... వీలైనంత సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా చెప్పాలి. ఆ విష‌యంలో భ‌న్సాలీ విజ‌యం సాధించాడు. చ‌రిత్ర గురించి అవ‌గాహ‌న లేని ప్రేక్ష‌కుడు కూడా క‌థ‌లోకి తేలిగ్గా ప్ర‌వేశిస్తాడు. ఎనిమిది వంద‌లమంది దాసీల‌తో ప‌ద్మావ‌తి ఖిల్జీల‌పైకి దండెత్తే స‌న్నివేశంలో భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ అణువ‌ణువూ క‌నిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో రాజ్‌పుత్‌ల త్యాగాన్ని బాగా ఎలివేట్ చేశారు. ఈ సినిమాని నిల‌బెట్టే ఘ‌ట్టం అది. తొలి భాగంలో క‌థ‌ని చెప్ప‌డానికి, పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకున్న ద‌ర్శ‌కుడు.. ద్వితీయార్ధంలో డ్రామాని పండించి... త‌నదైన మార్క్ వేయ‌గ‌లిగాడు. తెలిసిన క‌థ‌ని ఆస‌క్తిగా చెప్ప‌డంలో స‌ఫ‌లీకృతుడ‌య్యాడు. చరిత్ర‌ని అటూ ఇటూ మారిస్తే వివాదాలు త‌లెత్తుతాయ‌ని తెలుసు. అందుకే వీలైనంత వివాదాల‌కు దూరంగా ఈ క‌థ‌ని న‌డిపించాడు. సెన్సార్ క‌త్తెర‌కు ఈ సినిమా బ‌లైన సంగ‌తి తెలిసిందే. అందుకే.. చాలా చోట్ల క‌థ జంప్ అవ్వ‌డం క‌నిపిస్తుంటుంది. అక్క‌డ‌క్క‌డ గంద‌ర‌గోళం నెల‌కొంది.

ఎవ‌రెలా చేశారంటే..: ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొణె, షాహీద్ క‌పూర్‌.. పాత్ర‌లు ఈ క‌థ‌లో కీల‌కం. ఆ పాత్ర‌ల్ని ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. మూడు పాత్ర‌ల్నీ శ‌క్తిమంతంగా మ‌లిచాడు. ఈ మూడింటిలో ఎక్కువ మార్కులు వేయాల‌నుకుంటే మాత్రం ర‌ణ‌వీర్ సింగ్‌కి ద‌క్కుతాయి. ఖిల్జీగా క్రూర‌త్వాన్ని అద్భుతంగా పండించాడు. ప‌ద్మావ‌తిని ద‌క్కించుకోవ‌డానికి తాను వేసే ఎత్తుగ‌డ‌లు, ఆయా సన్నివేశాల్లో ర‌ణ‌వీర్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఆ త‌ర‌వాత స్థానం క‌చ్చితంగా దీపికా ప‌దుకొణేదే. ఆమె చేసిన అత్యుత్త‌మ పాత్ర‌ల్లో త‌ప్ప‌కుండా ప‌ద్మావ‌తి ఉంటుంది. ఈ పాత్ర కోసం ఆమె ప‌డిన క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది. రొమాంటిక్ పాత్ర‌ల్లో క‌నిపించే షాహిద్ క‌పూర్ రాజ్‌పుత్‌ వీరుడిగా మార‌డం కొత్త అనుభ‌వం. మిగిలిన పాత్ర‌ధారులంతా... సంజ‌య్‌లీలా భ‌న్సాలీ క‌ల‌కు ప్రాణం పోశారు. సాంకేతికంగా పేరు పెట్ట‌డానికేం లేదు. కాక‌పోతే.. సంజ‌య్ లీలా భ‌న్సాలీ గ‌త చిత్రాల‌తో పోలిస్తే... పాట‌ల్లో ద‌మ్ము త‌గ్గింద‌నే చెప్పాలి. అయితే నేప‌థ్య సంగీతంలో వినిపించే బీజియ‌మ్స్ రోమాలు నిక్క‌బొడిచేలా చేశాయి. రాజ ద‌ర్బార్‌, కోట‌లు విస్తుపోయేలా ఉన్నాయి. సీజీ వ‌ర్క్ కూడా అత్యంత స‌హ‌జంగా ఉంది. నిజ‌మైన కోట‌ల్లో క‌థ న‌డిచిందేమో అనే భ్ర‌మ క‌లిగించాయి. యుద్ధ స్న‌నివేశాల‌పై అంత దృష్టి పెట్ట‌లేదు. భ‌న్సాలీ దృష్టంతా డ్రామాపైనే ఉంది.

బ‌లాలు
+ ర‌ణ‌వీర్‌, దీపికా న‌ట‌న‌
+ ప‌తాక సన్నివేశాలు
+ భావోద్వేగాలు
+ భారీద‌నం

బ‌ల‌హీన‌త‌లు
- నిడివి
- పాట‌లు

చివ‌రిగా: ప‌ద్మావ‌త్‌... చ‌రిత్ర‌కు ప్రాణం పోసిన భ‌న్సాలి

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.