రివ్యూ: పంగా
చిత్రం: పంగా

నటీనటులు: కంగనా రనౌత్‌, జస్సీగిల్‌, నీనా గుప్తా, రిచాచద్దా, పంకజ్‌ త్రిపాఠి

దర్శకత్వం: అశ్వినీ అయ్యర్‌ తివారీ

నిర్మాణ సంస్థ: ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌

సంగీతం: శంకర్‌ మహదేవన్‌, ఈషాన్‌ నూరానీ, లాయ్‌ మెడోస్నా

సినిమాటోగ్రఫీ: పాటిల్‌

విడుదల తేదీ: 24-01-2020


నాయికా ప్రాధాన్య చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. గతేడాది ‘మణికర్ణిక’లో ఝాన్సీ లక్ష్మీబాయిగా మెప్పించిన ఆమె, ఇప్పుడు మరో నాయికా ప్రాధాన్య చిత్రం ‘పంగా’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఇందులో కంగన పెళ్లై ఓ బిడ్డకు తల్లిగా మారిన మధ్యతరగతి మహిళ పాత్రను పోషించింది. ఇప్పటికే విడుదలైన ‘పంగా’ ట్రైలర్‌కు సినీ ప్రియులతోపాటు పలువురు ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశసంలు లభించాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో శుక్రవారం ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘పంగా’ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకోగలిగింది? నాయికా ప్రాధాన్య చిత్రంతో కంగన మరో హిట్‌ను సొంతం చేసుకుందా?

కథేంటంటే:
మధ్య తరగతి కుటుంబానికి చెందిన జయా నిగమ్(కంగనా రనౌత్‌) రైల్వే ఉద్యోగిగా పని చేస్తుంటుంది. జయాకు కబడ్డీ అంటే ప్రాణం. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగి సత్తా చాటుతుంది. దీంతో ఆమె పేరు మార్మోగిపోతుంది. ప్రశాంత్‌ (జస్సీగిల్‌)తో వివాహం జరిగిన తర్వాత కూడా కొంతకాలంపాటు ఆటను కొనసాగిస్తుంది. ఆది(యాగ్య భాసిన్‌) అనే కుమారుడు జన్మించగానే ఆమె కబడ్డీకి పూర్తిగా దూరమవుతుంది. తన తల్లికి కబడ్డీ మీద ఉన్న ఇష్టాన్ని తెలుసుకున్న ఆది ఆమెను మరోసారి కబడ్డీ క్రీడాకారిణిగా చూడాలనుకుంటాడు. కానీ అప్పటికే ఆమె వయసు 32 ఏళ్లు దాటిపోయి ఉంటుంది. ఓ రకంగా అది ఆటగాళ్లు రిటైర్‌ అయ్యే వయసు. ఆ వయసులో మళ్లీ కబడ్డీ మొదలు పెట్టాలంటే అటు శారీరకంగా, ఇటు కుటుంబం, సమాజం నుంచి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. తల్లి అయ్యాక కూడా ఆటలేంటి? అన్న హేళనలు వినిపిస్తాయి. మరి వాటిని జయ ఎలా అధిగమించగలిగింది? తల్లిగా మారినంత మాత్రాన జీవిత లక్ష్యాలను పక్కన పెట్టాల్సిందేనా? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే..


ఎలా ఉందంటే:
దర్శకురాలు అశ్వినీ అయ్యర్‌ తివారీ తీసుకున్న కథ చిన్నదే అయిన్నప్పటికీ ఎన్నో భావోద్వేగాలతో కూడకున్నది. కుటుంబ బాధ్యతలతో తమ కలలకు దూరమైన ఎందరో మాతృమూర్తుల జీవితాలకు అద్దంపట్టేలా ‘పంగా’ను దర్శకురాలు చక్కగా తెరకెక్కించారు. కథకు తగట్టుగా పాత్రల చిత్రీకరణ కూడా వాస్తవికంగా ఉంటుంది. అంతేకాకుండా పాత్రల మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకుడి హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో కబడ్డీ మీద తనకున్న ఇష్టాన్ని కుటుంబానికి తెలియచేస్తూ.. ‘అసలు నేను ఏం చేసేదాన్ని.. ఇప్పుడు ఏం చేస్తున్నాను’ అని చెబుతూ కంగన కంటతడి పెట్టుకున్న సీన్‌ ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. దర్శకురాలు ఎంచుకున్న పాయింట్‌ చిన్నది కావడంతో కథ అంతా అక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. దాంతో ప్రేక్షకుడు చూసిన సన్నివేశాలే చూస్తున్నానా? అన్న భావన అక్కడక్కడా కలుగుతుంది.


ఎవరెలా చేశారంటే:
నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో హీరోయిన్‌ నటనకు చాలా స్కోప్‌ ఉంటుందనే చెప్పాలి. కంగనలోని నటిని ‘పంగా’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకురాలు అశ్వినీ. మధ్యతరగతి గృహిణిగా కనిపిస్తూనే తన కలలను సాకారం చేసుకునే మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత కబడ్డీ కోర్టులోకి అడుగుపెట్టిన సన్నివేశంలో కంగన పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుడి హృదయాలను ద్రవింపచేస్తాయి. అలాగే ఆమె భర్త ప్రశాంత్‌ పాత్రలో నటించిన జస్సీగిల్‌ పరిధి మేరకు నటించారు.కంగన స్నేహితురాలిగా రిచాచద్దా నటన చాలా యాక్టివ్‌ ఉంటుంది. కంగన కుమారుడిగా నటించిన యాగ్య భాసిన్‌ చెప్పే డైలాగులు నవ్వి తెప్పిస్తాయి. కంగన తల్లిగా జయా గుప్తా చెప్పే డైలాగులు ఆలోచింపచేస్తాయి. అశ్వినీ, నిఖిల్‌ కథకు నితిశ్‌ తివారీ అందించిన స్ర్కీన్‌ప్లేతో చాలా చక్కగా కుదిరింది. అలాగే శంకర్‌-ఎహెషాన్‌-లాయ్‌ త్రయంఅందించిన నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 


బలాలు
+ కథ, కథనం
+ కంగన నటన
+ సంగీతం

బలహీనతలు
- అక్కడక్కడా సాగదీసిన సన్నివేశాలు

చివరిగా: ఆలోచింపచేసే అమ్మ కల ‘పంగా’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.