రివ్యూ: పీఎం నరేంద్ర మోదీ
నటీనటులు: వివేక్‌ ఒబెరాయ్‌, మనోజ్‌ జోషి, ప్రశాంత్‌ నారాయణ్‌, బొమన్‌ ఇరానీ తదితరులు
సంగీతం: హితేశ్‌ మోదక్‌, ఏ.ఆర్‌ రెహమాన్‌
సినిమాటోగ్రాఫీ: సునీతా రాడియా
కూర్పు: సంజయ్‌ సంక్లా
నిర్మాణ సంస్థ: లెజెండ్‌ గ్లోబల్‌ స్టూడియో, ఆనంద్‌ పండిట్‌ మోషన్‌ పిక్చర్స్‌
కథ: సందీప్‌ సింగ్‌
స్క్రీన్‌ప్లే: అనిరుధ్‌ చావ్లా, వివేక్‌ ఒబెరాయ్‌
దర్శకత్వం: ఒమంగ్‌ కుమార్‌
విడుదల తేదీ: 24-05-2019


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’. వివేక్‌ ఒబెరాయ్‌.. మోదీ పాత్రలో నటించారు. ఒమంగ్‌ కుమార్‌ దర్శకుడు. ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీ, తెలుగు సహా 23 భాషల్లో సినిమాను విడుదల చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించిన మోదీ జీవితంలోని కీలక విషయాలను సినిమాలో చూపించామని గతంలో వివేక్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

* కథేంటంటే..
నరేంద్ర మోదీ (వివేక్‌ ఒబెరాయ్‌) చిన్నప్పుడు ఛాయ్‌ అమ్ముకుంటూ తోటి స్నేహితులతో జీవితాన్ని ఎంజాయ్‌ చేసే సన్నివేశాలతో సినిమా మొదలైంది. బాల్యంలో ఛాయ్‌వాలాగా జీవితాన్ని ప్రారంభించడం, యవ్వనంలో ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవడం, ఆ తర్వాత ఆరెస్సెస్‌లో చేరడం, అనంతరం రాజకీయ రంగంలో సంచలనం సృష్టించడం లాంటి విషయాలను సినిమాలో చూపించారు.


* ఎలా ఉందంటే..
దర్శకుడు ఒమంగ్‌ కుమార్‌కు బయోపిక్‌లు కొత్తేం కాదు. గతంలో ఆయన ‘సరబ్‌జీత్‌’ బయోపిక్‌ను తెరకెక్కించారు. కానీ ఆయన ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్‌ను తెరకెక్కించిన విధానం అంతగా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశానికే ప్రధానిగా ఎన్నికైన ఓ వ్యక్తి గురించి సినిమా తీయాలంటే బాగా పరిశోధన చేయాలి. కానీ ఒమంగ్‌ అలాంటివేవీ చేసినట్లు అనిపించదు. ద్వితీయార్ధంలో మోదీ చేపట్టిన ర్యాలీలు, ప్రధాని కాకముందు ఆయన చేసిన ప్రయాణాన్ని చూపించారు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. సన్నివేశానికి తగ్గట్టుగా వచ్చే సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. కాకపోతే స్క్రిప్ట్‌ సినిమాకు సరిగ్గా అతకలేదు. అది కూడా బాగుండి ఉంటే సినిమాకు వంద శాతం న్యాయం జరిగి ఉండేది. కొన్ని చోట్ల అనవసరమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి.


* ఎవరెలా చేశారంటే..
సినిమాలో వివేక్‌ ఒబెరాయ్‌దే ప్రధాన పాత్ర కాబట్టి ఆయన వన్‌ మ్యాన్‌ షోగా నిలిచారు. మోదీలా కనిపించేందుకు ప్రోస్తెటిక్‌ మేకప్‌ వేసుకున్నారు. అంతేకాదు మోదీని అనుకరిస్తూ ఆయన చేసే ప్రసంగాలు కూడా ఆకట్టుకుంటాయి. తన పాత్రకు వివేక్‌ నూటికి నూరు పాళ్లు న్యాయం చేశారనిపిస్తుంది. అమిత్‌ షా పాత్రలో నటించిన మనోజ్‌ జోషి కూడా తన నటనతో మెప్పిస్తారు. సినిమాలో నటీనటుల వరకు తమ పాత్రల్లో చక్కగా నటించారు.

బలాలు:
+ వివేక్‌ ఒబెరాయ్‌ నటన
సంగీతం

బలహీనతలు:
- స్క్రిప్ట్‌లో బలం లేకపోవడం
- అక్కడక్కడా అనవసరమైన సన్నివేశాలు

* చివరగా..
‘పీఎం నరేంద్ర మోదీ’.. వివేక్‌ వన్ మ్యాన్‌ షో!Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.