రివ్యూ: గుడ్‌న్యూస్‌
సినిమా: రివ్యూ
చిత్రం: గుడ్ న్యూస్
నటీనటులు: అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దిల్జిత్ దొసాంజ్, కియారా అడ్వాణీ, అదిల్ హుస్సేన్, గుల్షన్ గ్రోవర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: విష్ణు రాయ్
దర్శకత్వం: రాజ్ మెహతా
విడుదల తేదీ: 27-12-2019

వేగంగా సినిమాలు చేసే అక్షయ్‌ కుమార్‌ ఈ ఏడాదిలో ‘కేసరి’, ‘మిషన్‌మంగళ్‌’, ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ఆ మూడు చిత్రాలూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు ‘గుడ్‌న్యూస్‌’తో నాలుగోసారి వచ్చేశారు. అక్షయ్‌ భార్యగా కరీనా కపూర్‌, దిల్జిత్‌ దొసాంజ్‌ భార్యగా కియారా అడ్వాణీ నటించారు. ఘన విజయాన్నందుకున్న ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’ తర్వాత కియారా నటించిన చిత్రమిది. కృత్రిమ గర్భధారణ విషయంలో జరిగిన ఓ తప్పిదం వల్ల రెండు జంటల మధ్య నెలకొన్న గందరగోళం నేపథ్యంలో ఈ చిత్రం వినోదాత్మకంగా తెరకెక్కినట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది?


కథేంటంటే:
వరుణ్‌ బత్రా (అక్షయ్‌), దీప్తి బత్రా (కరీనా) భార్యాభర్తలు. సంతానం కలగకపోవడంతో కృత్రిమ గర్భధారణ కోసం ఓ ఆసుపత్రిని సంప్రదిస్తారు. అలాంటి సమస్యతోనే హనీ బత్రా (దిల్జిత్‌), మోనికా బత్రా (కియారా) అదే ఆసుపత్రికి వస్తారు. అయితే రెండు జంటల ఇంటి పేర్లు బత్రానే కావడంతో వైద్యులు పొరబడతారు. వరుణ్‌ శుక్రకణాలను మోనికా అండంతో, హనీ శుక్రకణాలను దీప్తి అండంతో ఫలదీకరణ చేస్తారు. దీంతో వరుణ్‌ సంతానం మోనికా గర్భంలో, హనీ సంతానం దీప్తి గర్భంలో పెరుగుతుంటుంది. ఆ విషయం తెలిశాక వైద్యులు నాలిక్కరుచుకుంటారు. సంతానం కలగబోతోందంటూ గుడ్‌న్యూస్‌ చెప్పాల్సిన సమయంలో ఈ తారుమారు విషయాన్ని నీళ్లు నములుతూ చెబుతారు. అప్పుడు ఆ రెండు జంటలు ఎలా స్పందించాయి? సరిదిద్దుకోలేని ఈ తప్పిదం వారి జీవితాల్లో ఎలాంటి కల్లోలం సృష్టించింది? ఈ సమస్య ఎలా ముగిసింది? అనే అంశాలను తెరపై చూడాలి.

ఎలా ఉందంటే:
ఇదొక సున్నిత అంశం. ప్రస్తుతం సమాజంలో సగటు యువత ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. కెరీర్‌లో స్థిరపడేవరకూ పెళ్లి చేసుకోకూడదనే నిశ్చయంతో ఉండటంతో మూడు ముళ్లు కాస్త ఆలస్యం అవుతున్నాయి. దీంతో 30ల తర్వాత పెళ్లి చేసుకునేవారు పెరుగుతున్నారు. ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు కుటుంబ బాధ్యతలు, జీవనశైలి కారణంగా సంతాన సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో ఫెర్టిలిటీ సెంటర్లను సంప్రదించే వారి సంఖ్య పెరుగుతోంది. దర్శక-రచయిత ఈ అంశాన్నే ప్రధాన ఇతి వృత్తంగా తీసుకున్నాడు. ఇలాంటి కథలను తెరకెక్కించడం కత్తి మీద సాములాంటిది. ఏమాత్రం తడబడినా అపహాస్యం పాలవుతారు. కానీ, దర్శకుడు సున్నిత అంశాన్ని ఎంచుకుని చక్కని హాస్యం జోడించి తెరకెక్కించాడు. ఆయా సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.

తొలుత సంతాన సమస్యలపై చెప్పుకుంటూ నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఎప్పుడైతే తమ బిడ్డ మరొకరి గర్భంలో పెరుగుతోందని తెలుసుకున్నారో ఇరు కుటుంబాలు పడే టెన్షన్‌ మొదట కిత కితలు పెడుతాయి. ప్రథమార్ధం అంతా ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్‌ చేయడమే లక్ష్యంగా ఆయా సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. ద్వితీయార్ధం నుంచి పాత్రల మధ్య సంఘర్షణ పెరిగే కొద్దీ ప్రేక్షకుడు కథలో మరింత లీనం అవుతాడు. ముఖ్యంగా తమ బిడ్డకోసం ఇరువురు తల్లిదండ్రులు పడే తాపత్రయం, భావోద్వేగాలు మెప్పిస్తాయి. చివరి గంటలో నడిచే నాటకీయ సన్నివేశాలతో హాస్యం వెనక్కు వెళ్లిపోయి, ఎమోషనల్‌గా ప్రేక్షకుడు కనెక్ట్‌ అవుతాడు. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి.


ఎవరెలా చేశారంటే:
విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్న అక్షయ్‌ మరోసారి తనదైన కామెడీతో అలరించారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన కామెడీ చిత్రాల్లో ఉత్తమ నటన అని చెప్పవచ్చు. ఆయనకు జోడీగా నటించిన కరీనా కపూర్‌ కూడా చక్కగా నటించింది. పెళ్లై, పిల్లలు ఉన్నా, ఇప్పటికీ కరీనాకు అవకాశాలు ఎందుకు వస్తున్నాయో ఈ సినిమాతో మరోసారి నిరూపించుకుంది. ముఖ్యంగా ఎమోషనల్‌సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. ఇక మరో జోడీ దిల్జిత్‌ దొసాంజ్‌, కియారా అడ్వాణీలు కూడా పర్వాలేదనిపించారు. అయితే, ఈ రెండు పాత్రల్లో కాస్త అతి ఎక్కువగా ఉంది. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో యువ జంటలు ఎదుర్కొంటున్న సమస్యను చాలా చక్కగా చూపించాడు దర్శకుడు రాజ్‌ మెహతా. అయితే, కథను మరింత బలంగా రాసుకోవాల్సింది. ఎక్కువగా హాస్యాన్ని నమ్ముకోవడంతో బలమైన సన్నివేశాలు పరిమితంగా ఉన్నాయి. ఈ విషయంలో దర్శక-రచయిత మరింత కసరత్తు చేయాల్సింది.


బలాలు 
+ అక్షయ్‌, కరీనా-
+ హాస్యం
+ భావోద్వేగాలు

బలహీనతలు
-  బలమైన కథ లేకపోవడం
- ద్వితీయార్ధంలో కాస్త సాగదీత

చివరిగా: నవ్వులు పంచే ‘గుడ్‌ న్యూస్‌’


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.