రివ్యూ: మిషన్‌ మంగళ్‌
చిత్రం: మిషన్‌ మంగళ్‌
తారాగణం: అక్షయ్‌ కుమార్‌, విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, తాప్సీ, నిత్యా మీనన్‌ తదితరులు
కథ: ఆర్‌. బాల్కి, జగన్‌ శక్తి, నిధి సింగ్‌ ధర్మ, సాకేత్‌ కొండిపర్తి
సంగీతం: అమిత్‌ త్రివేది
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌
ఎడిటింగ్‌: చందన్‌ ఆరోరా
దర్శకత్వం: జగన్‌ శక్తి
నిర్మాణం: కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్‌, హోప్‌ ప్రొడక్షన్స్‌, ఫాక్స్‌ స్టార్‌ స్డూడియోస్‌
విడుదల తేదీ: 15-08-2019


ఇటీవల కాలంలో వాస్తవిక అంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలు అధికమయ్యాయి. ఆ కోవలోనిదే ‘మిషన్‌ మంగళ్‌’. ఇస్రో శాస్త్రవేత్తలు 2013లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘మంగళయాన్‌’ ప్రయోగం ఆధారంగా దర్శకుడు జగన్‌ శక్తి ఈ చిత్రానికి తెరకెక్కించారు. మంగళయాన్‌ బృందంలో మహిళా శాస్త్రవేత్తలు చేసిన కృషిని ఈ చిత్రంలో ప్రధానంగా చూపించేందుకు ప్రయత్నించారు. అక్షయ్‌ కుమార్‌ ముఖ్య భూమిక పోషించిన ఈ చిత్రం.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం విడుదలైంది. మరి అక్షయ్‌, జగన్‌ చేసిన ప్రయోగం విజయవంతమైందా? తెలియాలంటే రివ్యూ చదవండి.

* కథేంటంటే?
ఓ ఉపగ్రహ విఫలప్రయోగంతో కథ మొదలవుతుంది. రాకేశ్‌ ధావన్‌ (అక్షయ్‌ కుమార్‌) నిర్వహించిన ఈ ప్రయోగం విఫలం కావడంతో అతడిని అంగారక గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపేందుకు ప్రయోగం చేస్తున్న విభాగానికి బదిలీ చేస్తారు. దీంతో మిషన్‌ మంగళ్‌ డైరెక్టర్‌గా ఉన్న తారా (విద్యా బాలన్‌)తో కలిసి రాకేశ్‌ బృందం మిషన్‌ మంగళ్‌ ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఈ బృందంలో ఎకా గాంధీ (సోనాక్షి సిన్హా), క్రితిక అగర్వాల్‌ (తాప్సీ), వర్షా పిళ్లై(నిత్యా మీనన్‌) తదితరులు ఉంటారు. రాకేశ్‌ నాయకుడిగా ఉన్న ఓ మహిళా బృందం అసాధ్యమనుకున్న ప్రయోగాన్ని ఎలా విజయవంతం చేసింది... ఈ క్రమంలో ఎదురైన అవరోధాలను ఎలా అధిగమించిందో తెరపై చూడాలి.


* ఎలా ఉందంటే?
ఇది ఒక సైన్స్‌ఫిక్షన్‌ చిత్రమే అయినా.. సాంకేతిక పదజాలాలు ఎక్కువగా వాడకుండా సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దారు. మహిళలు ఒక వైపు కుటుంబ బాధ్యతలను మోస్తూనే మరోవైపు తమ ఉద్యోగాల్లో ఎంతగా కష్టపడుతున్నారో ఈ చిత్రంలో చూపించారు. భారత్‌ గర్వించదగ్గ మంగళయాన్‌ ప్రయోగం గురించి చెబుతూనే.. మహిళా సాధికారత గురించి అంతర్లీనంగా తెలిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొన్నిసార్లు కథ ట్రాక్‌ తప్పింది. పాత్రల మధ్య సంభాషణలు ఆకట్టుకుంటాయి. అక్షయ్‌ కుమార్‌ మాటాల్లో ఎక్కువగా హాస్యం కనిపిస్తుంది.


* ఎవరెలా చేశారంటే?
శాస్త్రవేత్త రాకేశ్‌ ధావన్‌గా అక్షయ్‌కుమార్‌ అద్భుతంగా నటించాడు. పాత్రకు నూరు శాతం న్యాయం చేశాడు. ఇక మిషన్‌ మంగళ్‌ డైరెక్టర్‌గా విద్యా బాలన్‌ చేసిన అభినయం సహజంగా ఉంటుంది. కమాండింగ్‌ తీరు.. హావాభావాలతో విద్య మెప్పించింది. మిగతా నటీనటులు వారి పాత్రల మేరకు బాగా నటించారు. దర్శకుడి కథనం కొన్నిసార్లు ట్రాక్‌ తప్పినా.. వినోదాత్మకంగా తెరకెక్కించడంతో ఎక్కడా అలా అనిపించదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.


బలాలు :
+ కథాంశం
+ నటీనటుల
+ అభినయం సంభాషణలు

 బలహీనతలు :
- కథనం
- ట్రాక్‌ తప్పిన కథ

చివరగా: ‘మిషన్‌ మంగళ్‌’ సా...గిపోయింది


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.