రివ్యూ: టోటల్‌ ధమాల్‌
రివ్యూ: టోటల్‌ ధమాల్‌
సినిమా పేరు: టోటల్‌ ధమాల్‌ (హిందీ)
నటీనటులు: అజయ్‌ దేవగణ్‌, మాధురీ దీక్షిత్‌, అర్షద్‌ వార్సి, జావేద్‌ జఫ్రే, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, అనిల్‌ కపూర్‌, ఈషా గుప్తా, సంజయ్‌ మిశ్రా, జానీ లివర్‌ తదితరులు
సంగీతం: గౌరవ్, రోషిన్‌
కూర్పు: ధర్మేంద్ర శర్మ
సినిమాటోగ్రఫీ: కీకో నకాహరా
నిర్మాణ సంస్థ: అజయ్‌ దేవగణ్‌ ఫిలింస్‌, మారుతి ఇంటర్నేషనల్‌, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌
స్క్రీన్‌ ప్లే: వేద్‌ ప్రకాశ్‌, పరితోశ్‌ పెయింటర్‌, బంటీ రాథోడ్‌
కథ, దర్శకత్వం: ఇంద్రకుమార్‌
విడుదల తేదీ: 22-02-2019


సీక్వెల్‌ సినిమాలకు పెట్టింది పేరు అజయ్‌ దేవగణ్‌. ‘ధమాల్‌’తో పాటు ‘గోల్‌మాల్‌’ ఫ్రాంచైస్‌ నుంచి కూడా ఆయన నటించిన ఎన్నో సీక్వెల్స్‌ వచ్చాయి. ఇప్పుడు ‘ధమాల్‌’ సిరీస్‌ నుంచి మూడో సీక్వెల్‌ అయిన ‘టోటల్‌ ధమాల్‌’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి సినిమాలో నటీనటులంతా కలిసి జంతువులతో సందడి చేశారు. బాలీవుడ్‌లో అతిపెద్ద వైల్డ్‌ అడ్వెంచర్‌ సినిమా అంటూ ప్రచారం చేశారు. అదీకాకుండా అనిల్‌ కపూర్‌, మాధురీ దీక్షిత్‌ దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో మరోసారి వెండితెరపై మెరిశారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.


* కథేంటంటే..
ఓ వ్యక్తి చనిపోతూ జనక్‌పూర్‌లోని ఓ జంతుప్రదర్శన శాలలో రూ.50 కోట్లు ఉన్నాయని అజయ్‌ దేవగణ్‌, అనిల్‌ కపూర్‌, మాధురి, జావేద్‌ జఫ్రే, అర్షద్‌ వార్సిలకు చెబుతాడు. ఆ రూ.50 కోట్లు దొరికితే అందరూ వాటాలు పంచుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ మొత్తం డబ్బు కాజేయాలన్న ఆలోచనతో ఎవరికివారు ప్లాన్లు వేసుకుంటారు. అలా జనక్‌పూర్‌ చేరుకోవడానికి ఎవరికివారు చెరో దిక్కున బయలుదేరతారు. మొత్తానికి అందరూ జంతు ప్రదర్శనశాలకు చేరుకుంటారు. డబ్బు వెతికే క్రమంలో జంతువులు వీరిపై దాడి చేస్తుంటాయి. వాటి నుంచి ఎలా తప్పించుకున్నారు? ఆ రూ.50 కోట్లు ఎవరికి దక్కాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

* ఎలా ఉందంటే..
‘ధమాల్‌’ సిరీస్‌లో మొదటి సినిమా మంచి విజయం సాధించింది. రెండో సీక్వెల్‌ అయిన ‘డబుల్‌ ధమాల్‌’ ఫ్లాపైంది. దాంతో మూడో సినిమాను ‘ధమాల్‌’ కథ నేపథ్యంలో తెరకెక్కించాలని అనుకున్నారు దర్శకుడు ఇంద్రకుమార్‌. కొన్ని సన్నివేశాలు చూస్తే ‘ఇట్స్‌ ఎ మ్యాడ్, మ్యాడ్‌ వరల్డ్’ అనే హాలీవుడ్‌ సినిమాను రీమేక్‌ చేసినట్లుగా అనిపిస్తుంది. కానీ కామెడీ విషయంలో మాత్రం దర్శకుడు కాస్త తడబడ్డాడు. అసలు తెరపై ఓ పాత్ర డైలాగ్‌ చెబితే దానిని అర్థంచేసుకునేలోపే మరో డైలాగ్‌ వచ్చేస్తుంది. దాంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థంకాదు. పాటలు బాగానే కుదిరాయి. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.


* ఎవరెలా చేశారంటే..
అజయ్‌ దేవగణ్‌, అనిల్‌ కపూర్‌, మాధురి, జానీ లివర్‌ సినిమాలో హైలైట్‌గా నిలిచారు. అనిల్‌, మాధురి కెమిస్ట్రీ ఎవర్‌గ్రీన్‌ అని ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. ఎప్పుడూ గొడవపడుతూ ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్‌లు బాగా పండాయి. అజయ్‌ దేవగణ్‌ కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జానీ లివర్‌ గురించి. ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతవరకు కడుపుబ్బా నవ్వించారు. ఆయన కామిక్‌ టైమింగ్‌ బాగుంది. మిగతావారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగానే నటించారు.

బలాలు
+ పాటలు
+ నిర్మాణ విలువలు
+ అనిల్‌, మాధురి కెమిస్ట్రీ
+ జానీ లివర్‌ కామిక్‌ టైమింగ్‌

బలహీనతలు
- అక్కడక్కడా అర్థంకాని పంచ్‌లు, డైలాగులు

* చివరగా..
‘టోటల్‌’ గా నవ్వుకోవచ్చు..!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.