రివ్యూ: జబరియా జోడీ
తారాగణం: సిద్ధార్థ్‌ మల్హోత్రా, పరిణీతి చోప్రా, జావేద్‌ జాఫ్రీ, సంజయ్‌ మిశ్రా..
కథ: సంజీవ్‌. కె. ఝా
సంగీతం: తనిష్క్‌ బగ్చి, విశాల్‌ మిశ్రా, జోయెల్‌ క్రాస్టో
సినిమాటోగ్రఫీ: విశాల్‌ సిన్హా
నిర్మాణం: బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏఎల్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌
దర్శకత్వం: ప్రశాంత్‌ సింగ్‌


* కథేంటంటే..
బిహార్‌లోని మాధోపుర్‌లో అభయ్‌ సింగ్‌ (సిద్ధార్థ్‌ మల్హోత్రా) ఒక గ్యాంగ్‌స్టర్‌. రాజకీయ నాయకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు. అక్కడ కట్నం ఇచ్చి వివాహం జరిపించలేని ఆడపిల్లల కుటుంబాలు వరుడిని అపహరించి బలవంతంగా వివాహం జరిపించే ఘటనలు తరుచుగా జరుగుతుంటాయి. ఇలా వరుడిని అపహరించి పేదింటి అమ్మాయిలకు వివాహం జరిపిస్తే ప్రజలకు చేరువ కావచ్చని దీనినే వృత్తిగా మార్చుకుంటాడు అభయ్‌ సింగ్‌. ఈ క్రమంలో అభయ్‌కి తన చిన్ననాటి స్నేహితురాలు తారసపడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ సమయానికి అభయ్‌కి ప్రేమ.. కెరీర్‌ ఏదో ఒకటే తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అభయ్‌ దేన్ని ఎంచుకున్నాడు? ప్రేమలో గెలిచాడా? అనుకున్న లక్ష్యం సాధించాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

* ఎలా ఉందంటే..
సామాజిక దురాచారాన్ని వినోదాత్మకంగా తెరెక్కించిన విధానం బాగుంది. దర్శకుడు సీరియస్‌ అంశంలో కొన్నిపాళ్ల వినోదం కలగలిపి చక్కగా కథ సిద్ధం చేసుకున్నాడు. సమాజంలో చాలా కాలంగా ఉన్న ఓ సమస్యను ఎలా చూపిస్తారో అని అందరూ ఎదురు చూస్తుండగా వన్‌ లైన్‌ పంచ్‌లతో ఎవరినీ నొప్పించకుండా అలా అని కథ ట్రాక్‌ తప్పకుండా దర్శకుడు నడిపించాడు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రధాన పాత్రల మీద సహాయ పాత్రల డామినేషన్‌ ఎక్కువైనట్లు అనిపించింది. ఇది సినిమా మొత్తంగా చూస్తే పంటికింది రాయిలా ఉంటుంది.


* ఎవరెలా చేశారంటే..
సినిమాలో నాయకానాయికల కంటే ఇతర పాత్రలకే తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఎక్కువగా కలిగింది. సిద్ధార్థ మల్హోత్రా తనదైన శైలిలో డ్రామా సన్నివేశాల్లో మెప్పించాడు. పరిణీతి చోప్రా నటించడానికి పెద్దగా అవకాశం దక్కలేదు. చాలా సన్నివేశాల్లో కనిపించడానికి పరమితమైపోయింది. సహాయ నటుల్లో సంజయ్‌ మిశ్రా అదరగొట్టేశాడు. అతనితోపాటు జావెద్‌ జాఫ్రీ, అపరశక్తి ఖురానా మెప్పించారు.

* చివరిగా..
సీరియస్‌ కథలో... వన్‌ లైనర్లతో తెగ నవ్వించారు!

‘జబరియా జోడీ’కి ముందు కూడా కిడ్నాప్‌ పెళ్లి నేపథ్యంలో ఓ సినిమా వచ్చింది. 2010లో ‘అంతర్‌ ద్వంద్‌’ పేరుతో సుశీల్‌ రాజ్‌పాల్‌ తెరకెక్కించాడు. ఈ సినిమాకు జాతీయ పురస్కారాల్లో పురస్కారం కూడా దక్కింది. ‘సామాజిక అంశాల మీద తీసిన ఉత్తమ చిత్రం’గా ‘అంతర్‌ ద్వంద్‌’కు 2009లో పురస్కారం లభించింది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.