రివ్యూ:జోయా ఫ్యాక్టర్‌
చిత్రం: జోయా ఫ్యాక్టర్‌
తారాగణం: దుల్కర్‌ సల్మాన్‌, సోనమ్‌ కపూర్‌ తదితరులు
కథ: అనూజా చౌహాన్‌, ప్రద్యుమన్‌ సింగ్‌
స్క్రీన్‌ప్లే: నేహా రాకేశ్‌ శర్మ, ప్రద్యుమన్‌ సింగ్‌
సంగీతం: శంకర్‌-ఎహ్‌సాన్‌-లాయ్‌, ఇంద్రజిత్ శర్మ‌-పరీక్షిత్‌ శర్మ (నేపథ్యం)
ఎడిటింగ్‌: ఉత్సవ్‌ భగత్‌
సినిమాటోగ్రఫీ: మనోజ్‌ లోబో
నిర్మాణం: ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, యాడ్‌-లాబ్స్‌ ఫిల్మ్‌ లిమిటెడ్‌
దర్శకత్వం: అభిషేక్‌ శర్మ
విడుదల తేదీ: 20-09-2019

దక్షిణాది నటులు ఈ మధ్య బాలీవుడ్‌లోనూ రాణిస్తున్నారు. ‘కార్వాన్‌’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన దుల్కర్‌ సల్మాన్‌ తాజాగా నటించిన రెండో చిత్రం ‘జోయా ఫ్యాక్టర్‌’. చాలాకాలంగా మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సోనమ్‌ కపూర్‌ కథానాయికగా నటించారు. ‘తేరె బిన్‌ లాడెన్‌’ ‘పరమాణు’ వంటి చిత్రాలను తీసిన దర్శకుడు అభిషేక్‌ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది? దుల్కర్‌, సోనమ్‌కు హిట్‌ ఇచ్చిందా?


కథేంటంటే:
కపిల్‌ దేవ్‌ సారథ్యంలో 1983లో భారత క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ గెలుచుకున్న రోజే జోయా (సోనమ్‌ కపూర్‌) జన్మిస్తుంది. దీంతో జోయా తండ్రి ఆమెను అదృష్ట దేవతగా భావిస్తాడు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుందని సంబరపడిపోతాడు. జోయా పెద్దయ్యాక ఓ యాడ్‌ సంస్థలో ఉద్యోగం చేస్తుంటుంది. వృత్తిలో భాగంగా భారత క్రికెట్‌ జట్టుతో యాడ్‌ షూట్‌ చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో టీమిండియా వరస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీంతో జోయా తనకి ఉన్న అదృష్ట వరం గురించి క్రికెట్ జట్టుకు వివరిస్తుంది. ఆమె చెప్పినట్లే ఆ రోజు జరిగిన మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తుంది. దీంతో అందరూ ఆమె అదృష్టాన్ని నమ్మేస్తారు. టీమిండియా కెప్టెన్‌ నిఖిల్‌ కోడా (దుల్కర్‌ సల్మాన్‌) మాత్రం జోయా అదృష్టాన్ని నమ్మడు కానీ.. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అదే సమయంలో క్రికెట్‌ బోర్డులో జోయాకు ప్రాధాన్యం పెరగడంతో ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ.

ఎలా ఉందంటే:
అనూజా చౌహాన్‌ రాసిన ‘జోయా ఫ్యాక్టర్‌’ నవల ఆధారంగా రొమాంటిక్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. అదృష్టం అనే కాన్సెప్ట్‌.. క్రికెట్‌ను కలిపి ప్రేమ కథను తెరపై చూపించడం కొత్తగా ఉంది. అన్ని ప్రేమకథల్లోలాగే నాయకానాయికల మధ్య ప్రేమ, కోపం, ఈర్ష్య వంటివి ఇందులోనూ చూపించారు. సోనమ్‌, దుల్కర్‌ మధ్య కెమిస్ట్రీ బాగుంది. కానీ.. సినిమా తగ్గట్టుగా లేదనిపిస్తుంది. చిత్రంలో జోయా సోదరుడితో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడిని నవ్విస్తాయి. ఇతర సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్లుగా సాగుతుంటాయి. అతిథి పాత్రలో అనిల్‌ కపూర్‌ మెరిశారు. ఇక క్రికెట్‌ సన్నివేశాలు, క్రికెటర్లుగా నటీనటుల హావభావాలు, మ్యాచ్‌లు సహజత్వానికి దూరంగా ఉన్నాయి. సినిమాకి క్రికెట్‌ మెయిన్‌ సబ్జెక్ట్‌ కాకపోయినా.. వాటిపై దర్శకుడు దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.


ఎవరెలా చేశారంటే:
చిత్రంలో అన్ని సన్నివేశాల్లోనూ దుల్కర్‌, సోనమ్‌ కనిపిస్తారు. నిఖిల్‌గా దుల్కర్‌ చక్కగా నటించాడు. నిజానికి సినిమాని దుల్కర్‌ తన భుజాలపై మోశాడనడంలో సందేహం లేదు. అదృష్టంపై నమ్మకం లేని, స్వశక్తిని నమ్ముకునే ఆటగాడిగా తన నటన ఆకట్టుకుంటుంది. ఇక సోనమ్‌ కపూర్‌ తన పాత్రలో బాగా నటించింది. స్క్రీన్‌పై ఆమె కనిపించిన ప్రతిసారీ కొత్తగా.. అందంగా కనిపించింది.


సాంకేతికంగా:
సినిమాటోగ్రఫర్‌ మనోజ్‌ లోబో పనితనం అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ కనువిందు చేస్తుంది. సంగీతం.. సినిమాకు బలహీనతనే చెప్పాలి.సందర్భాను సారంగా పాటలు పెట్టే అవకాశమున్నా పెద్దగా ఉపయోగించుకోలేదు. నేపథ్యం సంగీతం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. 


బలాలు:

+ కథ
+ దుల్కర్‌, సోనమ్‌ నటన
+ సినిమాటోగ్రఫీ


బలహీనతలు
- సంగీతం
- ఊహించగలిగే సన్నివేశాలు
- సాగదీత ధోరణిCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.