రివ్యూ: శాండ్‌ కీ ఆంఖ్‌
చిత్రం: శాండ్‌ కీ ఆంఖ్‌

నటీనటులు: తాప్సి, భూమి పెడ్నేకర్‌, ప్రకాష్‌ ఝా, వినీత్‌కుమార్‌ సింగ్‌ తదితరులు

సంగీతం: విశాఖ మిత్ర, అద్వైత్‌ నిమ్లేకర్‌

ఎడిటింగ్‌: దేవేంద్ర మురుదీశ్వర్‌

సినిమాటోగ్రఫీ: సుధాకర్‌రెడ్డి యక్కంటి

నిర్మాత: అనురాగ్‌ కశ్యప్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

దర్శకత్వం: తుషార్‌ హీరానందని

బ్యానర్‌: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, చాక్‌ అండ్‌ చీసీ ఫిల్మ్స్‌

విడుదల తేదీ: 25-10-2019


ఇటీవల కాలంలో వెండితెరపై వరుస బయోపిక్‌లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో వీటి జోరు ఎక్కువగా ఉంది. అదే సమయంలో అవి బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే అందుకుంటున్నాయి. ఆ కోవలో.. ప్రపంచంలోనే వయో వృద్ధులైన షూటర్లుగా పేరు తెచ్చుకున్న ప్రకాషి తోమర్‌, చంద్రో తోమర్‌ జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘శాండ్‌ కీ ఆంఖ్‌’. ‘మస్తీ’, ‘గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ’ వంటి క్రైమ్‌, హారర్‌ కామెడీ చిత్రాలకు రచయితగా పనిచేసిన తుషార్‌ హీరానందని ఒక మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాప్సి, భూమి పెడ్నేకర్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. మరి వృద్ధ షూటర్లుగా వీరి నటన ఎలా ఉంది? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాళ్లు ఎందుకు తుపాకీ పట్టుకోవాల్సి వచ్చింది?

కథ: శాండ్‌ కీ ఆంఖ్‌

కథేంటంటే
: 1990ల్లో కథ మొదలవుతుంది. షూటింగ్‌ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు చంద్రో(భూమి పెడ్నేకర్‌), ప్రకాషి(తాప్సి)లు తమ భర్తలకు తెలియకుండా ఊరు వదిలి వచ్చేస్తారు. అక్కడి నుంచి కథ యాభై ఏళ్ల వెనక్కి వెళ్తుంది. నూతన వధువుగా తాప్సి పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్తుంది. అక్కడే భర్త చెల్లెలు(చంద్రో)కు బాగా దగ్గరవుతుంది. ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటారు. ఇంటి పనులు, పొలం పనులను కలిసి చేసుకుంటారు. అయితే ఆ ఇంటిలో ఆడవాళ్లను పిల్లలు కనే యంత్రాలుగానే చూస్తారు. ఇది వారికి ఎంతమాత్రమూ ఇష్టం ఉండదు. దీంతో వారిద్దరూ షూటింగ్‌ నేర్చుకుని పోటీల్లో పాల్గొంటారు. అలా మొదలైన వారి షూటింగ్‌ ప్రస్థానం ఎక్కడ వరకూ వెళ్లింది? ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన ఆ ఇద్దరు మహిళలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని అధిగమించి ప్రపంచంలోనే వృద్ధ షూటర్లుగా ఎలా కీర్తి గడించారు? అన్నదే అసలు కథ.


* ఎలా ఉందంటే..
ఏడు పదుల వయసులో ప్రపంచంలోనే వయోవృద్ధులైన షూటర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాషి తోమర్‌, చంద్రో తోమర్‌ అనే మహిళల జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కింది. మహిళలు తలుచుకుంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి పనినైనా అలవోగా చేసేస్తారనడానికి ప్రకాషి, చంద్రోలే ఉదాహరణ. వాళ్ల స్ఫూర్తిదాయక కథను అంతే స్ఫూర్తిమంతంగా తెరపై చూపించాడు దర్శకుడు. ఆ రోజుల్లో మహిళలు ఎలాంటి కట్టుబాట్ల మధ్య జీవించారు? వారికి సమాజంలో ఎలాంటి ప్రాధాన్యం ఉండేది? ఇలాంటి అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిగణనలోకి తీసుకున్నాడు. ప్రథమార్ధంలో ప్రకాషి, చంద్రోల మధ్య అనుబంధం, ఒకరంటే ఒకరికి అభిమానం ఎలా ఉండేది? వంటి అంశాలను స్పృశించాడు. అదే సమయంలో వారి కుటుంబాల్లో మహిళలను చూసే విధానం, వాళ్లలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించకుండా అణగదొక్కాలనే పురుషాధిక్య ప్రపంచాన్ని కళ్లకు కట్టాడు. గ్రామీణ సమాజంలో ఇప్పటికీ మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారు. అలాంటిది 90 దశకంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాటన్నింటినీ ఎంతో చక్కగా చూపించాడు. సల్మాన్‌, అక్షయ్‌ సినిమాల్లో మహిళలకు ఎవరో ఒక పురుష పాత్ర పైకి ఎదిగేందుకు సహాయం చేసేలా కథలు ఉంటాయి. ఇందులో అలాంటి బలమైన పాత్ర మనకు కనిపించదు. జీవిత కథను యథాతథంగా చూపిస్తే, రక్తికట్టదు. అదే సమయంలో చూసేవారికి అదో డాక్యుమెంటరీ అనిపిస్తుంది. అలాంటి భావన కలగకుండా దర్శకుడు కాస్త స్వేచ్ఛను తీసుకున్నాడు. స్వతహాగా రచయిత అయిన హీరా నందని కాస్త స్వేచ్ఛ తీసుకున్నాడు. కథ, కథనాల్లో, సంభాషణల్లో తనదైన మార్కు చూపించాడు.


* ఎవరెలా చేశారంటే..
వృద్ధ షూటర్లుగా భూమి పెడ్నేకర్‌, తాప్సిలు అద్భుతంగా నటించారు. చంద్రో, ప్రకాషి తోమర్‌లుగా కనిపించడానికి వారు తెర వెనుక బాగానే కృషి చేశారు. వృద్ధులుగా హావభావాలు పలికించడంలోనూ, డైలాగ్‌లు చెప్పడంలోనూ చక్కని పరిణతి కనబరిచారు. సినిమా చూస్తున్నంత సేపూ వారి పాత్రల్లో నిజమైన వదిన-మరదళ్లే కనపడతారు. అంతలా ఆ పాత్రల్లో ఇమిడిపోయి నటించారు. గ్రామీణ మాండలికాన్ని నేర్చుకుని సంభాషణలు పలికారు. ప్రకాషి, చంద్రోలను కలుసుకుని వారి జీవిత ప్రస్థానాన్ని తెలుసుకుని పాత్రల కోసం సన్నద్ధమయ్యారు. సాంకేతికంగా సినిమాను చక్కగా తీర్చిదిద్దారు. సుధాకర్‌ రెడ్డి యక్కంటి సినిమాటోగ్రఫీ, దేవంద్ర మురుదేశ్వర్‌ ఎడిటింగ్‌ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. విశాఖ మిత్ర, అద్వైత్‌ నిమ్లేకర్‌ సంగీతం బాగుంది. పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన హీరానందని ఒక మహిళా స్ఫూర్తిదాయక కథను తెరకెక్కించడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఆయన గత చిత్రాల్లో అడల్ట్‌ కామెడీనే ఎక్కువ. వాటికి పూర్తి భిన్నంగా ‘శాండ్‌కీ ఆంఖ్‌’ను చక్కగా స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


బలాలు

+ తాప్సి, భూమిపెడ్నేకర్
+ దర్శకత్వం
+ సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు
- ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు

- కమర్షియల్‌ కథగా మలచలేకపోవడం

* చివరిగా..
నిజ జీవితంలోనే కాదు.. వెండితెరపైన వృద్ధ షూటర్లు అలరిస్తారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.