సత్యమేవ జయతే: రివ్యూ
రివ్యూ: సత్యమేవ జయతే
సినిమా పేరు: సత్యమేవ జయతే(హిందీ)
నటీనటులు: జాన్‌ అబ్రహం, మనోజ్‌ బాజ్‌పాయ్‌, నోరా ఫతేహి, దేవ్‌దత్తా నాగే తదితరులు
సంగీతం: సాజిద్‌-వాజిద్‌
సినిమాటోగ్రఫీ: నిగమ్‌ బోమ్జాన్‌
కూర్పు: మాహిర్‌ జవేరీ
నిర్మాణ సంస్థ: టి సిరీస్‌ ఫిలింస్‌, ఎమ్మె ఎంటర్‌టైన్‌మెంట్‌
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: మిలాప్‌ మిలాన్‌ జవేరీ
విడుదల తేదీ: 15-8-2018చివరిగా ‘పరమాణు: ది స్టోరీ ఆఫ్‌ పోఖ్రాన్‌’ చిత్రంతో మెప్పించి విజయాన్నందుకున్నాడు బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహమ్‌. అదే ఉత్సాహంతో ఇప్పుడు ‘సత్యమేవ జయతే’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోని అవినీతిపై పోరాడే యువకుడిగా నటించాడు జాన్‌. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సత్యమేవ జయతే’ ఎలా ఉంది? ‘పరమాణు’ చిత్రంలాగే ఇది కూడా మంచి విజయం అందుకుంటుందా? తెలుసుకుందాం.

కథేంటంటే: వీరేంద్ర కుమార్‌ సింగ్‌(జాన్‌ అబ్రహమ్‌)కు పోలీస్‌ శాఖ అంటే గౌరవం. అయితే ఖాకీ ముసుగులో కొందరు అవినీతిపరులు చేస్తున్న దురాగతాలు చూసి చలించిపోతాడు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశానికి అవినీతి నుంచి ఇంకా స్వాతంత్య్రం రాలేదని భావిస్తాడు. అవినీతిని అంతమొందించడానికి కంకణం కట్టుకుంటాడు. యూనిఫాంకు మచ్చ తెస్తున్న అవినీతిపరులైన అధికారులను ఎవరికీ అనుమానం రాకుండా అతి కిరాతకంగా చంపుతుంటాడు. ఈ హత్యలు నగరంలో సంచలనం రేపుతాయి. ఈ కేసును ఛేదించడానికి డీసీపీ శివాన్ష్‌ (మనోజ్‌ బాజ్‌పాయ్‌) రంగంలోకి దిగుతాడు. అతనికి వీరేంద్ర గురించి తెలిసిందా? తను నమ్మిన ఆశయం కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధమైన వీరేంద్రను డీసీపీ పట్టుకున్నాడా? వీరేంద్ర హిట్‌ లిస్ట్‌లో ఇంకా ఎవరెవరున్నారు అన్న విషయాలు తెరపై చూడాలి.


ఎలా ఉందంటే: భారతీయ న్యాయవ్యవస్థ గురించి ప్రశ్నించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు మిలాప్‌ జవేరీ. దేశానికి ద్రోహం చేస్తున్నారు అంటూ జాన్‌ అబ్రహం చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చే సాధారణ సంభాషణలు కూడా నాటకీయంగా ఉండడంతో సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్‌ ఉండదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్న చిత్రం కదా అని ప్రతి సన్నివేశంలో జాతీయ జెండాను చాలా సార్లు చూపించారు దర్శకుడు. దాంతో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే: అన్యాయాన్ని అరికట్టే పోలీసు అధికారి పాత్రలో జాన్‌ అబ్రహం ఇమిడిపోయారు. పోలీస్‌గా కన్పించిన ప్రతి సన్నివేశంలో నిబద్ధతతో నటించారు. సంభాషణలు కూడా చక్కగా పలికారు. పోలీస్‌ ఆఫీసర్‌కు ఉండాల్సిన సీరియస్‌నెస్‌, డిసిప్లైన్‌ను తన హావభావాలతో చక్కగా ప్రదర్శించారు. డీసీపీ శివాన్ష్‌గా మనోజ్‌ బాజ్‌పాయ్‌ పాత్ర సినిమాకు కీలకం. మిగతా వారు తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు. హీరోయిన్‌ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోయినప్పటికీ తెరపై అందంగా కన్పించింది.

బలాలు:
+ జాన్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌
+ సంభాషణలు

బలహీనతలు:
- అక్కడక్కడా విసుగు తెప్పించే సన్నివేశాలు

చివరగా: దేశం కోసం ఓ పోలీసు పడిన కష్టమే ‘సత్యమేవ జయతే’

గమనిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.