రివ్యూ: ఠాక్రే
సినిమా పేరు: ఠాక్రే (హిందీ)
నటీనటులు: నవాజుద్దిన్‌ సిద్ధిఖి, అమృతా రావు, సుధీర్‌ మిశ్రా, లక్ష్మణ్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, అనుష్క జాదవ్‌ తదితరులు
కూర్పు: ఆశిష్‌ మహాత్రే
సంగీతం: రోహన్‌, సందీప్‌
సినిమాటోగ్రఫీ: సుదీప్‌ ఛటర్జీ
నిర్మాణ సంస్థ: వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిజీత్‌ పాన్సే
విడుదల తేదీ
: 25-01-2019బయోపిక్‌లు ఎక్కవవుతున్న తరుణంలో చర్చనీయాంశంగా మారిన చిత్రం ‘ఠాక్రే’. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే జీవితాధారంగా ఈ చిత్రాన్ని అభిజీత్‌ పాన్సే తెరకెక్కించారు. ఠాక్రే పాత్రలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దిన్‌ సిద్ధిఖి నటించారు. ట్రైలర్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఠాక్రే’ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

* కథేంటంటే..
 బాల్‌ కేశవ్‌ ఠాక్రే (నవాజుద్దిన్‌ సిద్ధిఖి)ను న్యాయస్థానం బాబ్రి మసీద్‌ కేసు గురించి ప్రశ్నిస్తున్న సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి ఆయన జీవితానికి సంబంధించిన సన్నివేశాలు చూపించారు. ఆయన క్యారికేచరిస్ట్‌గా పని చేసి కొన్నాళ్ల తర్వాత తన ఉద్యోగాన్ని వదిలేయడం, మహారాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకోవడం వంటివి చూపించారు. ముంబయిపై ప్రధాన హక్కు మరాఠీలదే అవ్వాలని నిర్ణయించుకున్న ఠాక్రే అందుకోసం ఏం చేశారు? ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నారు? తదితర విషయాలను తెరపైనే చూడాలి.


* ఎలా ఉందంటే..
 ఠాక్రే జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో ఆయనకు సంబంధించినంత వరకు అన్నీ మంచి విషయాలను మాత్రమే చూపించారు దర్శకుడు అభిజీత్‌. దాంతో కొన్ని సన్నివేశాల్లో లాజిక్‌ మిస్సయినట్లు అనిపిస్తుంది. ఓ పొలిటికల్‌ లీడర్‌ గురించి తీసే అన్ని బయోపిక్స్‌లో వివాదాస్పద అంశాలకు ఆస్కారం లేకుండా ఉంటాయి. అభిజీత్‌ కూడా ఇదే పద్ధతిని ఫాలో అయిపోయారు. ఎక్కువగా వివాదాస్పద సన్నివేశాలను చూపించేందుకు ప్రయత్నించలేదు. కొన్ని సన్నివేశాలను శివసేన కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లున్నారు. పాటలు, నేపథ్య సంగీతం బాగా కుదిరాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఎవరెలా చేశారంటే..
 సినిమా మొత్తంలో నవాజుద్దిన్‌ సిద్ధిఖినే హైలైట్‌గా నిలిచారు. ఠాక్రేగా ఆయన నటించిన తీరుకు వంద మార్కులు పడి తీరాల్సిందే. ఠాక్రేగా ఆయన లుక్‌ నుంచి వాయిస్‌ వరకు అన్నీ బాగా కుదిరాయి. ఠాక్రే భార్య మీనాతాయ్‌ పాత్రలో అమృతారావు నటించారు. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోయినప్పటికీ ఉన్నంతలో బాగా నటించారు. మిగతా పాత్రధారులంతా ఎవరికి వారు బాగానే నటించారు.


బలాలు
:
+ నవాజుద్దిన్‌ నటన
+ నిర్మాణ విలువలు

బలహీనతలు:
- లాజిక్‌ లేదేమో అన్నట్లుగా కొన్ని సన్నివేశాలు

చివరిగా: వెండితెరపై గర్జించిన ‘ఠాక్రే’
గమనిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.