సినిమా: ది స్కై ఈజ్‌ పింక్‌
నటీనటులు: ప్రియాంకా చోప్రా, ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వాసీం, రోహిత్‌ సరఫ్‌ తదితరులు
సాంకేతికవర్గం:
కూర్పు: మానస్‌ మిట్టల్‌ సంగీతం: ప్రీతమ్‌ సినిమాటోగ్రఫీ: కార్తిక్‌ విజయ్‌, నిక్‌ కూక్‌మ దర్శకత్వం: సోనాలీ బోస్‌ 
నిర్మాతలు: రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌, ప్రియాంకా చోప్రా, మధు చోప్రా
విడుదల తేదీ: 11-10-2019


నిజ జీవిత కథలను తెరకెక్కించేందుకు దర్శకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ కోవలో అనేక చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మరో కథ తెరపైకి వచ్చింది. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురైనప్పటికీ 15 ఏళ్లకే స్ఫూర్తిదాయక వక్తగా, రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరి జీవితకథతో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. 18 ఏళ్ల వయసులో ఆమె రాసిన ‘లిటిల్‌ ఎపిఫనీస్‌’ పుస్తకం విడుదలైన తర్వాతి రోజే కన్నుమూసింది. ఇందులో ప్రియాంకా చోప్రా అయిషా తల్లి పాత్రలో నటించడం విశేషం. అయిషాగా జైరా వాసీం కనిపించారు. 2016 ‘జై గంగాజల్‌’ తర్వాత ప్రియాంక బాలీవుడ్‌లో నటించిన సినిమా ఇది కావడం మరో విశేషం. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? ప్రియాంక, ఫర్హాన్‌ కెరీర్‌లో మరో హిట్టుగా నిలిచిందా?


కథేంటంటే:
నిరేన్‌ చౌదరి (ఫర్హాన్‌ అక్తర్‌) ఓల్డ్‌ దిల్లీలో ఉంటూ ఓ చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. సౌత్‌ దిల్లీ అమ్మాయి అదితి (ప్రియాంకా చోప్రా)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ వివాహం చేసుకుంటారు. తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టి చనిపోతుంది. తమ జీన్స్‌లో సమస్య ఉందని, భవిష్యత్తులో పిల్లలు పుట్టినా.. జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిరేన్‌, అదితికి తెలుస్తుంది. రెండో సంతానంగా బాబు జన్మిస్తాడు. అతడి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. కానీ ఆ తర్వాత అమ్మాయి అయిషా జన్యుపరమైన వ్యాధితో పుడుతుంది. తమ కుమార్తెకు చికిత్స చేయించేందుకు అదితి దంపతులు లండన్‌కు వెళ్తారు. ఎముకల మజ్జ మార్పిడి అధిక ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో రేడియో షోలో పనిచేస్తారు. లండన్‌లోనే పదేళ్లు కష్టపడి కుమార్తెకు చికిత్స చేయిస్తారు. ఆరోగ్యం బాగుందని వైద్యులు చెప్పిన తర్వాత తిరిగి దిల్లీ చేరుకుంటారు. కొన్ని రోజులు సంతోషంగా ఉన్న వారి జీవితంలో ఒక్కసారిగా విషాదం నిండుతుంది. లండన్‌లో చేయించిన చికిత్సలు అయిషాపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆమె ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దానికి చికిత్స లేదు. చివరికి ఆక్సిజన్‌ సిలిండర్ల సహాయంతో జీవిస్తుంటుంది. ఆ తర్వాత అయిషా మానసికంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది, మృత్యువును జయించిందా? అనే విషయాలను తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే:

అయిషా చౌదరి జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ కథ అందరికీ తెలిసిందే. కానీ, దర్శకుడు దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విజయం సాధించారు. అయిషా కుటుంబ నేపథ్యాన్ని చక్కగా చూపించారు. కన్నబిడ్డ కోసం ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనే తల్లిదండ్రులుగా ప్రియాంక, ఫర్హాన్‌ కనిపించారు. వెండితెరపై ఈ జంట ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయిషా పాత్ర ప్రేక్షకుడిలో స్ఫూర్తిని నింపుతుంది, జీవితానికి కొత్త అర్థం తెలుపుతుంది. కొన్ని సన్నివేశాలు కన్నీరు పెట్టిస్తాయి. కానీ, వినోదానికి పెద్ద పీట వేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సంగీతం అలరిస్తుంది.


ఎవరెలా చేశారంటే:

ప్రియాంక, ఫర్హాన్‌ దంపతుల పాత్రల్లో ఒదిగిపోయారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒక్కటిగా సమస్యల్ని పరిష్కరించుకోవడం.. తమ మధ్య ప్రేమను అలాగే ఉంచుకునే దంపతులుగా ఆకట్టుకుంటారు. ప్రియాంక, ఫర్హాన్‌.. పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రోహిత్‌ షరఫ్‌ బాధ్యతగల సోదరుడిగా మెప్పిస్తారు. అయిషానే స్వయంగా నటించిందా? అనే సందేహం కలిగేలా జైరా ఆ పాత్రలో జీవించారు. ఆమె నటనను మెచ్చుకోకతప్పదు.

బలాలు

+ కథ, కథనం

+ నటీనటుల నటన

+ వినోదాత్మక సన్నివేశాలు


బలహీనతలు

- తెలిసిన కథ కావడం

చివరిగా: ఆకట్టుకునే ‘స్కై ఈజ్‌ పింక్‌’


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.