రివ్యూ: ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌
రివ్యూ: ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌
చిత్రం: ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌
నటీనటులు: విక్కీ కౌశల్‌, పరేష్‌రావల్‌, రజిత్‌ కపూర్‌, యామీ గౌతమ్‌, కృతి కుల్హారి, మోహిత్‌ రైనా, ఇవాన్‌ రోడ్రిగ్స్‌, మానసి ఫరేక్‌, స్వరూప్‌ సంపత్‌, రాజ్‌ బబ్బర్‌ తదితరులు
సంగీతం: శాశ్వత్‌ సచ్‌దేవ్‌
సినిమాటోగ్రఫీ: మితేష్‌
ఎడిటింగ్‌: శివకుమార్‌
నిర్మాత: రోనీ స్క్రూవాలా
దర్శకత్వం: ఆదిత్య ధర్‌
బ్యానర్‌: ఆర్‌ఎస్‌వీపీ మూవీస్‌
విడుదల: 11-01-2019


యథార్థ సంఘటనల ఆధారంగా బాలీవుడ్‌లో తరచుగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఆ కోవలోనే వచ్చిన మరో చిత్రం ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’. 2016లో భారత సైన్యం పాకిస్థాన్‌పై చేపట్టిన మెరుపు దాడుల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఉరీలో భారత సైనికులను దారుణంగా హతమార్చిన పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకు భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. పటిష్ఠ వ్యూహంతో, అత్యంత ధైర్య సాహసాలతో చేసిన ఈ దాడులతో భారత సైన్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. మరి వెండితెరపై ఆ పోరాట ఘట్టాలు ఎలా ఉన్నాయి? ఆర్మీ మేజర్‌ పాత్రలో విక్కీ కౌషల్‌ ఏ మేరకు అలరించారు?

* కథేంటంటే..
ఉరీలో 19మంది భారత సైనికులను పాకిస్థాన్‌ ఉగ్రవాదులు దారుణంగా హత్య చేస్తారు. దీంతో ఒక్కసారిగా దేశంలో విషాదఛాయలు అలుముకుంటాయి. ఈ ఘటనపై భారత ఆర్మీలో తీవ్ర చర్చ జరుగుతుంది. భారత సైనికులను పొట్టన పెట్టుకున్న ముష్కర మూకలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆర్మీ నిర్ణయానికి వస్తుంది. మెరుపు దాడులు చేయడమే అందుకు సరైన మార్గమని జాతీయ భద్రతా సలహాదారు గోవింద్‌(పరేష్‌రావల్‌) సూచిస్తారు. అందకు ప్రధాని సహా, రక్షణ, హోంశాఖ మంత్రులు కూడా అంగీకరిస్తారు. అందుకు ఎంతో ధైర్య వంతుడైన ఆర్మీ మేజర్‌ విహాన్‌ షెహగల్‌(విక్కీ కౌషల్‌)ను ఎంచుకుంటారు. అతను ఒక బృందాన్ని తయారు చేస్తాడు. అందులో కెప్టెన్‌ కరణ్‌ కశ్యప్‌(రైనా)కూడా ఉంటాడు. ఆ బృందం పాక్‌ ఉగ్ర శిబిరాలపై దాడికి ఎలా సన్నద్ధమైంది? ఎలాంటి వ్యూహాలు అమలుపర్చింది? దాడులు చేస్తున్న సమయంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికుల కుటుంబాల మానసిక పరిస్థితి ఏంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను చూడాలంటే సినిమాకు వెళ్లాల్సిందే!

* ఎలా ఉందంటే..
దేశభక్తి ఇతివృత్తంగా గతంలో చాలా సినిమాలు వచ్చాయి. స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో వచ్చిన చిత్రాలన్నీ ఆ కోవకు చెందినవే. అయితే, అప్పట్లో బ్రిటిష్ వారి అరాచక పాలనకు ఆయా సినిమాల్లోకి కథానాయకులు ధ్వజమెత్తితే.. ఈ చిత్రం పాక్‌ ఉగ్రమూకలపై మన కథానాయకుడు, ఆయన బృందం పోరాడుతుంది. పాకిస్థాన్‌లో ప్రవేశించేందుకు మెరుపుదాడుల బృందం ఎలాంటి శిక్షణ తీసుకుంది? ఎలాంటి అత్యాధునిక యుద్ధ సామాగ్రిని వినియోగించారు.. అనే అంశాలను ఇందులో చూపించారు. ఆర్మీ పాక్‌లో ప్రవేశించడం.. అక్కడ దాడులు చేయడం తదితర సన్నివేశాలు హాలీవుడ్‌ సినిమాను తలపిస్తాయి.


* ఎవరెలా చేశారంటే..
ఆర్మీ మేజర్‌గా విక్కీ కౌషల్‌ చక్కగా నటించాడు. ఆ పాత్ర కోసం విక్కీ ఎంత కష్టపడ్డాడో తెరపై కనిపిస్తుంది. సినిమా మొత్తం అతని చుట్టూనే నడుస్తుంది. పరేష్‌రావల్‌, యామిగౌతమ్‌, రజిత్‌కపూర్‌లు తమ పరిధిమేర నటించారు. ఉరీ ఘటనకు ప్రతీకారంగా చేసిన మెరుపుదాడులు కూడా మంచి కథాబలమున్న యథార్ధ ఘటన. దాన్ని నేపథ్యంగా తీసుకుని సినిమా తీయాలన్న ఆలోచన దర్శకుడు ఆదిత్య ధర్‌కు రావడం నిజంగా అభినందనీయం. అయితే, ఆ కథను బలంగా చెప్పడంలో ఆదిత్య కాస్త తడబడ్డాడు. కథను డీల్‌ చేయడంలో అతని అనుభవం సరిపోలేదు. మెరుపుదాడులకు వెళ్తున్న వారందరినీ ప్రాణాలతో తీసుకొస్తానని కథానాయకుడు విక్కీ చెబుతాడు. అయితే, సినిమా వచ్చిన ప్రేక్షకుడికి మాత్రమే దర్శకుడు ఆ హామీని ఇవ్వలేకపోయాడు. సాంకేతికంగా.. సచ్‌దేవ్‌ నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా మెరుపుదాడుల సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. సినిమాకు ఏ వనరులు అవసరమో అవన్నీ ఉన్నాయి.


బలాలు

+ కథా నేపథ్యం
+ మెరుపుదాడులు

బలహీనతలు
- దర్శకుడి అనుభవలేమి
- అక్కడక్కడా సన్నివేశాల్లో సాగతీత

* చివరిగా..
సక్సెస్‌ఫుల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌.. కానీ తెరపై కాదు!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.